88 రోజులైనా అధికారికంగా ప్రకటించని కేంద్రప్రభుత్వం
మహిళా రిజర్వేషన్ల చట్టం, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల కోసమేనా?
2008 నాటి 87 రోజుల రికార్డు బద్దలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసి 88 రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా సమావేశాలను ముగించలేదు. లోక్సభ, రాజ్యసభలను ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటివరకు ప్రొరోగేషన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో పార్లమెంటు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 88 రోజుల పాటు సమావేశాలు అధికారికంగా ముగియకుండా కొనసాగుతున్నాయి. 2008లో నమోదైన 87 రోజుల రికార్డును ఇది అధిగమించింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణతోపాటు లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి నియోజకవర్గాల పునర్విభజనతో గరిష్టంగా 850కి పెంచే ప్రతిపాదనల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాలను అధికారికంగా ముగించకుండా ఉంచిందనే చర్చ రాజకీయ వర్గాల్లో చోటుచేసుకుంది. ప్రస్తుత సమావేశాలను అధికారికంగా ముగించకుండా ఉంచడం వల్ల అవసరమైతే రెండు రోజుల ముందస్తు నోటీసుతోనే అదే సమావేశాల్లో ప్రత్యేకంగా పార్లమెంటును తిరిగి సమావేశపరిచే అవకాశం ఉంటుంది. కొత్త సమావేశాలను నిర్వహించాలంటే కనీసం 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా ఉంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుతో ముడిపడిన రాజ్యాంగ సవరణ బిల్లు గత ఏప్రిల్ 17న బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో లోక్సభ ఆమోదం పొందలేకపోయింది. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో ఆ బిల్లు వీగిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆ బిల్లును ముందుకు తీసుకురావాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. అయితే, నిరవధికంగా సమావేశాలు వాయిదా పడిన తరువాత పార్లమెంటు సమావేశాలను ఎన్ని రోజుల్లోగా అధికారికంగా ముగించాలనే విషయంపై రాజ్యాంగంలో నిర్దిష్ట గడువు లేదు. ఎక్కువ రోజులు ప్రొరోగ్ చేయకుండా ఉంచినంత మాత్రాన రాజ్యాంగపరంగా లేదా పార్లమెంటరీ విధానాల పరంగా తప్పిదం జరిగినట్లు కాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
గత రికార్డు బద్దలు
గతంలో 1987లో 76 రోజులు, 1989లో 54 రోజులు, 2006, 2013 సంవత్సరాల్లో 49 రోజుల చొప్పున పార్లమెంటు సమావేశాలు అధికారికంగా ముగియకుండా కొనసాగాయి. 1963లో 41 రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొంది. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు జులై 21, 22 తేదీల్లో లోక్సభ సమావేశమైంది. అనంతరం అక్టోబర్ 17న తిరిగి సమావేశమై అక్టోబర్ 24న వాయిదా పడింది. డిసెంబర్ 10న మరోసారి సమావేశం కావాల్సి ఉండటంతో అప్పట్లో 87 రోజుల పాటు సమావేశాలు అధికారికంగా ముగియకుండా కొనసాగాయి. తాజాగా ఆ రికార్డును అధిగమించి 88 రోజులకు చేరడం పార్లమెంటరీ చరిత్రలో ప్రాధాన్యత సంతరించుకుంది.






కామెంట్లు (0)