Magazines

పోలియో టీకాల సంస్థకు తాళం

21 గంటల క్రితం

Polio vaccine
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 3 నిమిషాల చదవడం

బీఐబీసీఓఎల్‌ను మూసేసిన మోడీ సర్కార్‌

మూడేండ్లుగా జీతాల్లేక కార్మికుల అవస్థలు

వైద్యం చేయించుకోలేక.. పిల్లల చదువులు కొనసాగించలేక కుటుంబాల ఆవేదన

60 శాతం పోలియో టీకాలు తయారు చేసిన ప్రభుత్వ సంస్థ శాశ్వతంగా మూత


​దేశాన్ని పోలియో రహితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థకు మోడీ ప్రభుత్వం శాశ్వతంగా తాళం వేసింది. ఒకప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, దేశానికి అవసరమైన పోలియో టీకాల్లో 60 శాతం సరఫరా చేసిన భారత్‌ ఇమ్యునలాజికల్స్‌ అండ్‌ బయోలాజికల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఐబీసీఓఎల్‌) ఇప్పుడు నిరుపయోగంగా మారింది. సంస్థలో పనిచేసిన సుమారు 100 మంది ఉద్యోగులు మూడేండ్లుగా జీతాల్లేక అష్టకష్టాలు పడుతున్నారు. వైద్యం చేయించుకోలేక, పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక, అప్పుల ఊబిలో కూరుకుపోయిన కార్మికుల గోడును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంస్థను పునరుద్ధరిస్తామని గతంలో హామీలు ఇచ్చి చివరకు మూసివేతకు ఆమోదం తెలిపి చేతులు దులుపుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మికుల సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టని మోడీ సర్కారు అసలు వైఖరికి బీఐబీసీఓఎల్‌ మూసివేత నిదర్శనంగా నిలుస్తోంది.


లక్నో : యూపీలోని బులంద్‌షహర్‌లో ఉన్న బీఐబీసీఓఎల్‌ ఒకప్పుడు దేశ ఆరోగ్య రంగంలో కీలకమైన సంస్థ. 1989లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ చొరవతో, సోవియట్‌ సహకారంతో ఈ సంస్థ ఏర్పాటైంది. దేశంలో పోలియో వ్యాధిని నిర్మూలించడంతోపాటు టీకాల తయారీలో స్వయం సమృద్ధి సాధిం చాలన్న లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. 1996లో వాణిజ్యపరంగా టీకాల ఉత్పత్తి మొదలైంది. ఒక దశలో దేశానికి అవసరమైన పోలియో టీకాల్లో 60 శాతం ఈ సంస్థ నుంచే సరఫరా అయ్యేవి. 2012 జనవరిలో భారత్‌ వరుసగా ఏడాది పాటు ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకుండా కీలక విజయాన్ని సాధించింది. అలాంటి సంస్థ ఇప్పుడు శిథిలావస్థకు చేరడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

​నిలిచిన టీకాల ఉత్పత్తి

2022 డిసెంబరులో ఫ్యాక్టరీలో టీకాల ఉత్పత్తి నిలిచిపోయింది. అప్పటి నుంచి సుమారు 100 మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. తమ బకాయిలు చెల్లించాలని, సంస్థను తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. సీబీఐ, లోక్‌పాల్‌ వంటి సంస్థలను కూడా సంప్రదించారు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది. 2025 మార్చిలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సంస్థ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సిఫారసు చేసింది. అదే ఏడాది డిసెంబరులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఉద్యోగుల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ సంస్థను కాపాడలేకపోయారు.

​ఈ ఏడాదే మూసివేతకు కేంద్రం ఆమోదం

ఈ ఏడాది సెప్టెంబర్‌ 17న బీఐబీసీఓఎల్‌ మూసివేతకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సంస్థ పునరుద్ధరణపై ఉద్యోగులు పెట్టుకున్న చివరి ఆశ కూడా ఆవిరైంది. అయితే ఉద్యోగుల సర్వీసుల పరిస్థితి ఏమిటి? బకాయి జీతాలు, ఇతర ప్రయోజనాలు ఎప్పుడు చెల్లిస్తారు? ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తారా? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. మూసివేతపై తమకు అధికారిక సమాచారం కూడా అందలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా.. ప్రక్రియ కొనసాగుతోందని బయోటెక్నాలజీ విభాగం సంయుక్త కార్యదర్శి ఏక్తా విష్ణోయ్‌ సమాధానమిచ్చారు.

ఇతర టీకాల తయారీలోకి తీసుకెళ్లలేని ప్రభుత్వం

సంస్థను ఇతర టీకాల తయారీలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా విఫల మయ్యాయి. 2021లో భారత్‌ బయోటెక్‌తో కలిసి కోవాగ్జిన్‌ తయారీకి బీఐబీసీఓఎల్‌ను ఎంపిక చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం రూ.30 కోట్ల నిధులు ప్రకటించినా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. కలరా టీకా అభివృద్ధి కోసం మరో సంస్థతో చేపట్టిన ప్రాజెక్టుకు రూ.11.40 కోట్ల నిధులు ఇచ్చినా.. కాగ్‌ నివేదిక ప్రకారం ఒక్క సాంకేతిక లక్ష్యాన్ని కూడా సాధించలేక పోయారు. మరోవైపు, 2003లో కేంద్రం రూ.4.72 కోట్ల రుణంపై వడ్డీని మాఫీ చేసి, రుణాన్ని వాటాలుగా మార్చడం ద్వారా సంస్థకు గతంలో ఆర్థికంగా చేయూత నిచ్చింది. అప్పట్లో సంస్థ తిరిగి లాభాల్లోకి వచ్చింది. అలాంటి సంస్థను ఇప్పుడు పునరుద్ధరించకుండా మూసివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాడుబడిన భవనాలు, తుప్పుబట్టిన పరికరాలు

ప్రస్తుతం బీఐబీసీఓఎల్‌ ప్రాంగణం పాడుబడిన భవనాలు, తుప్పుబట్టిన పరికరాలు, పెరిగిపోయిన చెట్లతో దారుణంగా మారింది. ఒకప్పుడు దేశ ప్రజల ఆరోగ్యానికి సేవలందించిన పరిశ్రమలో ఇప్పుడు వాచ్‌మెన్‌ తప్ప ఎవరూ కనిపించడం లేదు. పోలియో నిర్మూలనకు కృషి చేసిన కార్మికులు తమ కుటుంబాలనే పోషించుకోలేని స్థితికి చేరుకున్నారు. లక్షలాది మందిని పోలియో నుంచి కాపాడిన సంస్థను మూసివేసిన మోడీ సర్కారు.. ఆ సంస్థను నిలబెట్టిన కార్మికుల జీవితాలకు మాత్రం భరోసా కల్పించలేక పోయిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.


ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు
ఒకప్పుడు బీఐబీసీఓఎల్‌లో ఉద్యోగం వస్తే జీవితానికి భరోసా లభించినట్టేనని అక్కడి కుటుంబాలు భావించేవి. 2005లో జూనియర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా చేరిన విజయ్‌ ప్రకాశ్‌ నాగ్‌ జీతం నెలకు రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కుటుంబ భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడింది. దాదాపు 17 ఏండ్లపాటు పనిచేసిన ఆయన చివరకు నెలకు రూ.55 వేలు సంపాదించే స్థాయికి చేరుకున్నారు. ఆ ఆదాయంతో కుమార్తెకు చక్కని చదువును అందించారు. కుటుంబ అవసరాలు తీర్చుకున్నారు. అయితే ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు కుమార్తె చదువుకు మూడు నెలలకు రూ.18 వేలు చెల్లించడమే కష్టంగా మారింది. వయసు పెరగడంతో కొత్త ఉద్యోగం దొరకడం లేదనీ, బులంద్‌షహర్‌లో ఉపాధి అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని ఆయన చెప్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్