మోడీ 'మేకిన్ ఇండియా' అసలు గుట్టు అదే..
తేజస్-2, ఏఎంసీఏ యుద్ధవిమానాల ఇంజిన్లపై వీడని సందిగ్ధత
సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై అమెరికా మెలికలు.. భారీగా పెరిగిన ధరలు
స్వదేశీ రక్షణ రంగం పేరుతో విదేశీ సంస్థలపై ఆధారపడుతున్న వైనం
దేశాన్ని రక్షణ రంగంలో స్వయం సమృద్ధిగా మారుస్తామనీ, విదేశాలపై ఆధారపడే పరిస్థితిని తొలగిస్తామని మోడీ సర్కారు చాలా గొప్ప ప్రకటనలు చేసింది. కానీ ఆచరణలో మాత్రం కీలక సాంకేతికత కోసం అమెరికా ముందు మోకరిల్లుతోంది. ‘మేకిన్ ఇండియా’ పేరుతో స్వదేశంలోనే యుద్ధవిమానాల ఇంజిన్లు తయారు చేయాలన్న లక్ష్యం.. సాంకేతిక పరిజ్ఞానంపై విదేశీ సంస్థల ఆధిపత్యం, భారీ ధరలు, దీర్ఘకాలిక చర్చల మధ్య చిక్కుకుపోయింది. ఇవి కేంద్రంలోని మోడీ సర్కారు వైఫల్యాలను వెల్లడి చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి అత్యంత కీలకమైన తేజస్ మార్క్-2, ఐదో తరం అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) యుద్ధవిమానాల భవిష్యత్తుపై అమెరికా ఇంజిన్ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ)తో కొనసాగుతున్న చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎఫ్-414 ఇంజిన్లను భారత్‌లో తయారు చేసేందుకు ఒప్పందం ఎప్పుడు కుదురుతుంది? ఎంత సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అవుతుంది? దాని కోసం భారత్ ఎంత మూల్యం చెల్లించాలి? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు. దీంతో మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేకిన్ ఇండియా’ నినాదాల అమలుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అమెరికా సంస్థతో మూడేండ్లుగా చర్చలే!
2023 జూన్‌లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా జీఈ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) మధ్య అవగా హన ఒప్పందం కుదిరింది. భారత్‌లో ఎఫ్-414 ఇంజిన్ల తయారీకి మార్గం సుగమం చేయడం దీని ఉద్దేశం. అయితే సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ధరలు, స్థానిక తయారీ నిబంధనలపై చర్చలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. అక్టోబర్ 20న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌లో పర్యటించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన తేజస్ మార్క్-2, ఐదో తరం యుద్ధ విమానం ఏఎమ్‌సీఏ కోసం అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) ఎఫ్ 414 ఫైటర్ జెట్ ఇంజిన్లను భారతదేశంలోనే సంయుక్తంగా తయారు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని ప్రతిపాదించారు. భారత్ తన రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనీ, అమెరికాకు చెందిన అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు రక్షణ వ్యవస్థలను మరింత ఎక్కువగా కొనుగోలు చేయాలని రూబియో ప్రతిపాదించారు. ఇది ఇరు దేశాలకు "విన్-విన్" (ఇద్దరికీ లాభదాయకం) గా మారుతుందని వ్యాఖ్యానించారు. .జీఈ ఎఫ్414 ఇంజిన్ల స్థానిక తయారీకి సంబంధించి సుమారు 80 శాతం సాంకేతిక పరిజ్ఞాన బదిలీ చేయాలనే భారత్ ప్రతిపాదనపై మాత్రం ఆయన మాట్లాడలేదు. దీనితో భారత్ పట్ల అమెరికా వైఖరి ఎలాంటిదో స్పష్టంగా తేలిపోయింది. ఫలితంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు మోడీ ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్టు వార్తలు వచ్చాయి.
తయారీ పరిజ్ఞానం...సాంకేతికత వేర్వేరు
ఎఫ్-414 ఇంజిన్ తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంలో దాదాపు 80 శాతం బదిలీ జరిగినా, ఇంజిన్ రూపకల్పనకు సంబంధించిన మేధో సంపత్తి హక్కులు, కీలక సాంకేతిక రహస్యాలు, భవిష్యత్తులో స్వతంత్రంగా మార్పులు చేసి అభివృద్ధి చేసుకునే అధికారం భారత్‌కు లభిస్తాయని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. తయారీ పరిజ్ఞానం అందించడం ఒకటైతే, ఇంజిన్‌ను పూర్తిగా అర్థం చేసుకుని సొంతంగా అభివృద్ధి చేసుకునే సామర్థ్యం సాధించడం మరో భాగం. అలాగే ఏఎంసీఏ కోసం అవసరమైన పరిమిత సంఖ్యలో ఇంజిన్ల ధరను గతంలో రూ.70-80 కోట్లుగా అంచనా వేయగా, ఇటీవలి చర్చల్లో జీఈ దాన్ని సుమారు రూ.200 కోట్లకు పెంచినట్టు సమాచారం. భారత్‌లో ప్రత్యేక తయారీ కేంద్రం ఏర్పాటుకు 800 మిలియన్ డాలర్లు కోరినట్టు కూడా తెలుస్తోంది. తేజస్-2, ఏఎంసీఏతోపాటు నౌకాదళం కోసం రూపొందించే ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ (టీడీబీఎఫ్)కు కూడా ఈ ఇంజిన్లు అవసరం. అయితే వీటన్నింటికీ సంబంధించి ఒకే సమగ్ర ఒప్పందం లేకపోవడం గమనార్హం!
ప్రచారార్భాటమే...
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలంటే విదేశీ ఇంజిన్లను దేశంలో అసెంబ్లింగ్ చేయడం మాత్రమే సరిపోదనీ, కీలక సాంకేతికత, రూపకల్పనపై నియంత్రణ, స్వతంత్రంగా మరమ్మతులు, మార్పులు చేసే సామర్థ్యం కూడా అవసరమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇవి లేకపోతే విదేశీ సంస్థలపై ఆధారపడటం అలాగే కొనసాగుతుందనీ, ప్రచార ఆర్భాటంతో స్వదేశీ రక్షణ రంగం బలోపేతం కాదని హితవు పలుకుతున్నారు. కానీ మోడీ ప్రభుత్వం ‘మేకిన్ ఇండియా’ ట్యాగ్‌లైన్‌తో విదేశీ పరిజ్ఞానాన్ని కొనుగోలు చేసుకోవడాన్ని వారు తప్పు పడుతున్నారు.
సాంకేతికత బదిలీ ఎక్కడ?
భారత్‌తో రక్షణ సహకారం పెంచుకుంటున్నట్టు అమెరికా ప్రకటిస్తున్నా, కీలక సాంకేతికతను పూర్తిగా అందించడంలో మాత్రం వెనుకడుగు వేస్తోంది. ఐసీఈటీ, ఇండస్-ఎక్స్, ట్రస్ట్ వంటి కార్యక్రమాలు కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, అంతరిక్షం, రక్షణ సాంకేతికతలో సహకారాన్ని పెంచుతాయని ప్రకటించినా, స్వతంత్రంగా వినియోగించుకోగలిగే కీలక సైనిక సాంకేతికత విషయంలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. గతంలో ప్రారంభించిన రక్షణ సాంకేతికత, వాణిజ్య చొరవ (డీటీటీఐ) కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.






కామెంట్‌లు (0)