డిసెంబర్ 1 నుంచి 3 వరకు సీఐటీయూ పోరాటం
రామ్‌లీలా మైదానం నుంచి పార్లమెంట్‌కు మార్చ్
సుదీప్ దత్తా, ఎలమరం కరీం, ఏఆర్ సింధు వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచాలని తదితర డిమాండ్లతో డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘ఢిల్లీని ముట్టడించండి’ (ఆక్యుపై ఢిల్లీ) పేరుతో భారీ ఆందోళన నిర్వహిం చనున్నారు. ఈ పోరాటంలో లక్ష మందికిపైగా కార్మికులు పాల్గొంటారని సీఐటీయూ నేతలు తెలిపారు. బుధవారం నాడిక్కడ బీటీఆర్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదీప్ దత్తా, ఎళమరం కరీం, జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధు మాట్లాడారు. డిసెంబర్ 1న కార్మికులు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానానికి చేరుకున్న అనంతరం పార్లమెంట్ వైపు ప్రదర్శన చేయనున్నట్టు తెలిపారు. పోలీసులు ప్రదర్శనను అడ్డుకుంటే అక్కడే బైఠాయించి ఆందోళన తెలుపుతామని స్పష్టం చేశారు. నవంబరు చివరి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే 40 వేల మందికిపైగా రైలు టికెట్లు బుక్ చేసుకున్నారని, పొరుగు రాష్ట్రాల నుంచి వివిధ రవాణా మార్గాల్లో కార్మికులు తరలిరానున్నారని తెలిపారు. పార్లమెంటు మార్చ్‌కు సన్నాహకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 12న దేశంలోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చారిత్రాత్మక సమ్మె నిర్వహించామని, అందులో లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధపడలేదని ధ్వజమెత్తారు. డిసెంబర్ ఆందోళనపైనా కేంద్రం ఇదే వైఖరి అవలంబిస్తే తదుపరి పోరాట కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వంపై విద్యుత్ ఉద్యోగులు సమ్మెతో సాధించిన విజయాన్ని ప్రస్తావించారు. ఆ పోరాటం దేశంలోని కార్మికులకు ఆదర్శమని పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
స్కీమ్ కార్మికులను వాలం టీర్లుగా కాకుండా కార్మికులుగానే గుర్తించాలని, దేశంలోని కార్మికులందరికీ కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచాలి. కనీస పెన్షన్‌ను రూ.21 వేలకు పెంచడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడం, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఆదివాసుల భూములను కార్పొరేట్లకు అప్పగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసం హరించుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రద్దు చేయాలని కూడా ఆందోళనలో డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు.







కామెంట్‌లు (0)