Magazines

వృద్ధుల సంరక్షణకు స్టార్టప్‌లు

1 గంట క్రితం

Elderly Care
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 4 నిమిషాల చదవడం

ప్రత్యేక పరిశ్రమగా తయారవుతున్న తీరు

పిల్లలు విదేశాల్లో.. తల్లిదండ్రులకు 
స్వదేశంలో ఒంటరితనం

​ 2050 నాటికి ప్రతీ ఐదుగురు భారతీయుల్లో 
ఒకరు 60 ఏండ్లు పైబడినవారే

ఏఐ ఆధారిత పర్యవేక్షణ, గృహ సంరక్షణ సేవలకు పెరుగుతున్న ఆదరణ


న్యూఢిల్లీ: ​వృద్ధానాం సేవ, సమాజ సంస్కార: (వృద్ధుల సేవ సమాజ సంస్కారానికి ప్రతీక). ‘ఒకప్పుడు’ భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. క్రమేణా జీవన ప్రమాణాలు, అలవాట్లు, ఉపాధి అవకాశాలు మారడంతో చిన్న కుటుంబాలు ఏర్పాటయ్యాయి. తాజా గా ‘మైక్రో’ కుటుంబాలు ఏర్పడు తున్నాయి. భార్య, భర్త, ఒకే సంతానం... అనే స్థితికి భారతీయ కుటుంబ వ్యవస్థ మారిపోయింది. ఇటీవలి కొందరు యువతీ యువ కులైతే అసలు పెండ్లిండ్లే వద్దంటూ ‘సహజీవనం’ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ మార్పునకు వ్యక్తుల్ని నిందించి ప్రయోజనం లేదు. కచ్చితంగా పాలకుల విధానాలే ప్రత్యక్ష కారణాలుగా కనిపిస్తు న్నాయి. ఒకప్పుడు ఇంటి యజమాని ఒక్కరు సంపాదిస్తే, కుటుంబం మొత్తం కూర్చుని తినేది. ఆ తర్వాత భార్యాభర్త కష్టపడి పిల్లల్ని పోషిం చేవారు. ఇప్పుడు పిల్లలు కూడా తమకాళ్లపై తాము నిలబడి సంపాదిస్తే, వారి ఖర్చులకు సరిపోతున్నాయి. ఇంటర్నెట్‌ ‌యుగంలో ప్రపంచం కుగ్రామంగా మారడం, డాలర్‌‌తో పోలిస్తే రూపాయి విలువ దిగజారడం వంటి అనేక కారణాలు దీనివెనుక ఉన్నాయి.

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశం ఉపాధి అవకాశాల పేరుతో సంపన్న దేశాలకు అనుకూలంగా విధాన నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని అమలు చేసే క్రమంలో కుటుంబాలు విచ్ఛిన్నం కావడం ‘సమాజ పరిణామ క్రమం’లో భాగంగా మారిపోయింది. అయితే ఇప్పుడు భారతదేశంలో వృద్ధ తల్లిదండ్రుల్ని సంరక్షించుకోవడం యువతరానికి కష్టంగా మారింది. ఉద్యోగాల కోసం యువత పట్టణాలు, విదేశాలకు వలస వెళ్తుండటంతో వృద్ధుల సంరక్షణ దేశంలో ప్రధాన సమస్యగా మారుతోంది. ఇప్పుడు ఈ ‘సేవ’ వ్యాపారంగా మార్పు చెంది వృద్ధుల సంరక్షణ కోసం ‘స్టార్టప్‌’లు పుట్టుకొచ్చేశాయి. వృద్ధుల కోసం ప్రత్యేక నివాసాలు, ఇంటి వద్దకే వైద్య సేవలు, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, సహచర్యం అందించే సంస్థలు రంగంలోకి దిగి వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. ‘సనాతనులు’ దీన్ని వ్యతిరేకిస్తున్నా, కార్యక్షేత్రంలో ఈ పరిస్థితుల మార్పు అనివార్యం కావడం గమనార్హం!


ఒంటరితనమే వ్యాపారం

ఉద్యోగాలు, ఉన్నత చదువులు, మెరుగైన జీవనోపాధి కోసం యువత స్వస్థలాలను విడిచి ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వెళ్తున్నారు. దీంతో స్వదేశంలో ఒంటరిగా ఉంటున్న వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ పెద్ద సమస్యగా మారుతోంది. అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లడం మొదలుకొని నిత్య ఆరోగ్య పర్యవేక్షణ వరకు అన్నింటికీ ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ అవసరాన్ని గుర్తించిన స్టార్టప్‌ సంస్థలు వృద్ధుల సంరక్షణ రంగంలో కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) అంచనాల ప్రకారం 2020 నుంచి 2050 మధ్య ప్రపంచవ్యాప్తంగా 60 ఏండ్లు పైబడిన వారి సంఖ్య రెట్టింపై 210 కోట్లకు చేరనుంది. భారత్‌లోనూ ఇదే పరిస్థితి. 2050 నాటికి దేశ జనాభాలో దాదాపు 21 శాతం మంది, అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులుగా ఉండనున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, యువత ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లడంతో వృద్ధుల సంరక్షణ కుటుంబాలకు భారంగా మారుతోంది.

​విస్తరిస్తున్న సీనియర్‌ కేర్‌ పరిశ్రమ

నిటి ఆయోగ్‌ అంచనా ప్రకారం భారత్‌లో సీనియర్‌ కేర్‌ పరిశ్రమ విలువ సుమారు 7 బిలియన్‌ డాలర్లు (రూ.66,451 కోట్లు)గా ఉంది. ఈ రంగంలో భారీ అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. మనసుమ్‌ సీనియర్‌ లివింగ్‌, ప్రైమస్‌ సీనియర్‌ లివింగ్‌, అనంత లివింగ్‌, వేదాంత లివింగ్‌ వంటి సంస్థలు వృద్ధుల కోసం ప్రత్యేక నివాస సముదాయాలు నిర్మిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కొలియర్స్‌ అంచనా ప్రకారం దేశంలో వృద్ధుల నివాసాలకు 20 లక్షల నుంచి 22 లక్షల యూనిట్ల డిమాండ్‌ ఉండగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 25 వేల యూనిట్లే ఉన్నట్టు తెలిపింది.

ఇంటి వద్దకే సంరక్షణ సేవలు

మనసుమ్‌ సీనియర్‌ లివింగ్‌ సంస్థకు ప్రస్తుతం 900 నివాస యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. 2030 నాటికి వీటిని 10 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కుటుంబ సభ్యులతోనే ఉండాలనుకునే వృద్ధుల కోసం ఎమోహా ఎల్డర్‌ కేర్‌, కేర్‌24, కైట్స్‌ సీనియర్‌ కేర్‌ వంటి సంస్థలు ఇంటి వద్దకే సంరక్షణ సేవలను అందిస్తున్నాయి. అయితే శిక్షణ పొందిన సిబ్బంది కొరత, వారి నైపుణ్యాలు, విశ్వసనీయత ఈ రంగానికి ప్రధాన సవాళ్లుగా మారుతున్నాయి. వృద్ధులు మోసాలు, ఆర్థిక దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉండటంతో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, కఠినమైన తనిఖీలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

​ఒంటరితనాన్ని దూరం చేసే సహచర్యం
వృద్ధుల శారీరక అవసరాలతోపాటు మానసిక, సామాజిక అవసరాలను తీర్చేందుకు కూడా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. రతన్‌ టాటా పెట్టుబడితో వార్తల్లో నిలిచిన గుడ్‌ఫెలోస్‌ సంస్థ వృద్ధులకు యువ సహచరులను అందిస్తోంది. వారితో సమయం గడపడం, మాట్లాడటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో సాయం చేయడం వంటి సేవలు అందిస్తోంది. కుటుంబ సభ్యుల స్థానాన్ని భర్తీ చేయడం కాకుండా, వారి జీవితాల్లో ఏర్పడిన ఖాళీని కొంతవరకు పూరించడమే తమ లక్ష్యమని సంస్థ చెప్తోంది.

​ఏఐతో ఆరోగ్యంపై నిఘా

మరోవైపు బెంగళూరులోని కుబో కేర్‌, నోబ్లింక్‌.ఏఐ సంస్థలు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వృద్ధుల కదలికలను పర్యవేక్షించే పరికరాలను అందుబాటులోకి తెచ్చాయి. ఇండ్లలో ఏర్పాటు చేసే రాడార్‌ పరికరాల ద్వారా వృద్ధులు కిందపడినా, అకస్మాత్తుగా కుప్పకూలినా గుర్తించి అత్యవసర సేవలకు సమాచారం అందిస్తాయి. నోబ్లింక్‌.ఏఐ ఒక్కో పరికరాన్ని రూ.13,500కు విక్రయిస్తుండగా, గదికి నెలకు రూ.50 నుంచి పర్యవేక్షణ రుసుము వసూలు చేస్తోంది.

​సామాన్యులకు అందని ఖరీదైన సేవలు

అయితే ఈ సేవలన్నీ సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్మించే ఒక పడకగది, హాలు, వంటగది (1 బీహెచ్‌కే) నివాసం కొనుగోలు చేయాలంటే సుమారు రూ.60 లక్షలు ఖర్చవుతోందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. నిర్వహణ, ఆహారం వంటి ఖర్చులు అదనం. నిటి ఆయోగ్‌ లెక్కల ప్రకారం దేశంలోని వృద్ధుల్లో 78 శాతం మందికి పెన్షన్‌ సౌకర్యం లేదు. వృద్ధులు ఉన్న కుటుంబాల నెలసరి తలసరి ఆదాయం రూ.3,568 కాగా, వృద్ధులు లేని కుటుంబాల్లో ఇది రూ.4,098గా ఉంది. దీంతో ఖరీదైన సంరక్షణ సేవలు చాలామందికి దూరంగా ఉన్నాయి.

​ప్రభుత్వ సహకారం తప్పనిసరి

జపాన్‌ వంటి దేశాలు దీర్ఘకాలిక సంరక్షణ బీమా, ప్రభుత్వ నర్సింగ్‌ కేంద్రాలు, సామాజిక కార్యక్రమాల ద్వారా వృద్ధులకు అండగా నిలుస్తున్నాయి. భారత్‌లోనూ ఈ తరహా సమగ్ర వ్యవస్థ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో కేరళంలో గతంలోని ఎల్‌‌డీఎఫ్‌ ‌ప్రభుత్వం వృద్ధుల హక్కులు, అందుబాటు ధరల్లో సంరక్షణ, న్యాయ సహాయం, డిజిటల్‌ సేవలు, సురక్షితమైన బహిరంగ ప్రదేశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా నిలిపింది. స్టార్టప్‌ సంస్థలు వృద్ధుల సంరక్షణలో కీలక పాత్ర పోషించగలిగినా, ప్రభుత్వ బాధ్యతకు అవి ప్రత్యామ్నాయం కాలేవని మేధావులు చెప్తున్నారు. పెరుగుతున్న వృద్ధ జనాభాకు నాణ్యమైన, అందరికీ అందుబాటులో ఉండే సంరక్షణ వ్యవస్థను నిర్మించడమే భారత్‌ ముందున్న అసలైన సవాలు!!




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్