పరిణామ పుస్తకంలో ఋతువులు మారినట్లే బతుకు సంగీతంలో తరాల స్వరాల రాగాలు మారుతాయి..! అయినా అహింసా కిరణాలు స్థిరంగానే విశ్వమంతా విస్తరిస్తున్నాయి..! సత్యం మరింత కాంతివంతమై శాంతి గగనాన యుద్ధ నిశీధి పోకడలతో పోరాడుతూనే వుంది శతాబ్దాలుగా..! మతసామరస్య జ్ఞాన దీపికలను వెలిగిస్తూ గాంధీ భానుడిలా ప్రతిరోజూ ఉదయిస్తున్నారు ప్రపంచమంతా అనంత ప్రేమరంగులతో అభ్యుదయమై వికసిస్తున్నారు చేతి కర్రతో భగవద్గీత సాక్షిగా భావిభారతాన్ని నడిపిస్తూనే ఉన్నారు..! సత్యాగ్రహ తరంగాల చైతన్యంలో పోరాటాలు కొత్త పుంతలు తొక్కుతుంటే సహాయ నిరాకరణ స్వదేశీ మంత్రంతో వందేమాతరం మన గుండె చప్పుడై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూనే ఉంది..! గాంధీజీ ఆలోచనా కావ్య కుసుమాలు.. పర్యావరణ హృదయాన ప్లాస్టిక్ రహిత ప్రగతి గీతాలు విభిన్న సంస్కృతల నందనవనంలో స్ఫూర్తి పరిమళ వేల కథనాలు గ్రామాల గుండె శబ్దాలకు ప్రాణం పోసే శాస్త్ర సాంకేతిక వ్యవసాయ క్షేత్రాలు జీసస్, బుద్ధుడు మళ్లీ మళ్లీ గాంధీ రూపంలో జీవిత సైన్స్ సూత్రాలుగా కాలం గుండెపై కనిపిస్తూనే ఉంటారు..!
ఫిజిక్స్ అరుణ్ కుమార్, 9394749536






కామెంట్లు (0)