గాలిలో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు
మైనింగ్ మాఫియాపై సమగ్ర విచారణేది?
వెన్నవల్లి ఘటనపై అనుమానాలు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు పరాకాష్టకు చేరి రోజుకో అమాయకుడి ప్రాణాన్ని బలిగొంటున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనం వహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రఘునాథపాలెం వద్ద, నేడు కల్లూరు మండలం వెన్నవల్లి గుట్ట వద్ద జరిగిన వరుస ప్రమాదాలు అక్రమ తవ్వకాల తీవ్రతకు అద్దం పడుతున్నాయి. జేసీబీ డ్రైవర్ దుర్మరణం చెందిన ఈ ఘటనతో మైనింగ్, రెవెన్యూ శాఖల పర్యవేక్షణా లోపం స్పష్టంగా బయటపడింది. గుట్టలను గుల్ల చేస్తూ నిబంధనలను అటకెక్కించిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా మట్టి మాఫియా సాగిస్తున్న విచ్చలవిడి తవ్వకాలు సామాన్య ప్రజలు, కార్మికుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కండ్ల ముందే గుట్టలు కరిగిపోతున్నా, అక్రమ రవాణాతో రోడ్లు ధ్వంసమవుతున్నా, ప్రాణాలు గాల్లో కలుస్తున్నా సంబంధిత శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిన్న రఘునాథపాలెం సమీపంలో జరిగిన ప్రమాద ఉదంతం మరవక ముందే, కల్లూరు మండలం పెద్ద కోరుకొండి-వెన్నవల్లి గ్రామాల మధ్య ఉన్న వెన్నవల్లి గుట్ట వద్ద మరో ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర విచారకరం. అక్రమంగా సాగుతున్న మట్టి తవ్వకాల్లో ఒక్కసారిగా మట్టి దిబ్బ కుప్పకూలిపోవ డంతో అక్కడ పనిచేస్తున్న జేసీబీ డ్రైవర్ మట్టి కింద చిక్కుకుని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. వరుస ప్రమాదాల్లో ఇప్పటికే ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, యంత్రాంగంలో చలనం రాకపోవడం శోచనీయం.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
వెన్నవల్లి గుట్ట వద్ద కొన్ని నెలలుగా ఎటువంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతున్నారని స్థానిక ప్రజలు స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఎటువంటి భద్రతా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారని వారు అనేకమార్లు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. గుట్టను లోతుగా తొలచి గుల్ల చేయడంతో భూమి బలహీనపడి ఈ ఘోర ప్రమాదానికి దారితీసింది. అసలు ఈ తవ్వకాలకు మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా, లేక అధికారుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతుందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదన్నది పచ్చి నిజం.
విచ్చలవిడిగా అనుమతులతో అనర్థాలు
ఈ అక్రమ మట్టి వ్యాపారం వెనుక కేవలం మైనింగ్ మాఫియా మాత్రమే కాకుండా, కొంతమంది అధికారుల లంచగొండితనం, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ప్రాపకం ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మామూళ్లు సమర్పించుకోవడం లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిబంధనలను పక్కనబెట్టి అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేసీబీ డ్రైవర్ మృతికి బాధ్యులు ఎవరు, అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతుంటే యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు స్వతంత్రంగా విచారణ జరిపితే తప్ప ఈ వ్యవహారంలో ఉన్న అసలు సూత్రదారులు, పాత్రదారుల జాతకాలు బయటకు రావు. కనుక ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వెన్నవల్లి గుట్ట ఘటనపై ఉన్నత స్థాయి సమగ్ర విచారణకు ఆదేశించాలి. ప్రమాదానికి కారకులైన గుట్ట యజమానులు, అక్రమ తవ్వకందారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కఠినమైన కేసులు నమోదు చేసి అక్రమ తవ్వకాలను అరికట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలు బలికాక తప్పవు. ఇప్పటికైనా యంత్రాంగం నిద్రమత్తు వీడి కఠిన చర్యలతో అక్రమ మైనింగ్‌కు చరమగీతం పాడాలని ప్రజలు కోరుతున్నారు.






కామెంట్‌లు (0)