కవిత్వం అంటే కేవలం అక్షరాలను అందంగా పేర్చడం మాత్రమే కాదు. మనసులో కదిలిన భావానికి, మనిషిని వెంటాడిన అనుభూతికి, సమాజాన్ని కలచివేసే సంఘటనలకు వచ్చిన సందేహాలకు భాషను ఇవ్వడం కవిత్వ లక్షణం. కవి తాను చూసిన ప్రపంచాన్ని తన అంతరంగంలోకి తీసుకుని, దానిని తనదైన అనుభూతి, ఆలోచన, వేదనలను సొంతం చేసుకుని వాటికి ఊహాత్మక ప్రతీకలతో మలచడం కోసం తపిస్తాడు. తన మనసులో సుడులు తిరుగుతున్న అనేకానేక సంవేదనలకు తనకు తానే జవాబుదారిగా నిలిచినప్పుడు ఆ సంవేదనల సారమంతా కూడుకుని పదాల అల్లిక, పాదాల అమరికతో పరిపూర్ణంచెంది కవితాక్షరాలుగా పురుడుపోసుకుంటాయి.
ఇదే విషయాన్ని ప్రముఖ ఆంగ్లకవి William Wordsworth ‘‘Poetry is the spontaneous overflow of powerful feelings; it takes its origin from emotion recollected in tranquility.’’ అన్నారు. అంటే - కవిత్వం బలమైన భావోద్వేగాల సహజమైన వెల్లువ. అయితే ఆ భావం ప్రశాంతమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుని, వేదననో, సంతోషాన్నో అంతర్మథనం చేసినప్పుడు కవి హృదయంలో కవిత్వం ఉదయిస్తుంది. అటువంటి భావోద్వేగాల పరంపరను కవిత్వ భాషలో తెలియచేయడంలో కవి దేశరాజు సఫలీకృతులు అయినారని చెప్పడానికి చక్కని ఉదాహరణ ఈ ‘ప్రతీక్ష’ కవిత్వం. అంతకు ముందే ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’, ‘దుర్గాపురం రోడ్’ కవిత్వ సంపుటాలు వెలువరించారు. ఇది వారు తాజాగా విడుదల చేసిన మూడవ కవిత్వ సంపుటి. కవిత్వ వ్యక్తీకరణలో ఒక్కొక్కరికి ఒక్కో పద్దతి ఉంటుంది. కవితను పేనుకుంటు పోయే శివారెడ్డి లక్షణం, కవితలో మార్మికతను నింపే ‘అజంతా’ తత్వం, ఫెమినైజషన్ అఫ్ సబ్జెక్టు అనే ‘మో’ తీరు, శివసాగర్‌లో ఉండే ఉద్యమ లాలిత్యం అన్నీ పెనవేసుకుని వీళ్ళెవరూ కనపడకుండానే దేశరాజులో కనబడతాయి అని ప్రముఖ కవులు ప్రసేన్ అనడం అతిశయోక్తి కాదు అని ఈ కవితలు నిరూపించాయి. ‘ప్రతీక్ష’ సంపుటిలో 71 కవితలు ఉన్నాయి. ముక్కుసూటిగా సమాజాన్ని ప్రశ్నించే కవితలు, సామాజిక వ్యవస్థలోని లోపాలకు వ్యంగ్యాస్త్రాలను విసిరే కవితలు, మనుషుల మీద, ప్రకృతి యెడల అపారమైన ప్రేమను, సానుభూతిని వ్యక్తం చేసిన కవితలు ఈ సంపుటిలో చోటుచేసుకున్నాయి.
కొన్ని కాలానుగుణంగా, కొన్ని కాలాతీతమైన అభివ్యక్తీకరణలు కూడా ఉండడంవల్ల కరోనా కాలంలో రాసిన కవితలు కొన్నింటిని చూడవచ్చు. 2020 నుంచి 2026 మధ్యకాలంలో వీరు రాసిన కవితలు, వాటిని రాసిన సమయాన్ని కూడా తెలుపడంతో కవి దివారాత్రుల్లో, సంధ్య చీకట్లలో, సింధూరం పులుముకున్న తూరుపువాకిళ్లలో తన మనఃస్థితిని స్థిరీకరించుకుని రాయడం వల్ల నిత్యనూతనము ఈ కవిత్వ ప్రధాన లక్షణం అయింది. అయితే అంతకు ముందు రాసిన కవిత్వసంపుటాలతో పోల్చి చూస్తే కాలానుక్రమమైన పరిణతి దేశరాజు కవిత్వంలో కనిపిస్తుంది.
‘‘ముందు తెలియదు - నడుస్తూ నడుస్తూ ఉండగా - అదాటున కాలు జారుతుంది - అప్పుడనుకుంటాం - జాగ్రత్తగా నడవాలని - మరి, ముందు నడిచిందంతా అజాగ్రత్తేనా? - ముందు తెలియదు - ముందున్నదేమిటో- అందరిలాగే చెప్తుంటాం - బతుకు బంగారమవుతుందని - మరి, గాయలవుతున్నా - కౌగిలించుకోక తప్పదని చెప్పలేంగా?’’ జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్దాప్యం ఏ దశలోకైనా రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అడుగుతీసి వేసే అడుగు కూడా సరిగా పడుతుందో లేదో ఎవరూ చెప్పలేరు. ఏ దారిలో వెళ్ళాలో అంచనా వేయలేము. సగం మార్గం నడిచాక కానీ, మనం ఎంచుకున్న దారి సరైనది కాదని తెలుస్తుంది. కానీ తిరిగివెనక్కి వెళ్ళలేము. ప్రపంచం అంటే అమ్మా, నాన్న ప్రేమతో అందించే పాలబువ్వ కాదు. ముందుకు వెళ్ళేకొద్దీ అది మోయలేని పెనుభారం అవుతుంది. అయినా ఎదుర్కోవాలి.
బాల్యం కలలు, యవ్వనపు ఊహలు, జీవితం మీద పెంచుకున్న ఆశలు అన్నీ కళ్ళముందే కరిగిపోతూ జీవితపు అసలు రంగును చూపించాక, ఇక దృతరాష్ట్ర కౌగిలిలాంటి జీవితాన్ని ఊపిరాగిపోయేదాకా అంగీకరించక తప్పదు. అందమైన ఊహలకి, జీవితం చూపించే అసలు నిజాలకి మధ్య ఉన్న తేడాని ‘విషమ కౌగిలి’ కవితలో స్పష్టపరిచారు కవి.
‘‘స్తన్యం తాగి పెరిగిన ప్రతివాడు మనిషి కానట్లే - తోకెత్తుకు పొడుగు కుమ్మిన ప్రతి లేగా - రేపు నెత్తురు పారించదని హామీ లేదు’’ ఆవు పేరుతో జరుగుతున్న అరాచకాలకు సూటిగా వేసిన వ్యంగ్య బాణం ‘తెల్లనివన్నీ ఆవులు కావు’ కవిత. ఆవు- పులి కథకు అర్ధం మారిపోతున్న కాలం ఇది. సాధుజీవితం, సాత్విక గుణం అంటూనే కాషాయయంలోని కర్కశత్వాన్ని నిర్బీతిగా బయటకు కక్కిన కవిత. ఇప్పుడు ఆవులు కూడా పాలకులతో చేరి ఓటుబ్యాంక్ నిధులైనాయి. మృగ కౄరత్వంతో అధికారంకోసం ఆడే ఆటలో అవులాంటి మనుషులు కూడా పాలకులు వేసిన ఓటు వలకు చిక్కి పులిజూదం ఆడుతున్నారు అంటూ కవి ఆవేదన చెందుతాడు. గడ్డి మేసవన్నీ సాధు జంతువులైనప్పుడు పూజ మాత్రం ఆవుకొక్కదానికెందుకు అని ప్రశ్నిస్తాడు. ఆవు పాలకుల అధికారపు కామధేనువు. ఆవు రాజకీయంలో నష్టపోయేది మాత్రం అమాయకులైన సామాన్యులు అని, అందుకే తెల్లనివన్నీ ఆవులు కావు, మెత్తగా ధర్మాన్ని వల్లించే వాళ్లంతా అవులాంటి సాధువులుకారు.
అలాగే నల్లనకానివన్నీ పాలు కావు అని చురక అంటిస్తారు కవి.
‘‘విరిగిపోయిన ఇంద్ర ధనుస్సు - శిధిలాల మధ్య చెదిరిపడింది - దాన్లో తమ ముఖాలను పోల్చుకోలేక పిల్లలు గుక్క పట్టారు - గుట్టలుగా పోగుపడుతున్న శవాల మధ్య - కొన ఊపిర్లు మనుషుల బుక్ మార్క్ లవుతున్నాయి’’ పాలస్తీనా, ఇశ్రాయేల్ యుద్దం కలిగించిన వేదన మనకి తెలియనిది కాదు. చిధ్రమైన పసి దేహాలు, చెదిరిపడిన ఇంద్రధనస్సులాంటి కలలు, యుద్ధం మిగిల్చిన శతగాత్రగానాలకు కలవరపడి, విశ్వశాంతి కలగన్న కవి, మరుభూమిలో పసి ఆర్తనాదాలకు చాలించి వేదనతో అర్పించిన కవితాశ్రువు ‘పూరణ’ కవిత.
అనామకుల ఆత్మఘోష, వాలుపొద్దు, సుషుప్తి, సార్ధకత, ఎప్పటికైనా లాంటి కవితలు మార్మిక అధివాస్తవిక సర్రిలిజంతో సాగి, పాఠకుల మనసులను కవితా పంక్తుల మధ్య బందీలుగా చేస్తాయి అనడంలో సందేహం లేదు. కవి దేశరాజు కవిత్వం సమగ్రంగా పరిశీలిస్తే తాను చెప్పదలచుకున్న విషయం కొన్ని కవితల్లో సూటిగా, మరికొన్ని సార్లు నిగూఢత్వంతో కూడిన మార్మిక సందేశాన్ని పాఠకులకు అందిస్తాడు. తాను అనుభవించిన వేదనను ప్రశ్నల రూపంలో సంధించి, వాటికి అధివాస్తవ మెరుగులు అద్దుతాడు. అయితే కవి దేశరాజు కవితల్లో మార్మికత్వం, నిగూఢత్వం, అధివాస్తవ దృక్కోణంపాళ్ళు కాస్త ఎక్కువే. సామాన్య పాఠకులు కూడా వారి కవితలోని అద్భుతమైన సారాన్ని గ్రహించాలంటే కాస్త సరళతకు కూడా చోటు ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కవి దేశరాజు చేయి తిరిగిన కవి మాత్రమే కాదు, మంచి కథకులు అనికూడా ఇప్పటికే వారు వెలువరించిన ఐదు కథా సంపుటాలతో నిరూపించున్న సాహితీకారులు. వీరి రచనలు విరామమెరుగకుండా సాగే నదీప్రవాహవేగంతో పోటీపడి సాగాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రోహిణి వంజారి






కామెంట్‌లు (0)