వనపర్తి జిల్లా పెబ్బేరులో 1932 అక్టోబర్ 7న వల్లపురెడ్డి బుచ్చమ్మ, రామకృష్ణారెడ్డి దంపతులకు జన్మించిన ఆచార్యులు పట్టుదలతో అంజుమన్ బడిలో చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. పట్టా పొందారు. ‘మధుర విలాసము’ కావ్యంపై పరిశోధనాత్మక విమర్శ చేసి, పరిష్కరించి డాక్టరేట్ సాధించిన వీరు ప్రాచీన సాహిత్య రంగంలో విశేష కృషి చేశారు. ఆచార్య బిరుదురాజు రామరాజు సాన్నిహిత్యంలో సాహిత్య పంటలు పండించి, మృదుభాషణతో, విద్యార్థులకు జీవన సూత్రాలు బోధిస్తూ సంస్కారవంతమైన సాహితీవేత్తగా పేరుగాంచారు. ఎంత ఎదిగినా కన్న ఊరిని, పల్లె ప్రజలను అమితంగా ప్రేమిస్తూ ఒద్దికగా మెలిగిన వీరి సేవలు, స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.
తెలుగు సాహిత్య ప్రపంచంలో వల్లపురెడ్డి బుచ్చారెడ్డి కథకుడిగా, కవిగా, పరిశోధకుడిగా, అనువాదకుడిగా మరియు పత్రికా సంపాదకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. ఆర్భాటాలకు, అనవసర ప్రచారాలకు దూరంగా ఉంటూ నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆయన, విమర్శలు ఎదురైనా తాను విశ్వసించిన మార్గంలోనే సాగారు. 1954 డిసెంబర్ 17 నుండి 1967 వరకు వివిధ వారపత్రికలలో ప్రచురితమైన ఆయన 35 కథలను మిత్రుల సహకారంతో "వల్లపురెడ్డి కథలు" పేరిట సంకలనంగా తీసుకొచ్చారు.
కథలే కాకుండా గేయాలు, గేయ నాటికలు, పద్యాలు రాసిన ఆయన ‘ముక్తగీతికలు’ (1972), ‘మధుగీత’ (1986), ‘నరనయ్య సరస కవిత’ (1986), వ్యాస సంకలనం ‘మణితుల్య’ వంటి ప్రముఖ రచనలు వెలువరించారు. అరవై ఏళ్ల ప్రయాణంలో ఆయన రాసిన ప్రతి కథకూ విశ్వవిద్యాలయాల నుండి బహుమతులు రావడం, ఇతర పోటీల్లోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ముఖ్యంగా చమత్కారం, అభ్యుదయ భావాలు కలగలిసి, సాంఘిక జీవితాన్ని అత్యంత సహజంగా ప్రతిబింబించే ఆయన ‘అపరాజితుడు’ కథ అత్యంత విలువైనదిగా నిలిచింది.
ఆచార్య వల్లపురెడ్డి బుచ్చారెడ్డి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, ఉర్దూ భాషల్లో అపార పాండిత్యం ఉన్న బహుభాషా కోవిదులు. గద్వాల జిల్లా గట్టు మండలంలోని మారుమూల గ్రామంలో సాధారణ ఉపాధ్యాయుడిగా ప్రయాణం ప్రారంభించి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఎదిగిన గొప్ప విద్యావేత్త. ఆయన ప్రచురించిన ‘దాశరథి చరిత్ర’ కావ్యంపై పరిశోధన చేసి ఉందేకోడ్ రత్నయ్య డాక్టరేట్ పట్టా పొందారు. అంతేకాకుండా, సింగరాచార్యులు రాసిన ఆరు కాండల శ్రీరామాయణానికి, పురుషకారి కేశవయ్య రచించిన ఏడవ కాండాన్ని చేర్చి పరిష్కరించిన ఘనత కూడా వారిదే. పత్రికారంగంలో ‘విద్యుల్లత’, ‘ఉదయభాను’, ‘పురోగమి’ వారపత్రికలకు సంపాదకులుగా వ్యవహరించిన ఆయన పాండిత్యాన్ని, సామర్థ్యాలను తెలుగు సమాజం మరింతగా వినియోగించుకోలేకపోయిందనే భావన సాహితీప్రియులలో కలుగుతుంది.
ఉర్దూ భాషపై ఉన్న మక్కువతో ప్రసిద్ధ ఉర్దూ కవుల గజళ్లను ‘ముక్తగీతికలు’ పేరిట, మద్యం సేవనం నేపథ్యంలోని ఉర్దూ గజళ్లను ‘మధుగీత’ పేరిట తెలుగులోకి అనువదించిన ఘనత ఆచార్య వల్లపురెడ్డిది.
పావని పబ్లికేషన్స్ ద్వారా ధూర్జటి ‘కాళహస్తీశ్వర శతకానికి’ ప్రామాణిక వ్యాఖ్యానం అందించి అలరించిన ఆయన, ‘భానూదయ’ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తూ ‘శాద్వలం’ ప్రత్యేక సంచికను ప్రచురించారు. వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎవరికీ తలవంచని ముక్కుసూటి మనిషిగా, బంధాలు దూరమైనా సిద్ధాంతాల విషయంలో రాజీపడని ఆత్మవంచన లేని జీవితాన్ని గడిపారు. ఒకసారి రాస్తే అదే శుద్ధప్రతి అయ్యేంత ముత్యాల్లాంటి అక్షరాలు, అపార పాండిత్యం ఉన్నా తన పనులు తానే చేసుకునే నిరాడంబరత ఆయన ప్రత్యేకత. పైన కఠినంగా కనిపిస్తూ, ప్రేమాభిమానాలను బయటకు వ్యక్తపరచని ఆయన అరుదైన వ్యక్తిత్వం లోతుగా అధ్యయనం చేసిన వారికే పరిపూర్ణంగా బోధపడుతుంది. ఆయన పలకరింపులో వాత్సల్యం పరిమళించేది. అనవసర వాక్యం లేని ‘నిర్దుష్ట నారికేళ పాక’ శైలిలో సాగిన ఈ సాహితీమూర్తి జీవన కావ్యం ఇటీవలనే ముగిసింది. ఎనిమిది దశాబ్దాలకు పైగా నిండైన జీవితాన్ని గడిపి, అసంఖ్యాకమైన అభిమానులను, ఆప్యాయత చూపించే విద్యార్థులను, విలువైన స్నేహితులను సంపాదించుకుని పరమపదించిన ఆచార్య వల్లపురెడ్డి బుచ్చారెడ్డి జీవితం నిజంగా ధన్యం, చిరస్మరణీయం.
ఎం.డి. ఖాజామైనద్దీన్, 9396626276






కామెంట్లు (0)