ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. గతంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేరి, ఆ తర్వాత క్రమబద్దీకరణ అయిన పలువురు జూనియర్ లెక్చరర్లు బోగస్ విద్యార్హత పత్రాలతో కొలువులు దక్కించుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన సుమారు 35 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్దీకరణ చేసే ప్రక్రియలో సమర్పించిన విద్యా పత్రాల పరిశీలనలో భారీ అక్రమాలు బయటపడ్డట్టు విచారణలో వెల్లడైంది.రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం ఉమ్మడి రాష్ట్రంలో జీవో నెంబర్ 143 ద్వారా 2000 సంవత్సరం అక్టోబర్ 9న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యా సంవత్సరంలో కళాశాల ప్రారంభమైన జూన్ నుంచి మార్చి వరకు గరిష్టంగా 10 నెలల కాలానికి వీరిని నియమించే వారు. అనంతరం 2014 మార్చి 28 నాటికి పని చేస్తున్న వారిని మాత్రమే కొనసాగిస్తూ, కొత్తగా ఎవరినీ చేర్చుకోవద్దని జీవో నెంబర్ 3ను (జూన్ 21,2014) ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే జీవో నెంబర్ 16 (26 ఫిబ్రవరి,2016) ప్రకారం సర్వీసుల క్రమబద్ధీకరణ చట్టం (యాక్ట్ 2 ఆఫ్ 1994 సవరణలు) వర్తింపజేస్తూ, విద్యార్హతల నిజనిర్ధారణ షరతులతో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరించారు. కాగా ఇందులో కొందరు నకిలీ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్టుగా గుర్తించారు. దీనిపైన విచారణ చేపట్టగా ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది. ఇప్పటి వరకు విద్యాశాఖ అధికారులు దాదాపు 36 మందిని బోగస్ సర్టిఫికెట్లతో కొలువులు సంపాదించినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఆ 36 మందికి షోకాజ్ నోటీసులను జారీ చేశారు. దీనిపైన వారి వివరణ అసంతృప్తిగా ఉండడంతో వారిని తొలగిస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల తో ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించినప్పటికీ వారిపైన చర్యలు తీసుకోవడంలో మాత్రం తీవ్ర జాప్యం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డిగ్రీ లెక్చరర్ల సర్టిఫికెట్లపైన విచారణ
రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల సర్టిఫికెట్లపైన అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటర్ బోర్డు చర్యలకు ఉపక్రమించడంతో అదే విధంగా డిగ్రీ స్థాయిలోనూ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.వినోద్ కుమార్ కాలేజీయేట్ ఎడ్యుకేష,న్ కమిషనర్ శ్రీదేవసేనకు లెక్చరర్లు సమర్పించిన సర్టిఫికెట్లు, ఎన్వోసీలపై విచారణ జరిపించాలని వినతిపత్రం సమర్పించారు.
మరికొందరు, ఫేక్ జూనియర్లు..?
కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్దీకరణలో పలు అవినీతి అక్రమాలు జరిగినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య వందల్లో ఉన్నట్టు ఇంటర్మడీయట్ బోర్డ్‌లో విస్త్రత ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ చేపడితే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని, నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న వారంతా బయటికి వస్తారని పలువురు చెబుతున్నారు.







కామెంట్‌లు (0)