Magazines

వృద్ధుల కోసం ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయండి

38 నిమిషాల క్రితం

Strengthen the public health system for the elderly.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో వృద్ధుల జనాభాకు అనుగుణంగా ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మంత్రిని కలిశారు. ఇటీవల చేపట్టిన జపాన్ స్టడీ టూర్‌కు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించారు. జపాన్‌లో వృద్ధుల సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ విధానాల గురించి తెలిపారు. తక్కువ ఫర్టిలిటీ రేటు, పెరుగుతున్న లైఫ్ ఎక్స్‌పెక్టన్సీ కారణంగా భవిష్యత్తులో తెలంగాణతో పాటు భారత్‌లోనూ వృద్ధుల జనాభా గణనీయంగా పెరిగే అవకాశాలపై ఇటీవల వెలువడిన అధ్యయనాలపై సమావేశంలో చర్చించారు. ఒకవైపు నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ భారం పెరుగుతుండగా, మరోవైపు వృద్ధుల జనాభా పెరగడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య రంగంపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పటికే జెరియాట్రిక్ క్లినిక్స్, పాలియేటివ్ కేర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆయా సేవల పనితీరును, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన ఆయన, అవసరాలను గుర్తించి జెరియాట్రిక్, పాలియేటివ్ కేర్ సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రజారోగ్య వ్యవస్థను సిద్ధం చేయాలనీ, వృద్ధుల ఆరోగ్యం, నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరమని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. వేతనాల చెల్లింపుపై మంత్రి ఆదేశాలు సాంకేతిక, ఇతర కారణాలతో ఆలస్యమైన వేతనాల చెల్లింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సానిటేషన్, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు విద్యార్థుల స్టైఫండ్స్ కూడా పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్