లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నా సోయిలేదు
పాలనను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు
గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో ఎండిన పంటలను పరిశీలన
నవతెలంగాణ-గజ్వేల్
కరోనాలాంటి అంతర్జాతీయ విపత్తును కేసీఆర్ ఎదుర్కొన్నారని, ఒక రాష్ట్ర కరువును కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎఫ్డీసీ మాజీ చైర్మెన్ ప్రతాప్ రెడ్డితో కలిసి ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం బూరుగుపల్లి గ్రామంలో వంటేరు ప్రతాపరెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని అక్కడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుండగా, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసిందన్నారు. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాలకుపైగా పంట ఎండిపోయినా ప్రభుత్వం ఎందుకు నిద్ర లేవలేదని ఆరోపించారు. విద్యుత్ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అదే స్థాయిలో విఫలమయ్యారని తెలిపారు. పది నెలల కిందటే శాస్త్రవేత్తలు ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని హెచ్చరికలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కదలలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. పత్తి ఎకరాకు రెండూ మూడు క్వింటాల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో రైతు తెచ్చిన అప్పు ఎలా తీరుస్తాడని ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సాగు, తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నా చీమకుట్టినట్టు కూడా లేదని తెలిపారు. గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో రైతు భాస్కర్ రెడ్డి మూడెకరాల వరి పంట వేస్తే ఆ పంటను రక్షించుకునేందుకు రోజూ రూ.7000 ఖర్చుపెట్టినా చివరకు పశువుల మేతగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మ నర్సింగరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మెన్ కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు బెండ మధు, మాజీ జెడ్పీటీసీ పంగమల్లేశం, నాయకులు మద్దూరు శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రాజిరెడ్డి, శివకుమార్, హైమద్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)