Magazines

జల, ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలి

1 గంట క్రితం

Water and energy resources should be used judiciously.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 3 నిమిషాల చదవడం

వచ్చే జూలై వరకు ఇదే పరిస్థితి

నీటివనరులను తాగునీటి అవసరాలకే వినియోగించాలి

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

వరి, పత్తి పంటలకు దూరంగా ఉండాలి...ఆరుతడి పంటలేయాలి : మంత్రి తుమ్మల

తాగునీటికే ప్రాధాన్యం...
ఎల్‌‌నినోపై జిల్లాల్లో వార్‌‌రూమ్‌‌లు : 
సీఎస్‌ సంజయ్‌‌జాజు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

 తీవ్ర ఎల్‌‌నినో నేపథ్యంలో రాష్ట్రంలోని జల, ఇంధన వనరులను అత్యంత పొదుపుగా వాడుకోవాలని రైతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విన్నవించారు. ఎల్-నినో నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రైతు నేస్తం ద్వారా కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు, రైతులతో సోమవారం హైదరాబాద్‌ ‌నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ‌నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం ఎల్‌నినో ప్రభావం డిసెంబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని, 2027 వరకు ఇలాంటి పరిస్థితులు కొనసాగవచ్చని హెచ్చరించారు. వచ్చే జూన్, జులై మాసం వరకు రాష్ట్రంలో వర్షాలు వచ్చే పరిస్థితి కనిపించట్లేదన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో నీటి వనరులను కేవలం తాగునీటి సౌకర్యానికి మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. తాగు నీటి ఎద్దడి, ఆహార ధాన్యాల కొరత, పశువులకు దాన, నీటి సౌకర్యం కల్పించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని చెప్పారు. పంట నష్టాలను తగ్గించే ప్రయత్నాలను చేపట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న నీటిని కేవలం తాగునీటికి, పశువులకు నీటి వసతికి మాత్రమే వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఈ యాసంగిలో వరి, పత్తి పంటలకు దూరంగా ఉండాలని రైతులకు సూచించారు. ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు పండించాలని కోరారు. ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీపై అందచేస్తున్నామని చెప్పారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకునే అవకాశముందని హెచ్చరించారు. రాష్ట్రంలో 315 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించారు.

నీటిపారుదల శాఖ, వ్యవ సాయ, ఇంధన, పంచాయితీ రాజ్, పశు సంవర్ధక శాఖ, భూగర్భ జల వనరుల శాఖ, రెవిన్యూ తదితర శాఖలు ఎల్-నినో తీవ్ర పరిస్థితులపై రైతులను చైతన్య పర్చాలని తెలిపారు. అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎల్ -నినో పరిస్థితులు, కేంద్రానికి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లే అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 15 లక్షల ఎకరాల మేర వరి సాగు విస్తీర్ణం తగ్గిందని తెలిపారు. విద్యుత్ సరఫరా, భూగర్భ జలాల లభ్యతపై వాస్తవ పరిస్థితులను రైతులకు తెలపాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌‌జాజు మాట్లాడుతూ..రాష్ట్రంలో 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. కృష్ణా బేసిన్లో 270 టీఎంసీలకు బదులుగా 80 టీఎంసీలు, గోదావరి బేసిన్ లో 150 టీఎంసీలకు బదులుగా 100 టీఎంసీల నీరే వచ్చిందని వివరించారు. రానున్న 10 నెలలు తాగునీటి సరఫరాను అందించడానికి, పశువులకు పశుగ్రాసం, నీటి వసతికి ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు. ఎల్‌‌నినోపై మార్గదర్శకాలను అందించేందు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేకంగా వార్ రూమ్‌‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉపాధి హామీ పనులను పెద్దఎత్తున చేపడుతున్నామన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ ‌మాట్లాడుతూ..రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఆరుతడి పంటలు, బిందు సేద్యంతో పామ్ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని సూచించారు. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ ‌మిట్టల్‌ ‌మాట్లా డుతూ..రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి లభ్యత లేదనీ, ఈ ఏడాది కేవలం 25 శాతం విద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే జరుగు తున్నదని తెలిపారు. సెప్టెంబర్‌ 30‌న 19,892 మెగా వాట్ల రికారు స్థాయి విద్యుత్ వినియోగమైందని వెల్లడించారు. పంచాయతీరాజ్‌, తాగునీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ‌మాట్లాడుతూ.. నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించి పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. రాష్ట్ర పశు సంవర్థక శాఖ కార్యదర్శి ఇలంబర్తి మాట్లాడుతూ..రాష్ట్రంలో 1.39 కోట్ల పశువులు, జీవాలున్నాయనీ, వీటికి పశుగ్రాసం, నీటి వసతులను కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.




సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్