Magazines

భూమి కోసం ఓడిన పోరాటం

1 గంట క్రితం

Land
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 2 నిమిషాల చదవడం

రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిన రైతు గుండెపోటుతో మృతి
రికార్డుల్లో భూమి లేదని చూపిస్తున్నారని 
కుటుంబ సభ్యుల ఆరోపణ
సమగ్ర విచారణ జరిపి అర్హులకు
 న్యాయం చేయాలని గ్రామస్తుల డిమాండ్


నవతెలంగాణ–షాబాద్
భూమి సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ పేద రైతు గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడలో చోటుచేసు కుంది. భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురైన రైతు వారణాసి యాదయ్య (55) శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో తన భూమి విషయంపై మాట్లాడి నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 483లో వారణాసి యాదయ్యకు నాలుగు ఎకరాల లావణి భూమి ఉంది. ఈ భూమిని ప్రభుత్వం అభివృద్ధి పనుల నిమిత్తం స్వాధీనం చేసుకుని టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. అసైన్డ్‌ భూములకు పరిహారంగా హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ఎకరాకు 800 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించే విధానం ఉంది. అయితే యాదయ్యకు సంబంధించిన నాలుగు ఎకరాల భూమి ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో కనిపించడం లేదు. భూమి వివరాలను సరిచేయడంతో పాటు తనకు రావాల్సిన ప్లాట్లు కేటాయించాలని కోరుతూ యాదయ్య పలుమార్లు తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగారు. గ్రామ సర్పంచ్‌, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి తన సమస్యను చెప్పుకున్నా పరిష్కారం లభించలేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన యాదయ్య అనారోగ్యానికి లోనై గుండెపోటుతో మృతి చెందాడు. ​


​రికార్డులపై అనుమానాలు ​
సర్వే నంబర్‌ 483కు సంబంధించిన భూ రికార్డుల్లో అవకతవకలు జరిగాయనే అనుమానాలు గ్రామస్తులు ఆరోపించారు. ఉన్న భూమిని లేనట్టు, లేనివారికి ఉన్నట్టు రికార్డుల్లో చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలి పారు. భూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్‌ చెన్నయ్య, గ్రామస్తులు ఆంజనేయులు డిమాండ్‌ చేశారు.


​​అర్హులకు తప్పనిసరిగా పరిహారం అందజేస్తాం : షాబాద్‌ తహసీల్దార్‌ అన్వర్‌ అర్హులందరికీ తప్పనిసరిగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని షాబాద్‌ తహసీల్దార్‌ అన్వర్‌ తెలిపారు. లబ్దిదారుల జాబితా ఇంకా తుది దశకు రాలేదని, గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపడుతున్నామని చెప్పారు. విచారణ అనంతరం అర్హులకు ఫ్లాట్లు కేటాయిస్తామని, అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్