బలహీన శిలల మండలాన్ని దాటిన తవ్వకాలు
జూన్ 2028 నాటికి నీటి సరఫరా లక్ష్యం
అదనపు యంత్రాలు, జర్మనీ నుంచి లోకోమోటివ్‌తో వేగంగా పనులు :
మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి కీలక ముందడుగు వేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. గతంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని బలహీన శిలల మండలాన్ని (షియర్ జోన్) జాగ్రత్తగా దాటడంతో పనుల వేగం పెంచేందుకు మార్గం సుగమమైందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, అదనపు యంత్రాల వినియోగంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2028 జూన్ నాటికి నీటిని అందించేలా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో పని చేసిన అధికారులు, కార్మికుల కృషిని అభినందించారు. ఈ పురోగతిని కొనసాగిస్తూ సొరంగంలో 20 కి.మీ పైగా లోపల పని చేస్తున్న సిబ్బంది భద్రతను కాపాడేందుకు అధికారులు, గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సొరంగం పనులకు నేతృత్వం వహిస్తున్న భారత సైన్యానికి చెందిన సొరంగ నిర్మాణ నిపుణులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఇన్‌లెట్ వద్ద ఎదురైన పరిస్థితులను వివరించారు. బలహీనమైన నేల, రాళ్లు ఒక్కసారిగా విరిగిపడే రాక్ బర్స్ట్ వంటి ప్రమాదకర పరిస్థితుల కారణంగా మరో ప్రమాదం జరగకుండా తొలి నెలల్లో తవ్వకాల వేగాన్ని ఉద్దేశపూర్వకంగానే తగ్గించినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) చిక్కుకుపోయిన ప్రాంతాన్ని చుట్టి వెళ్లేలా చేపట్టిన మళ్లింపు తవ్వకాల్లో మరింత బలహీనమైన శిలల మండలం ఎదురైందని వివరించారు.ఈ ప్రాంతాన్ని సురక్షితంగా దాటేందుకు 140 మిల్లీమీటర్ల సీమ్‌లెస్ పైపులతో తవ్వకాలు జరిగే భాగానికి ముందుగా గొడుగు మాదిరి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బలమైన రిబ్‌లను అమర్చడం, దశలవారీగా తవ్వడం, ముందున్న శిలల పరిస్థితిని తెలుసుకునేందుకు పరీక్షా డ్రిల్లింగ్ చేయడం, అదనపు రక్షణ ఏర్పాట్లతో ప్రమాదాలను నియంత్రిస్తూ ముందుకు సాగినట్లు చెప్పారు. ప్రస్తుతం శిలల పరిస్థితి మెరుగుపడుతుండటంతో సాధారణంగా పనులు సాగించే అవకాశం ఏర్పడుతోందని తెలిపారు. అవుట్‌లెట్ వద్ద మూడు డ్రిల్లింగ్ భుజాలున్న బూమర్ యంత్రం ఇప్పటికే పనిచేస్తోందన్నారు. అక్కడ పనులు అవసరమైన వేగానికి చేరువలో ఉన్నాయని తెలిపారు. ఇన్‌లెట్ వద్ద కూడా ఇదే తరహా మరో యంత్రం అక్టోబరులో అందుబాటులోకి రానుందన్నారు. విద్యుత్‌తో నడిచే లోడర్లు, అధునాతన ఎక్స్‌కవేటర్లను కూడా పనుల్లో వినియోగిస్తున్నట్టు మంత్రి వివరించారు.
జర్మనీ నుంచి తెప్పిస్తున్న రైలు ఇంజిన్ (లోకోమోటివ్) అక్టోబర్ నెలాఖరుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని వినియోగంతో తవ్విన రాళ్లు, మట్టిని వేగంగా బయటకు తరలించవచ్చని, తద్వారా ఒక్కో దఫా పనికి పట్టే సమయం తగ్గుతుందని వివరించారు. సొరంగంలో 21 కి.మీ వరకు దూరం నుంచి తవ్విన పదార్థాలను తరలించాల్సి రావడం ప్రధాన అవరోధంగా ఉందని మంత్రి తెలిపారు. నీటిరంగ నిపుణులు, ఉన్నతాధికారులు మాట్లాడుతూ గడిచిన ఐదారు నెలల్లో సొరంగం తవ్వకాలు సుమారు 700 మీటర్లు ముందుకు సాగినట్లు ప్రాజెక్టు బృందం మంత్రికి వివరించారు. అవుట్‌లెట్ వైపు సుమారు 450 మీటర్లు, ఇన్‌లెట్ వైపు 250 మీటర్ల మేర పురోగతి నమోదైందని తెలిపారు. తీవ్రమైన భూగర్భ, సాంకేతిక సమస్యలతోపాటు యంత్రాలు, తవ్విన పదార్థాల రవాణాలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ ఈ పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. మొత్తం 43.968 కి.మీ ప్రధాన సొరంగం పనులు సుమారు 79 శాతం పూర్తయ్యాయని, మరో 9.1 కిలోమీటర్ల మేర తవ్వకాలు మిగిలి ఉన్నాయని వివరించారు. అత్యంత ప్రమాదకరమైన షియర్ జోన్‌ను దాటడం ప్రాజెక్టులో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు.
ఎస్‌ఎల్‌బీసీలో క్లిష్ట దశను దాటాం
52 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)