నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, ప్రముఖ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ ప్రొఫెసర్ పల్లె రామారావు (89) ఆదివారం కన్నుమూశారు. 1937 జూన్ 30న కర్నూలులో జన్మించారు. కర్నూల్ మున్సిపల్ హైస్కూల్‌లో స్కూల్ విద్యనభ్యసించారు. బెంగళూరు, మద్రాసు, ఆంధ్ర, బెనారస్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నతవిద్యనభ్యసించారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో మెటీరియల్ సైన్స్‌లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు), బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యునిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (డిఎంఆర్ఎల్) డైరెక్టర్ గా, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శిగా, ఓషన్ డెవలప్మెంట్ కార్యదర్శిగా, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్ బీ) చైర్మెన్‌గా, హెచ్ సీయూ వైస్ ఛాన్సలర్ గా, ఏఆర్ సీఐ చైర్మెన్ గా, డిఆర్ డిఓ, ఇస్రో డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్, ప్రొఫెసర్ మొదలైన అనేక హోదాల్లో పనిచేశారు. డాక్టర్ రామారావు మృతికి సీసీజీజీఓఓ జాతీయ చైర్మెన్ వి. కృష్ణ మోహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. రామారావు స్వదేశీ సాంకేతిక నైపుణ్యంతో ఆర్డినెన్సు కర్మాగారం హెవీ అల్లోయ్ పెనిట్రేటర్ ప్లాంట్, తిరుచునాపల్లి ప్రారంభంలోనూ, ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్ సిఐ), హైదరాబాద్, నాన్ -ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ (ఎన్ఎఫ్ టీడీసీ), హైదరాబాద్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై, సేఫ్టీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, కల్పక్కం, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు (టిడిబి), ఢిల్లీ మొదలైన సంస్థలను నెలకొల్పి వాటి అభివృద్ధికి పాటుబడ్డారని కొనియాడారు. ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త అయిన రామారావు మరణంతో మార్గదర్శకున్ని కోల్పోయినట్టు జనవిజ్ఞాన వేదిక ఒక ప్రకటనలో తెలిపింది. రామారావు మరణం విద్యా, శాస్త్ర, సాంకేతిక రంగాలకు తీరని లోటని ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (ఏఐపీఎస్ఎన్) శ్రద్ధాంజలి ఘటించింది.
హెచ్‌సీయూ మాజీ ఉపకులపతి, శాస్ర్తవేత్త పల్లె రామారావు మృతి
58 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)