కరువు మండలాలు ప్రకటించాలి
24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలి :
టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతలు కోసం ప్రత్యేక క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్ నినో ప్రభావం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ, పరిస్థితిని సీఎం సమీక్షించకపోవడంతో రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాల్లో పంటలు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టులో 38 శాతం, సెప్టెంబర్ లో 30 శాతం తక్కువ వర్షపాతం పడిందని, ఆగస్టులోనే సీఎం స్పందించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. వానాకాలం సీజన్ లో రైతులు బావులు, బోర్ల కింద సాగు చేసిన పంటలు చేతికి రావాలంటే నవంబర్ నెలాఖరు వరకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలను ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ పని కూడా చేయలేదని ఆమె విమర్శించారు. ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసుకోవడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. నార్లాపూర్ రిజర్వాయర్ లోని గ్రామ ప్రజలకు పునరావాసం కల్పించి, దాన్ని నింపి ఉంటే గ్రౌండ్ వాటర్ పెరిగేదన్నారు. తన గురువు చంద్రబాబు కోసం కుప్పంకు కృష్ణా నీళ్లను సీఎం రేవంత్ రెడ్డి గిఫ్ట్ గా పంపిస్తున్నారనీ, దీంతో మహబూబ్ నగర్ కు రావడం లేదని మండిపడ్డారు.
సింగరేణికి రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించి ఉంటే కరెంట్ ఉత్పత్తి సమస్య వచ్చేదే కాదన్నారు. తాము చెప్పిన చాలా అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయనీ, దానికి అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడుతున్న తెలంగాణకు ప్రధాని మోదీ ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలు దుర్భర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని.. ఈ సమయంలో సాయం చేయకపోతే మోడీని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో కరెంట్ ఉత్పత్తి ఎక్కువగా ఉందని.. ఆ కరెంట్ ను దక్షిణాది రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాలను తమ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ఇతర ముఖ్య నాయకులు సందర్శిస్తారని కవిత తెలిపారు. రైతుల సమస్యలు, కరవు అంశాలను వారు పరిశీలించి పరిష్కారానికి ప్రభుత్వానికి సూచనలు చేస్తారన్నారు. ఇప్పటికే ‘‘ఆపరేషన్ బ్లూ కోడ్’’ పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో నెలకొన్న పరిస్థితులపై తమ పార్టీ నేతలు అధ్యయనం చేస్తున్నారని ఆమె తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా జీవో 317 సమస్యను పరిష్కరించే అవకాశం ఉందన్నారు.
పేపర్ బ్యాలెట్ విధానం రావాలి
దేశంలో ఎన్నికల ప్రక్రియ మళ్లీ బ్యాలెట్ విధానంలో జరగాలని కవిత డిమాండ్ చేశారు. ఈవీఏంలను మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉందని చెప్పారు. అందుకే అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోనూ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సర్ ప్రక్రియలో జరిగిన తప్పులకు సీఈసీ రిజైన్ చేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. తాత్కాలిక పరిష్కారం కాకుండా వ్యవస్థలో మార్పు వచ్చేలా శాశ్వత పరిష్కారం కావాలన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక సహా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.






కామెంట్‌లు (0)