హుస్సేన్ సాగర్ తీరాన అట్టహాసంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
700 బతుకమ్మలు...700 మంది కళాకారులు
కళా రూపాల ప్రదర్శనలు...ఆడపడుచుల సందడి
వేడుకల్లో మంత్రులు జూపల్లి, సీతక్క
ప్రత్యేక ఆకర్షణగా గవర్నర్ దంపతులు
భారీగా తరలి వచ్చిన జనసందోహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం సద్దుల బతుకమ్మ పండుగను అంగరంగవైభోవంగా నిర్వ హించింది. పూలను అందంగా పేర్చి.. బతుకమ్మను సిద్ధం చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ పండుగను వారంతా సంప్రదా యబద్ధంగా జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో అమరజ్యోతి ప్రాంగణం వద్ద బతుకమ్మ వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. హుస్సేన్సాగర్ తీరానా వేలాది మంది ఆడపడుచులు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.700 భారీ బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆడపడుచుల బతుకమ్మ ఆటలు, పటలు...మరోవైపు 700 మంది కళాకళా రులు తమ ప్రదర్శనలతో ఆదరగొట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీగాజనసందోహం తరలిచ్చా రు. వేడుకల్లో గవర్నర్ సతీమణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆడపడచులతో కలిసి ఆడా రు. మహిళలను ఉత్సాహపరిచారు. హుస్సేన్ సాగర్ తీరంతో పాటు అమర జ్యోతి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బతుకమ్మ వేడుకలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ప్రముఖ హిరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై ఆడపడుచులను మరింత ఉత్సాహపరించారు.
ప్రకృతి పండుగ బతుకమ్మ : సీతక్క
బతుకమ్మ ప్రకృతి పండుగని ఈ సందర్భంగా సీతక్క చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలు బతుకుమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారని చెప్పారు. చేలల్లో చెరువు గట్టుల మీద ఉండే తీరొక్క పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేరుస్తామమని గుర్తు చేశారు. చెరువులను చేన్లను పరిరక్షించుకోవాలనే సంకేతానికి నిదర్శనం బతుకమ్మ పండుగని తెలిపారు. బతుకమ్మ ఆడటం ద్వారా ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఇది ఆరోగ్యన్ని పరిరక్షించే పండుగని తెలిపారు. ఆరోగ్యాన్ని అనుబంధాన్ని ఆనందాన్ని పంచే, పెంచే పండుగ బతుకమ్మని స్పష్టం చేశారు. ప్రతి మహిళను బతుకమ్మ లాగా గౌరవిద్దామని ఆమె పిలుపునిచ్చారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక : జూపల్లి
భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు పర్యావరణహితంగా పండుగలను జరుపుకుందామన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రదాయాలకు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రంగురంగుల పూలను పేర్చి, పూలనే దేవతగా కొలిచే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. తరతరాలుగా మన మహిళలు ఈ పండుగ ద్వారా మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్నారని గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒకచోట చేర్చి, ఐక్యతను చాటిచెప్పే పండుగ బతుకమ్మని స్పష్టం చేశారు. ప్రకృతిని పూజించడంతోపాటు ప్రకృతిని పరిరక్షించడం కూడా మన సంప్రదాయంలో భాగం కావాలని ఆకాంక్షించారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, నదులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు వేల సంవత్సరాల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందన్నారు.
మన భాష, యాస, పల్లె జీవనశైలి ఎంతో ప్రత్యేకమైనదని వివరించారు. తెలంగాణ కవులు, కళాకారులు, గేయ రచయితలు, సాహితీవేత్తలు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతినిధులన్నారు. వారి సృజనాత్మకత వల్ల మన భాష, యాస, జానపద కళలకు మరింత గుర్తింపు లభిస్తోందని స్పష్టం చేశారు. కళాకారులను గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించడమేనన్నారు. తెలంగాణ కళాకారులను ప్రోత్సహించడానికి, మన కళారూపాలను భావితరాలకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కళాకారులు, స్వచ్ఛంద సేవకులు, ఇతర భాగస్వాములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.






కామెంట్లు (0)