Magazines

తెలంగాణలో బీజేపీ ఓట్‌ ‌చోరీ

3 గంటల క్రితం

BJP vote
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 3 నిమిషాల చదవడం

నోటీసులు ఇచ్చినవారిలోనే 21.64 లక్షల ఓట్లు గల్లంతు

ఓ వర్గం ఓట్లను తొలగించేందుకు కుట్ర
ఫాం-7ను దుర్వినియోగం చేస్తున్న ఆ పార్టీ బీఎల్‌ఏలు
ప్రింటెడ్‌ ‌పేర్లతో దాఖలు చేస్తున్న వైనం
క్లైయిమ్‌‌లను ఓటర్లకు అందివ్వడంలోనూ ఈసీ నిర్లక్ష్యం

పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సర్వత్రా డిమాండ్‌


​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ ‌తదితర రాష్ర్టాల్లో చేసిన ఓట్‌ ‌చోరి కుట్రలను తెలంగాణలో అమలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. గంప గుత్తాగా ఓ వర్గం ఓట్లను తొలగించేందుకు ఫాం-7ను ఆయుధంగా వాడుకుంటోంది. రాష్ర్టంలోని చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన బీఎల్‌ఏలు ఇప్పటికే వాటిని దాఖలు చేసినట్టు తెలుస్తోంది. స్థానిక ఎలక్ర్టోరల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ), అసిస్టెంట్‌ ఎలక్ర్టోరల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఏఈఆర్‌ఓ)లు తమకు అనుకూలంగా ఉన్న వారైతే గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చే వారు. కాని ముషీరాబాద్‌‌లో కథ అడ్డం తిరగడంతో వారి బండారం బయట పడింది. ఈ క్రమంలో తెలంగాణ సీఈఓ కార్యాలయం అప్రమత్తమై విచారణకు ఆదేశించడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. రాష్ర్ట వ్యాప్తంగా ఫాం-7 దరఖాస్తులపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు బయట పడే అవకాశాలున్నాయి. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఫారం-7 దుర్వినియోగం, నకిలీ ఓట్ల తొలగింపు ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. నకిలీ ముద్రిత ఫారాలు హైదరాబాద్‌లోని ముషీరాబాద్, గోషామహల్, బహదూర్‌పురా వంటి నియోజకవర్గాల్లో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన 30 మంది ఓటర్ల పేర్లను తొలగించేందుకు నకిలీ ఫారం-7 దరఖాస్తులు సమర్పించారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు బీజేపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ ఎస్‌.బాలచందర్‌‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ప్రభుత్వ అధికారికి తప్పుడు సమాచారం ఇవ్వడం, మోసం చేయడానికి సంబంధించిన బీఎన్‌ఎస్‌ సెక్షన్లతో పాటు 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కూడా అభియోగాలు మోపబడ్డాయి. అలాగే గోషామహల్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం నంబరు-28లో తుడుం జనార్దన్‌ అనే వ్యక్తి 122 ఫారం-7 దరఖాస్తులు సమర్పించారు. పోలింగ్‌ కేంద్రం-173 పరిధిలోనూ 30 వరకు ఫారం-7 దరఖాస్తులు బీఎల్‌వోలకు అందాయి. వీటిపై ఓటర్ల పేర్లు ముందే ముద్రించి ఉండగా.. దరఖాస్తుదారు తన పేరు, ఫోన్‌ నంబరును మాత్రమే రాశారు. అభ్యంతరం తెలిపే వ్యక్తి ప్రతి దరఖాస్తును స్వయంగా సమర్పించాల్సి ఉన్నప్పటికీ, అభ్యంతరాలను గంపగుత్తగా ఎన్నికల నమోదు అధికారికి అందిస్తున్నారు. తన పేరు నమోదుపై అభ్యంతరం వ్యక్తమైందన్న విషయం సంబంధిత ఓటరుకు తెలియడం లేదు. చాలా చోట్ల ఈఆర్వోలు అతనికి నోటీసు జారీ చేసినప్పటికీ, దాన్ని ఓటరుకు చేరవేయడంలో బీఎల్‌ఓలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అర్హులు సైతం తమ ఓట్లను కోల్పోయే పరిస్థితి నెలకొంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఫారం-7ను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలకు సంబంధించి ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇందులో నాలుగు కేసుల్లో బీజేపీ సభ్యులు నిందితులుగా ఉండటం గమనార్హం. ఇదే ఫార్మూలాను తెలంగాణలో అమలు చేసేందుకు ఆ పార్టీ నేతలు తమ యత్నాలను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.


​ఇతర రాష్ట్రాల్లో ముద్రణ...
ఫాం-7 పత్రాలను ఇతర రాష్ర్టాల్లో ముద్రిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిపై తెలంగాణ రాష్ట్రం... విధానసభ నంబరు... విధానసభ పేరు... బూత్‌ నంబరు అని టైప్‌ చేసి ఉండటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. చాలా నియోజకవర్గాల్లోని బూతుల్లో బోగస్‌ ఫారం-7 పత్రాలు గంప గుత్తన దాఖలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వీటిని ఎవరు పంపిణీ చేస్తున్నారనేది రహస్యంగానే ఉంది. స్థానికంగా ముద్రిస్తే శాసనసభ అని రాస్తారు. శాసనసభను విధానసభ అని ఉత్తరాదిలోనే అంటారనీ, అందుకే ఈ పత్రాలనూ అక్కడే ముద్రించి ఉంటారని భావిస్తున్నారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఫారం-7 పత్రాలు ముద్రించి ఉండటం, వాటిని గంపగుత్తగా ఇస్తుండడం పట్ల రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘంతో పాటు రాష్ర్ట పోలీసులు దీనిపై లోతైన దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


​​నత్తనడకన క్లైయిమ్‌‌లు....
ఫాం-6, ఫాం-7, ఫాం-8కు సంబందించి చివరి రోజైన అక్టోబర్‌ 7 వరకు 9 వేల వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు వచ్చినట్టు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచే సగం వరకు ఉన్నాయి. అందులో 50 వేల వరకు పరిష్కరించగా, 8.5 లక్షల దరఖాస్తులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయని సమాచారం. గురువారం వరకు పూర్తి వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

21.16 లక్షల ఓట్లు గోల్‌‌మాల్‌
సర్‌ ప్రక్రియలో ఓటర్లకు జారీ చేయాల్సిన 95,555 నోటీసులు ఇంకా పెండింగ్‌‌లో ఉన్నాయి. 2002 సర్‌‌తో మ్యాపింగ్‌ ‌కాక పోవడం, ఇతర కారణాల వల్ల 92,88,180 మంది ఓటర్లకు నోటీసుల జారీకి ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో ఇప్పటి వరకు 91,92,625 మందికి నోటీసులను బీఎల్‌ఓలు అందజేశారు. అందులో 71,23,526 మంది ఓటర్లు తుది ప్రచురణకు అర్హులుగా ఎన్నికల సంఘం తేల్చింది. మరో 21,64,654 ఓట్లు గల్లంతయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్