పోలీసు జాగిలాల శిక్షణ కేంద్రంలో ఘటన
డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం..ఆరా తీసిన బీహార్ డీజీపీ
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీసు జాగిలాల సమగ్ర శిక్షణ కేంద్రంలో తెలంగాణ, బీహార్ రాష్ట్రాలకు చెందిన కానిస్టేబుళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జరిగిన ఘటనపై బీహార్ డీజీపీ ప్రీత వర్మ ఆరా తీశారు. పోలీసు వర్గాలు నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మొయినాబాద్‌లోని పోలీసు జాగిలాల సమగ్ర శిక్షణ కేంద్రంలో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసు జాగిలాలు వాటిని నిర్వహించే కానిస్టేబుల్ హాంగులర్స్ శిక్షణ జరుగుతుంది. ఈ శిక్షణ కోర్సులో దాదాపు ఏడాది పాటు పోలీసు జాగిలాలకు వాటిని నిర్వహించే కానిస్టేబుల్‌కు కఠినమైన శిక్షణను ఇస్తారు. ఇందులో ఉగ్రవాద కార్యకలాపాలు మొదలుకుని సాధారణ నేరాలకు పాల్పడే దొంగలు, దోపిడిదారుల వరకు ఆచూకీని కనిపెట్టడంలో పోలీస్ జాగిలాలకు ఆధునిక సాంకేతికపరమైన శిక్షణను ఇవ్వడం జరుగుతుంది . ఈ శిక్షణ సంస్థకు రాష్ట్రంలోనేగాక దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
అయితే ఈ శిక్షణ కేంద్రంలో తెలంగాణకు చెందిన పోలీసు జాగిలాలే గాక ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్ జాగిలాలు కూడా శిక్షణ పొందుతాయి. ఒక్కోసారి విదేశాలకు చెందిన జాగిలాలకూ ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఈ మధ్యలో రాష్ట్ర పోలీసు జాగిలాల శిక్షణ కేంద్రంలో తెలంగాణతోపాటు బీహార్‌కు చెందిన పోలీసు జాగిలాలు అక్కడి కానిస్టేబుల్ హాంగులర్స్కు శిక్షణ ఇస్తున్నారు. రెండు, మూడు రోజుల క్రితం ఈ కేంద్రంలో హఠాత్తుగా తెలంగాణతోపాటు బీహార్ కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తీవ్రస్థాయిలో జరిగిన ఘర్షణలో కొందరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. అయితే ఈ ఘర్షణకు కారణాలు అనేక రకాలుగా వినిపిస్తున్నాయి. బీహార్‌కు చెందిన కానిస్టేబుల్ శిక్షణకు వచ్చినవాళ్లు మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఘర్షణకు కానిస్టేబుల్ మధ్య నెలకొన్న ఆధిపత్య ధోరణి కారణమని తెలుస్తోంది. దీంతో కొందరు బీహార్ కానిస్టేబుళ్లు తమ జాగిలాలతో శిక్షణ కేంద్రం నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసినట్టు సమాచారం.
గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. రెండు రాష్ట్రాల కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులు కలత చెందినట్టు తెలుస్తోంది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ సమాచారం అందగానే ఘర్షణకు గల కారణాలపై ఆయన జాగిలాల శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌తో వెంటనే మాట్లాడి సమాచారం తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణకు కారకులైన కొందరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతోపాటు మరికొందరు పర్యవేక్షణ అధికారులను కూడా ఆయన సస్పెండ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ శిక్షణ కేంద్రంలో జరిగిన కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణ గురించి తెలుసుకున్న బీహార్ డీజీపీ ప్రీత వర్మ కూడా వెంటనే స్పందించి జరిగిన ఘటనపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌తో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని తెలుసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తును చేపట్టినట్టు తెలిసింది. ఇలాంటి ఘటన అత్యంత ప్రతిష్టాకరమైన ఈ జాగిలాల శిక్షణ కేంద్రంలో చోటు చేసుకోవడంతో ఉన్నతాధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






కామెంట్లు (0)