Magazines

ఢిల్లీ పోలీసుల దాడులను ఖండించండి

59 నిమిషాల క్రితం

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు, ఎంపీ జాన్ బ్రిట్టాస్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన ఢిల్లీ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర ఎ
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి : 
సుందరయ్య పార్కు వద్ద ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నిరసన

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు, ఎంపీ జాన్ బ్రిట్టాస్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన ఢిల్లీ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. రజనీకాంత్, టి. నాగరాజు మాట్లాడుతూ.. దేశంలో ఎమర్జెన్సీ గురించి పుస్తకాల్లో చదివామని, ప్రస్తుతం మోడీ పాలనలో ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడులను ప్రత్యక్షంగా చూస్తున్నామని విమర్శించారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే పోలీసులతో అణచివేయడం, నిరసన కారులను అక్రమంగా అరెస్టు చేయడం, రైళ్లలోకి, విమానాల్లోకి సైతం ప్రవేశించి అరెస్టులకు పాల్పడటం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు? ఓటర్ల జాబితా నుంచి ఎంతమంది ఓట్లను తొలగించారు? ఏ కారణాలతో తొలగించారు? అనే వివరాలను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రజలకు వెల్లడించాలని కోరారు. సర్ ప్రక్రియ నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నప్పుడు వివరాలను బయటపెట్టడానికి భయమెందుకని ప్రశ్నించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఆ హక్కును దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా, దాని విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల దాడులు, అరెస్టులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు ఆక్షేపించారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ శక్తులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపిం చారు. విద్యార్థులపై దాడులు చేయడం ద్వారా ఉద్యమాలను ఆపలేరని, విద్యార్థి లోకం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని, ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ నాయకులు, ఎంపీ జాన్ బ్రిట్టాస్‌పై జరిగిన దాడులపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను, పౌర స్వేచ్ఛలను కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, సహాయ కార్యదర్శులు ఎం.మమత, జి.కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు విఘ్నేష్, లెనిన్, జె.రమేష్, శ్రీకాంత్, శ్రీనాథ్, జ్ఞాపిక, రాజ్ కుమార్, రవితేజ, పవన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్