Magazines

చిన్నారులపై 46 శాతం పెరిగిన నేరాలు

52 నిమిషాల క్రితం

Crimes against children up by 46 percent
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 3 నిమిషాల చదవడం

పోక్సో సెక్షన్లు 4,6 బాధితుల్లో 98 శాతం బాలికలు

నిందితుల్లో 96.6 శాతం బాధితుల పరిచయస్తులే
చట్టపరమైన లోపాలను సరి చేయాలి : నల్సా సదస్సులో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నీరజ్ వర్మ


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా మొత్తం నేరాల్లో 10.8 శాతం తగ్గినప్పటికీ, చిన్నారులపై నేరాల నమోదులో 46 శాతం పెరుగుదల నమోదైందని కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నీరజ్ వర్మ తెలిపారు. ఆయన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా 2024 నివేదికను ఈ సందర్భంగా ఉటంకించారు. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (నల్సా) ఆధ్వర్యంలో “డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం, ఆన్‌లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం” అనే అంశంపై రెండు రోజులపాటు దక్షిణాది ప్రాంతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించారు. రెండో రోజు ఆదివారం జరిగిన సదస్సులో వర్మ మాట్లాడుతూ సైబర్ నేరాల నుంచి చిన్నారులను రక్షించడంలో ఎదురవుతున్న చట్టపరమైన అంతరాలు, వ్యవస్థాగత లోపాలు, తీసుకోవాల్సిన విధానపరమైన మార్పులపై సమగ్ర గణాంకాలతో కూడిన విశ్లేషణను సమర్పించారు. పోక్సో చట్టంలోని సెక్షన్లు 4, 6 కింద నమోదైన బాధితులలో 98 శాతం మంది బాలికలేనని, అందులోనూ 16 నుండి 18 సంవత్సరాల వయస్సు గలవారు అత్యధికంగా 53 శాతం ఉన్నారని గణాంకాల ద్వారా వివరించారు. సైబర్ నారాల్లో చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్ కు సంబంధించినవేననీ, పోక్సో కేసుల్లో 96.6 శాతం మంది నిందితులు బాధితులకు ముందుగా పరిచయమున్న వ్యక్తులేనని తెలిపారు.

సైబర్ నేరాల్లో 66.4 శాతం ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని చెప్పారు. 800 జిల్లాలకు గానూ 441 ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయనీ, ప్రతి జిల్లాలో కనీసం ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేయడమే మొదటి జాతీయ వ్యూహం కావాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్స్ ద్వారా అసలు చిన్నారి లేకుండానే రూపొందించే సింథటిక్ లేదా మార్ఫింగ్ లైంగిక చిత్రాలు పెను సవాలుగా మారాయని వర్మ తెలిపారు. ప్రస్తుత చట్టాల్లో ఈ అంశంపై స్పష్టమైన శిక్షా నిబంధనలు లేకపోవడం అత్యంత ప్రమాదకరమైన చట్టపరమైన లోపమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి 1 టీబీపీఎస్ వేగంతో అందుబాటులోకి వచ్చే 6జీ తో దీని ద్వారా ఏఆర్/విఆర్ దుర్వినియోగం, క్షణాల్లో వాస్తవంగా కనిపించే సింథటిక్ మీడియా తయారీ వంటి ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరించారు. ప్రస్తుతం చిన్నారులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఒకే ఒక్క సమీకృత పోర్టల్ లేదా వ్యవస్థ లేకపోవడం పెద్ద లోపమని చెప్పారు. సరిహద్దు రహిత డిజిటల్ నేరాలను దర్యాప్తు చేయడంలో ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల వద్ద డిక్రిప్షన్ కీలు లేకపోవడం, ఎంలాట్ ఒప్పందాల ద్వారా ఆధారాలు సేకరించడంలో తీవ్ర జాప్యం జరగడం, ఐటీ చట్టం సెక్షన్ 79 ద్వారా లభిస్తున్న 'సేఫ్ హార్బర్' రక్షణ ప్లాట్‌ఫారమ్‌లకు బాధ్యత లేకుండా చేస్తోందని ఆయన విమర్శించారు.

సైబర్ నేరాలను సమర్థవంతంగా విచారించేందుకు ప్రత్యేక సైబర్ ప్రాసిక్యూషన్ క్యాడర్, సైబర్ ఇన్వెస్టిగేషన్ క్యాడర్ లేకపోవడం, సైబర్ బెదిరింపులు, సెక్స్‌టార్షన్‌లకు స్పష్టమైన చట్టపరమైన నిర్వచనాలు లేకపోవడాన్ని ఎత్తిచూపారు. అంతర్జాతీయ చట్టాలను ఉదాహరిస్తూ, ఆస్ట్రేలియా, యూకే అమలు చేస్తున్న "సేఫ్టీ బై డిజైన్", "కంటెంట్ ఏజ్ గేటింగ్", మరియు అమెరికా అమలు చేస్తున్న కేంద్రీకృత క్లియరింగ్ హౌస్ విధానాల తరహా నిబంధనలు భారత చట్టాలలో ఇప్పటికీ కొరవడ్డాయని తెలిపారు. న్యాయస్థానాల వ్యాఖ్యానాలపై ఆధారపడకుండా, యూకే 1978 నాటి బాలల రక్షణ చట్టం తరహాలో సింథటిక్ మీడియా, నకిలీ చిత్రాలను (సూడో ఫోటోగ్రాఫ్స్) స్పష్టంగా చట్టంలోనే చేరుస్తూ సీఎస్ఏఎం నిర్వచనాన్ని సవరించాలని సూచించారు. నల్సా ఆధ్వర్యంలో అన్ని పోర్టళ్లను ఏకీకృతం చేస్తూ చిన్నారుల కోసం ‘ఒకే జాతీయ సైబర్ పోర్టల్’ ఏర్పాటు చేయడం, 112, 1930, 1098 హెల్ప్‌‌లైన్లను సమన్వయం చేస్తూ ‘ఒకే ఉమ్మడి హెల్ప్‌లైన్’ నిర్వహించడం, నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ద్వారా చిన్నారులపై జరిగే సైబర్ నేరాల విచారణను నిరంతరం పర్యవేక్షించే సంస్కరణలు చేయాలని ఆయన ప్రతిపాదించారు.

సైబర్ సెక్యూరిటీ కార్పొరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ హెరాల్డ్ డి కోస్టా మాట్లాడుతూ సైబర్ లైంగిక నేరాలలో డిజిటల్ ఆధారాల గుర్తింపు, సేకరణ, భద్రపరచడం, న్యాయపరమైన ఆమోదయోగ్యత (అడ్మిసిబిలిటీ) అంశాలపై సమగ్రంగా వివరించారు.సుప్రీం కోర్టు న్యాయమూర్తి, నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ జస్టిస్ విక్రమ్ నాథ్ మాట్లాడుతూ కేవలం క్రిమినల్ చట్టాల ద్వారా మాత్రమే డిజిటల్ బాల్యాన్ని సంపూర్ణంగా రక్షించలేమని తెలిపారు. కుటుంబాలు, పాఠశాలలు, సమాజం, సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లు, న్యాయవ్యవస్థల సమన్వయంతో కూడిన నివారణ, రక్షణ, దర్యాప్తు, న్యాయ సహాయం, పునరావాస చర్యలు ఏకకాలంలో సాగాలని స్పష్టం చేశారు. ఈ సదస్సులో సుప్రీం కోర్టు , హైకోర్టు ల న్యాయమూర్తులు, స్టేట్ సర్వీసెస్ చైర్మెన్లు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు న్యాయ విద్యార్థులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్