Magazines

విధి నిర్వహణలో మానవీయ దృక్పథం వీడొద్దు

1 గంట క్రితం

విధి నిర్వహణలో పోలీసులు
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 2 నిమిషాల చదవడం

శాంతి భద్రతల పరిరక్షణతోనే అభివృద్ధి సాధ్యం

పోలీసు అమరవీరుల త్యాగాలు ఎనలేనివి

హోంగార్డుల ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు : పోలీసు అమరవీరుల శ్రద్ధాంజలి సభలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

విధి నిర్వహణలో పోలీసులు మానవీయ దృక్పథంతో వ్యవహరించాల నీ, శాంతి భద్రతలు సవ్యంగా ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం గోషామహల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలిని ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల అదుపు, శాంతి భద్రతల పరిరక్షణలో దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు అసువులు బాసారని, అందులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు పోలీసులు ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము చేపడుతున్న అనేక ప్రణాళికలు, కార్యక్రమాలు విజయవంతం కావాలంటే పోలీసులు నిర్విరామంగా నిర్వహిస్తున్న శాంతి భద్రతల విధులు సవ్యంగా సాగడం ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ రవాణా, ఆహార పదార్థాల కల్తీ వంటి కార్యకలాపాలను కట్టడి చేయడం పోలీసులకు సవాలుగా పరిణమించిందనీ, వీటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విజయవంతంగా కట్టడి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు, జైళ్లు, ఫైర్‌ సర్వీసులు, ఎస్పీఎఫ్‌ విభాగాలలో 7443 పోస్టుల భర్తీని చేపట్టామనీ, 2027 నాటికి పోలీసు శాఖలోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన హోంగార్డులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 లక్షల పరిహారం నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇప్పటికే కానిస్టేబుల్‌ నుంచి ఎస్సై స్థాయి వరకు పరిహారాన్ని రూ. కోటిని, డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు రూ.1.20 కోట్లను, ఎస్పీ నుంచి ఆ పైస్థాయి అధికారులకు రూ.2 కోట్లను పరిహారంగా నిర్ణయించి ఇస్తున్నామని ఆయన తెలిపారు. పోలీసుల సంక్షేమానికి సంబంధించి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నదని చెప్పారు. అంతేగాక రోడ్డు ప్రమాదాల నివారణ కోసం టీ-మార్స్‌ ను, తినుబండారాల కల్తీని అరికట్టడానికి టీజీ-సేఫ్‌ను ఏర్పాటు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉగ్రవాదం, తీవ్రవాదమేగాక సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులు మంచి ఫలితాలను సాధిస్తున్నారనీ, సమాజంలోని పేదల సమస్యల పరిష్కారానికి కూడా పోలీసులు మానవీయ దృక్పథంతో ముందడుగు వేయాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు పోలీసు శాఖలో 16వేల పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు.

రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్‌ మాట్లాడుతూ... 1959 అక్టోబర్‌ 21న లఢఖ్‌ సరిహద్దుల్లో భారతీయ సైనికులపై జరిగిన దాడిలో 10 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అసువులు బాసారనీ, ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో కూడా మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంలో వందలాది మంది పోలీసులు అసువులు బాసారనీ, వారి త్యాగాల ఫలితంగానే ఈ రోజు రాష్ట్రంలో శాంతి నెలకొందని ఆయన కొనియాడారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ మాఫియాతో పాటు ఆహార కల్తీని అరికట్టడానికి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పోలీసు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ఆయన తెలిపారు.

అనంతరం దేశవ్యాప్తంగా అసువులు బాసిన 154 మంది పోలీసు అమరుల పేర్లను నగర సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ డీజీపీ వెంకటేశ్వర్లు చదివి వినిపించారు. ఈ సందర్భంగా సాయుధ పోలీసులు నిర్వహించిన కవాతు, పోలీసు బ్యాండ్‌ మోగించిన దేశభక్తి గీతాలు, సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ మహేశ్‌ భగవత్‌, నగర పోలీసు కమిషనర్‌ వి.సి సజ్జనార్‌, తెలంగాణ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌ అదనపు డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ తదితర పోలీసు ఉన్నతాధికారులతో పాటు పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్