- రెండు కూటముల మధ్య పోటాపోటీ
- ఖమ్మంలో ఎస్‌డబ్ల్యూఎఫ్(సీఐటీయూ) ఘన విజయం
- 17న ఫలితాలపై అధికారిక ప్రకటన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్ : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 115 పోలింగ్ స్టేషన్లల్లో ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 34,889 ఓట్లల్లో 33,973 ఓట్లు పోలయ్యాయి. ఆర్టీసీ సంఘాల మధ్య పోటాపోటీ నడిచింది. గెలుపు తమదంటే తమదేనని సంఘాల నాయకులు ప్రకటించారు. మొత్తం అన్నీ డిపోల్లో 98 శాతం పోలింగ్ నమోదైంది. 2016లో నిర్వహించన ఆర్టీసీ ఎన్నికల కంటే ఈసారి ఉత్సాహంగా కార్మికులు ఎన్నికల్లో పాల్గొని ఓటేశారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 99 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. హైదరాబాద్ జోన్‌లో 98 శాతం జరిగింది. ఇదేవిధంగా కరీంనగర్ జోన్‌లో 97 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమంది. అర్థరాత్రి వరకు ఏ యూనియన్ విజయం సాధిస్తుందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈనెల 17న ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన చేయనున్నారు. మొత్తం 12 యూనియన్లు రెండు కూటములుగా ఎన్నికల్లో పాల్గొన్నాయి. పోలింగ్ నేపథ్యంలో ఈ కూటముల నేతలు ఆయా పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. తమ అనుచరులను పోలింగ్‌లో పాల్గొనేలా ప్రొత్సహించారు. కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ సునీతాగోపాల్‌దాస్ రాష్ర్టంలోని అన్నీ పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ సరళిని తరచుగా తెలుసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో వచ్చే ఫలితాలే గుర్తింపు సంఘాన్ని నిర్ణయం చేస్తుందని ఆయా సంఘాలు అంటున్నారు.
ఖమ్మంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ గెలుపు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్(సీఐటీయూ) ఫ్యానెల్ విజయం సాధించింది. మొత్తం ఆరు డిపోల పరిధిలో మొత్తం 1792 ఒట్లు కాగా ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్యానెల్1114 ఓట్లు సాధించింది. దీంతో ఆ సంఘం శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్యానెల్‌కు ఓటేసి గుర్తింపు వచ్చేలా ఓటేసిన ఆర్టీసీ కార్మికవర్గానికి ఎస్‌బ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేసింది. సహకరించిన తెలంగాణ వర్కర్స్ యూనియన్‌తోపాటు ఇతర సంఘాలకు దన్యవాదాలు తెలియజేసింది.






కామెంట్‌లు (0)