Magazines

ఆర్థిక సంక్షోభంలో సింగరేణి

4 గంటల క్రితం

singareni
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 3 నిమిషాల చదవడం

- కొత్త బావులు లేవు...పాత బకాయిలు రావు

- ఏటా తగ్గుతున్న లాభాలు

- ట్రాన్స్ కో, జెన్ కో పెండింగ్ బకాయిలు రూ.56 వేల కోట్లు

- దీపావళి బోనస్, డివిడెంట్‌ చెల్లించలేని దైన్య స్థితి

​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ : ఒకప్పుడు నల్లబంగారు సీమగా వెలుగొందిన సింగరేణి ప్రతిష్ట నేడు మసక బారుతోంది. తెలంగాణ ఏర్పడితే రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థలు ఒక వెలుగు వెలుగుతాయని భావించిన వారికి నిరాశే ఎదురైంది. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంలో ముందుండి కొట్లాడిన కార్మికులకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేలు జరగక పోగా తీరని అన్యాయమే జరుగుతోంది. పదేండ్ల నుంచి బొగ్గు, విద్యుత్ ను యథేచ్ఛగా వాడుకుని ఒక్క రూపాయి చెల్లించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ ఉద్దెర ఖాతా, కాంగ్రెస్ సర్కార్ మూడేండ్ల పాలనలో పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి దాదాపు రూ. 56 వేల కోట్ల బకాయి పడింది. కొత్త బావులు లేకపోవడం, ఉన్న బావులు మూత పడుతుండటంతో ఏటా లాభాలు తగ్గుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది దసరా అడ్వాన్స్‌, దీపావళి బోనస్, లాభాల డివిడెండ్ చెల్లించలేని ధైన్య స్థితికి సింగరేణి చేరుకుంది. సింగరేణి సంస్థకు రాష్ర్ట ప్రభుత్వ రంగ విద్యుత్‌ సంస్థలైన ‌ట్రాన్స్‌కో కరెంట్‌ ‌బకాయిలు, జెన్‌ ‌కో బొగ్గు బకాయిలు ప్రతీ ఏటా పేరుకు పోతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్‌ఎస్‌ ‌హయాంలో మొదలైన ఉద్దెర ఖాతా మూడేండ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో భారీగా పెరిగింది. 2023 వరకు రూ.29 వేల కోట్లున్న రెండు విద్యుత్‌ ‌సంస్థల బకాయిలు కొత్త సర్కార్‌ ‌హయాంలో మరో రూ.27 వేల కోట్లు పెరిగి రూ.56 కోట్లకు చేరుకున్నాయి. ఎన్టీపీసీ తదితర సంస్థలు తమకు సరఫరా చేస్తున్న బొగ్గుకు వెంట వెంటనే బకాయిలు చెల్లిస్తుంటే రాష్ర్టానికి చెందిన విద్యుత్‌ ‌సంస్థలు మాత్రం రూపాయి చెల్లించడం లేదు. సర్కార్‌‌పై ఒత్తిడి తేలేదు.... గట్టిగా మాట్లాడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బకాయిలను వసూలు చేసుకోవడం సింగరేణికి గగనంగా మారింది. ఈ ఏడాది కార్మికులకు చెల్లించాల్సిన దీపావళి బోనస్‌, దసరా అడ్వాన్స్‌, లాభాల డివిడెండ్‌ ‌చెల్లించాలంటే కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా వ్యయం కానుంది. వాటిని సర్దుబాటు చేసేందుకు సింగరేణి సంస్థ నానా తంటాలు పడుతోంది.

​తగ్గుతున్న లాభాలు

సింగరేణి సంస్థ లాభాలు ప్రతీ ఏటా తగ్గుతున్నాయి. ఆశించిన స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరగక పోవడం, బకాయిలు పేరుకు పోవడం వల్ల సంస్థ ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2023-24 లో 70.21 మిలియన్‌ ‌టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి రూ.31.55 కోట్ల వ్యాపారం చేసింది. అన్ని వ్యయాలు పోగా రూ.4,701 కోట్ల లాభాలను గడించింది. 2024-25 సంవత్సరంలో 69 మిలియన్‌ టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించి రూ.37వేల కోట్ల వ్యాపారాన్ని నిర్వహించింది. పన్నులు, ఇతర వ్యయాలు పోగా రూ.6,394 కోట్ల లాభాలను యాజమాన్యం ప్రకటించింది. అలాగే 2025-26లో 58 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఈ సారీ లాభాలు రూ.1700 కోట్లకు పడిపోయినట్టు సమాచారం.

రూ.5 వేల కోట్లు వెంటనే చెల్లించాలి : తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ)

సింగరేణి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన రూ.56 కోట్ల బకాయిల్లో తక్షణమే రూ.5 వేల కోట్లు చెల్లించాలి. ఈ ఏడాది కార్మికుల బెనిఫిట్స్‌ ‌కూడా చెల్లించలేని స్థితిలో సంస్థను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ‌సర్కార్లు నెట్టేశాయి.

లేని బొగ్గును బ్యాలెన్స్‌‌గా చూపించి సంస్థ నష్టాలకు కారణమైన గత సర్కార్‌ ‌బాటలోనే రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. ఇప్పటికై విద్యుత్‌ ‌సంస్థల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుని సింగరేణిని రక్షించాలి.


సంవత్సరం బొగ్గు ఉత్పత్తి వ్యాపారం(వేల కోట్లల్లో) లాభాలు

1) 2023-24 70.21 మి. టన్నులు రూ. 31.55 రూ.4,701 కోట్లు

2) 2024-25 69 మి. టన్నులు రూ. 37.00 రూ.6,394 కోట్లు

4) 2024-25 58 మి. టన్నులు ......... రూ.1,700 కోట్లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్