ఇదే మా టీజీసేఫ్ లక్ష్యం
నెలన్నరలో 300 ఆహార సంస్థల్లో తనిఖీలు
64 లైసెన్సులు రద్దు, 56 మంది హోటల్ యజమానులకు నోటీసులు
277 శాంపిళ్ల సేకరణ..20 టన్నుల నకిలీ సరుకులు సీజ్
‘క్యూర్’ ఏరియాకు మొదటి ప్రాధాన్యం: ‘నవతెలంగాణ’తో టీజీ-సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
కల్తీ ఆహారం, గడువు తీరిన పదార్థాల వినియోగం, హోటల్స్‌లో అపరిశుభ్రతను ఉపేక్షించబోమని లేదని తెలంగాణ స్టాండర్స్ ఆథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ (టీజీసేఫ్) కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. నాణ్యతలేని ఆహార పదార్థాలను విక్రయించే హోటల్ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లేకపోతే సంబంధింత హోటల్‌కు నోటీసులు ఇవ్వడం, సీజ్ చేయడం, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీపై ప్రభుత్వం టీజీసేఫ్ ను ఏర్పాటు చేసి బలోపేతానికి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో టీజీసేఫ్ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు హోటల్స్ యజమానులకు హెచ్చరికలు చేస్తోంది. ఈ మేరకు అవినాష్ మహంతి ‘నవతెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
‘క్యూర్’ ఏరియాకు ప్రథమ ప్రాధాన్యం..
తనిఖీల్లో ‘క్యూర్’ ఏరియాకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాలు సుమారు 1.70 లక్షల వరకు రిజిస్టర్ అయ్యాయి. అందులో అత్యధిక శాతం ‘క్యూర్’ ఏరియా పరిధిలోనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీపై నెలన్నర రోజులుగా తనిఖీలు చేపడుతున్నాం. హోటళ్లలో పరిస్థితులను బట్టి మూడు రకాల నోటీసులు జారీ చేస్తున్నాం. సివియర్ వైలేషన్స్ ఉంటే వెంటనే లైసెన్స్ రద్దు, కొంత వరకు మెరుగ్గా ఉంటే షోకాజ్ నోటీసులు, చిన్నపాటి లోటుపాట్లు ఉంటే ఇంప్రుమెంట్ నోటీసులు ఇస్తున్నాం. లైసెన్స్ రద్దు చేస్తే 14 రోజుల్లోగా రీ వెరిఫికేషన్ కు సమయం ఇస్తున్నాం. అప్పటికీ పరిస్థితులు మెరుగుపడితే లైసెన్స్ పునరుద్ధరిస్తున్నాం.
నెలన్నరలో 300 తనిఖీలు
టీజీ-సేఫ్ ఏర్పాటైన నెలన్నర వ్యవధిలో దాదాపు 300 ఆహార సంస్థల్లో తనిఖీ చేశాం. హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్, పీజీ హాస్టళ్లు, డెయిరీ యూనిట్లు, స్వీట్స్ తోపాటు నిత్యావసర సరుకులు సరఫరా చేసే ఇన్‌స్టా కార్ట్, స్విగ్గీ, జెప్టో, బిగ్ బాస్కెట్, బ్లింక్ఇట్, జెప్టో, స్వీట్ దుకాణాలు, కేఫ్స్, పన్నీర్ యూనిట్లు, దాబా హోటళ్లపై దాడులు నిర్వహించాం. ‘క్యూర్’ పరిధితోపాటు నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి.
64 సంస్థల లైసెన్సులు రద్దు
ఇప్పటి వరకు తనిఖీలు చేసిన 300 సంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించే 64 సంస్థల లైసెన్సులను రద్దు చేశాం. 56 సంస్థలకు షోకాజ్ నోటీసులు, 112 సంస్థలకు ఇంప్రుమెంట్ నోటీసులు ఇచ్చాం. దాదాపు 277 శాంపిల్స్ సేకరించాం. ల్యాబ్ లో పరీక్షించి, అన్ సేఫ్ అని వస్తే కోర్టులో కేసు వేస్తాం. జరిమానాలు సైతం విధిస్తాం. ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న అనలాగ్ పన్నీర్ తయారీ, విక్రయాలను ప్రభుత్వం ఏడాదిపాటు బ్యాన్ చేసింది. 64 హోటళ్లు, ఫుడ్ డెలివరీ సంస్థల లైసెన్సులను సస్పెన్స్ చేశాం. 5 సంస్థల లైసెన్సులను పూర్తిగా రద్దు చేశాం. హోటళ్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు ఆహార తయారీకి వినియోగించే నాణ్యతలేని 20 టన్నుల సరుకును సీజ్ చేశాం. టీజే-సేఫ్ ను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు దీసుకుంటున్నాం. అవసరమైన సిబ్బందిని భర్తీ చేసుకుని ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి చేస్తాం.
త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్!
కల్తీ సంబంధిత కేసుల దర్యాప్తునకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ప్రభుత్వం కూడా అంగీకరించింది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ పోలీస్ స్టేషన్ పని చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుతం 80 మంది వరకు పోలీస్ సిబ్బందితో ‘క్యూర్’ ఏరియాలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. జిల్లాల్లోనూ తనిఖీలు ప్రారంభించాం. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్, డ్రగ్స్ వింగ్స్ తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయి.
టోల్ ఫ్రీ నెంబర్ 1800-112-100
ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-112-100ను అందుబాటులో ఉంచాం. ఫుడ్ సేఫ్టీకి 9100105795, డ్రగ్స్ వింగ్‌కు 1800-599-6969 నెంబర్లను కేటాయించాం. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేసేందుకు కూడా చర్యలు తీసుకోనున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సులు లేని ఆహార సంస్థలను గుర్తించి వాటికి కూడా లైసెన్సులు జారీ చేస్తామని అవినాష్ మహంతి తెలిపారు.







కామెంట్‌లు (0)