Magazines

ఓట్ల దొంగలు గ‌ద్దె దిగాలి

50 నిమిషాల క్రితం

Vote thieves
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 2 నిమిషాల చదవడం

​సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే

2023 ఎన్నికల కమిషన్ చట్టాన్ని రద్దు చేయాలి

‘చ‌లో లోక్‌భ‌వ‌న్ ’లో ఇండియా బ్లాక్‌ నేతల డిమాండ్

మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా నినాదాలు

నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ కు ర్యాలీ

బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు

మ‌హేశ్ కుమార్ గౌడ్‌, జాన్ వెస్లీ, కూనంనేని, కోదండ‌రామ్ స‌హా ప‌లువురి అరెస్టు

ఖైర‌తాబాద్ చౌర‌స్తా ప‌రిస‌రాల్లో తీవ్ర ఉద్రిక్త‌త



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో తిష్ట‌వేసిన ఓట్ల దొంగ‌లు గ‌ద్దె దిగే వ‌ర‌కూ త‌మ పోరాటం ఆగ‌దని ఇండియా ‌బ్లాక్‌ నేత‌లు హెచ్చ‌రించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేన‌ని, 2023 ఎన్నికల కమిషన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇండియా బ్లాక్‌ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం హైద‌రాబాద్‌లో చ‌లో లోక్ భ‌వ‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. టీపీసీసీ అధ్యక్షులు మ‌హేశ్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహమ్మద్ అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సర్ ప్రక్రియను రద్దు చేయాలనీ, కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి భారీ ర్యాలీ చేప‌ట్టారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వారు లోక్‌భ‌వ‌న్ వైపున‌కు వెళ్లేందుకు ప్రయ‌త్నించారు. ఆ ప్ర‌ద‌ర్శ‌న‌ను పోలీసులు మధ్యలోనే బారికేడ్లతో అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తిప్పి కొట్టారు. బీజేపీ డౌన్ డౌన్, మోడీ స‌ర్కార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు, బ్యానర్‌‌లు ప్రదర్శిస్తూ వేలాది మంది ముందుకు సాగారు. దీంతో లోక్ భవన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ర్యాలీని అడ్డుకునేందుకు అక్క‌డ పెద్ద సంఖ్య‌లో పోలీసుల‌ను ‌మోహ‌రించారు. మెట్రో రెసిడెన్సీ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడికి ర్యాలీ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. త‌మ‌ను లోక్ భ‌వ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌నివ్వాలంటూ వాదించారు. పోలీసులు పదే పదే అనుమతి లేదంటూ ఆపేందుకు ప్రయత్నిం చడంతో బారికేడ్లను నెట్టుకుంటూ ముందుకెళ్లారు. మెట్రో రెసిడెన్సీ నుంచి లోక్ భవన్ వైపునకు దూసు కెళ్లిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో మ‌హేశ్ కుమార్ గౌడ్‌, జాన్ వెస్లీ, కూనంనేని, కోదండ‌రామ్‌తోపాటు ​ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి.సాగర్, మహమ్మద్ అబ్బాస్, మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.అరుణజ్యోతి, బుర్రి ప్రసాద్‌, ఉడతా రవీందర్‌, ఫైళ్ల ఆశయ్య, స్కైలాబ్‌‌బాబు, నాయకులు మూడ్ శోభన్ తదితర నేతలు లోక్ భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. మెట్రో రెసిడెన్సీ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్దే కొంత మందిని అరెస్ట్ చేయగా, మరి కొంత మందిని లోక్ భవన్ కు అత్యంత సమీపంలో అడ్డుకున్నారు. దీంతో వారు గుంపులు, గుంపులుగా అక్కడే బైటాయించారు. అనంతరం కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్), టీజేఎస్, న్యూడెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, ఎస్ యూసీఐ, ఎంసీపీఐ(యూ) తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లీ పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. మరోవైపు లోక్ భవన్ ప్రవేశ మార్గం వద్ద కూడా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్