చిట్టొజిపల్లిలో పేదలు సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి
ప్రభుత్వ భూములను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టిన తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలి : ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ-మెదక్, రామాయంపేట
మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టొజిపల్లి గ్రామంలో పేదలు సాగుచే సుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చే వరకు భూపోరాటాన్ని కొనసాగిస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అన్నారు. చిట్టొజిపల్లిలో రైతులు సాగు చేసుకుం టున్న భూములను ఆదివారం వ్యవసా య కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లను మార్చి ప్రైయివేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు చేసిన తహసీల్దార్, రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెఆర్‌టెక్ ఇండియా ఫార్మ్ సంస్థకు కేటాయించిన ప్రభుత్వ భూమిని రద్దు చేయాలని కోరారు. గ్రామంలోని 266/1 సర్వే నంబర్‌లో ఉన్న సుమారు 750 ఎకరాల భూమిని పేదలు పన్నెండేండ్లుగా సాగు చేసుకుంటున్నారని నాగయ్య తెలిపారు. 2004లో 184 మందికి భూదాన్ మండలి ద్వారా పట్టాలు ఇచ్చారని చెప్పారు. అసైన్ మెంట్, భూ పరిమితి చట్టం పరిధిలోని భూములను భూదాన్ మండలికి అప్పగించే హక్కు భూస్వామికి ఎక్కడిదని ప్రశ్నిం చారు. పేదలు సాగుచేస్తున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసు కొనసాగుతున్న భూమిని ప్రైయివేట్ పరిశ్రమకు ఎలా..?
ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు మార్చి ప్రైయివేట్ వ్యక్తులకు ఎలా రిజిస్ట్రేషన్లు చేశారని ప్రశ్నించారు. తప్పుడు రికార్డులు సృష్టించి భూముల బదలాయింపులకు పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేగుంట తహసీల్దార్‌తో పాటు సంబంధిత రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయ స్థానంలో కేసు కొనసాగుతున్న భూమిని ప్రయివేటు పరిశ్రమకు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. గ్రామంలో భూముల కోసం పోరాడుతున్న పేదలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని నాగయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రైయివేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేయకుండా పేదలపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను అటవీ శాఖ స్వాధీనం చేసుకునే సమయంలో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ మెదక్ జిల్లాలో అవి ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. భూముల ఆక్రమణదారులకు రెవెన్యూ కార్యాలయాలు అడ్డాలుగా మారుతున్నాయని ఆరోపించారు.
పేదలకు భూములు ఎందుకు పంచడం లేదు?
ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 96 వేల ఎకరాల భూ పరిమితి చట్టం పరిధిలోని భూములు ఉన్నాయని, మెదక్ జిల్లాలో సుమారు 62 వేల ఎకరాల భూమి ఉందని నాగయ్య తెలిపారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములను పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. కోనేరు రంగారావు భూ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను ప్రైయివేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు కేటాయించడం సరికాదన్నారు. చిట్టొజిపల్లి గ్రామంలోని పేదలకు భూములపై హక్కులు కల్పించే వరకు భూపోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భూమిలేని పేదలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి. పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య, జిల్లా అధ్యక్షులు గౌరయ్య, కార్యదర్శి కె. మల్లేశం, గ్రామ సర్పంచ్ ఎం. లక్ష్మీనర్సింహారెడ్డి, భూ పోరాట కమిటీ అధ్యక్షులు కుర్మ మల్లే ష్, చిట్టొజిపల్లి భూ పోరాట కమిటీ నాయకులు నరేష్, కుర్మ మల్లేష్, తలారి నరేష్, మహేష్, ఇదా రాజు, స్వామి, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)