Magazines

సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

6 రోజుల క్రితం

Music director Deva
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

తన సుమదుర సంగీతంతో ఆబాలగోపాలాన్ని అలరించిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవా (75) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ‘తేనిసై తెండ్రల్’గా కోట్లాదిమంది సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన దేవా 1980ల చివర్లో చిత్రసీమలోకి అడుగుపెట్టి 1990లలో తమిళనాట సంగీత సామ్రాజ్యాన్ని శాసించారు. ప్రత్యేకించి చెన్నై స్థానిక ‘గానా’ సంస్కృతిని, ఫోక్ బీట్స్‌ను మెయిన్‌స్ట్రీమ్ సినిమా సంగీతంలోకి తీసుకొచ్చి సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. దాదాపు మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కి పైగా చిత్రాలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. తమిళనాడు ప్రభుత్వ ‘కలైమా మణి’ పురస్కారంతో పాటు.. ‘ఆసై’ చిత్రానికి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా తమిళనాడు రాష్ట్ర అవార్డును అందుకున్నారు. 1950లో చెన్నైలో జన్మించిన దేవా అసలు పేరు దేవనేసన్ చొక్కలింగం.

జె.బి. కృష్ణ శిక్షణలో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. 1986లో వచ్చిన ‘మాట్టుకర మన్నారు’తో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగులో ‘శ్రీమాన్ బ్రహ్మచారి’ తొలి సినిమా. చిరంజీవి ‘మాస్టర్‌’, పవన్‌ కల్యాణ్‌ ‘తొలి ప్రేమ’తో పాటు ‘ఆటోడ్రైవర్‌’, ‘బాగున్నారా’, ‘నాగ’ తదితర సినిమాలకు కంపోజ్‌ చేశారు. రజనీకాంత్ నటించిన ‘బాషా’, ‘అన్నా మలై’, ‘అరుణాచలం’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. వీటితో పాటు అజిత్, విజయ్ కెరీర్‌లలో మైల్‌ స్టోన్‌గా నిలిచిన ‘ఆసై’, ‘కాదల్ కోట్టై’, ‘నేరుక్కు నేర్’, ‘నినైతేన్ వందై’, ‘ప్రియముడన్’, ‘వాలి’, ‘ఖుషి’ వంటి ఎన్నో కల్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆయన తన సంగీతంతో ప్రాణం పోశారు. ఆయన కుమారుడు శ్రీకాంత్ దేవా కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. అలాగే తమిళ నటుడు ‘జై’.. దేవా మేనల్లుడే. దేవా మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్