ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. ఈ సిరీస్‌ను జీ5లో ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో బుధవారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ, ‘వివేక్ శ్రీమతి సూర్యకాంతి ఈ సిరీస్‌తో నిర్మాతగా రానున్నారు. డైరెక్టర్ శశి ఈ సిరీస్‌తో గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సిరీస్ కంటెంట్ నేను చూశాను. ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘పన్నెండేళ్ల క్రితం జీ5లో ‘పసుపు కుంకుమ’తో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘పరువు’, ‘వికటకవి’ చేశాను. ఇప్పుడు ‘రుద్రవనం పీఎస్’ అంటూ రాబోతోన్నాం’ అని నరేష్ అగస్త్య చెప్పారు.
దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ,‘ప్రతీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతూ తెలుగులో గొప్ప క్రైమ్, థ్రిల్లర్‌గా నిలుస్తుంది’ అని తెలిపారు. ‘సిరీస్‌ను మా దర్శకుడు శశి అద్భుతంగా తెరకెక్కించారు. మా ప్రాజెక్ట్‌కి ఎంతో సపోర్ట్ చేసిన జీ5 టీంకి థాంక్స్’ అని నిర్మాత రమేష్ చెప్పారు. నిర్మాత సూర్యక్రాంతి మాట్లాడుతూ,‘ఇందులోని ప్రతీ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఉంటుంది. జీ5 టీం ఇచ్చిన సపోర్ట్‌ని మేం ఎప్పుడూ మర్చిపోలేం’ అని తెలిపారు. ‘మాకు ఈ అవకాశం ఇచ్చిన జీ5 టీంకు థాంక్స్. నరేష్ అగస్త్య మాకు ఎంతో సహకరించారు. ఇది మంచి సిరీస్ అవుతుందని నమ్ముతున్నాను’ అని వివేక్ కూఛిబొట్ల అన్నారు. శ్రావణి రెడ్డి మాట్లాడుతూ,‘ఇందులో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా ఈ క్రైమ్, థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంటుంది. జీ5లో ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది’ అని చెప్పారు.






కామెంట్‌లు (0)