Magazines

అరచేతిలో అంతర్జాలం..వినియోగంలో విచక్షణ అవసరం!

1 గంట క్రితం

essential
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌-ఏఐ యుగం వరకు మానవ జీవనశైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల్లో అంతర్జాలం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 29న అంతర్జాతీయ అంతర్జాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1969 అక్టోబర్‌ 29న అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి లియోనార్డ్‌ క్లైన్‌రాక్‌ పరిశోధనా బృందం, చార్లీ క్లైన్‌ సహకారంతో, కంప్యూటర్ల మధ్య తొలి ఇంటర్నెట్‌ సందేశాన్ని పంపేందుకు ప్రయత్నించింది. ‘LOGIN’ అనే పదాన్ని పంపే క్రమంలో మొదట ‘L’, ‘O’ అక్షరాలు విజయవంతంగా చేరాయి. ఈ సంఘటన అంతర్జాల చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. 1989లో టిమ్‌ బెర్నర్స్‌-లీ వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ఆలోచనను అభివృద్ధి చేశారు. అంతర్జాలం విస్తరించడంతో ప్రపంచ విజ్ఞానం స్మార్ట్‌ఫోన్‌ ద్వారా మన అరచేతిలోకి చేరింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.56 బిలియన్ల మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారని, ప్రపంచ జనాభాలో దాదాపు 68 శాతం మంది ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్నారని అంచనాలు సూచిస్తున్నాయి.


చైనాలో సుమారు 975 మిలియన్లు, భారత్‌లో 806 మిలియన్లు, అమెరికాలో 322 మిలియన్ల మంది అంతర్జాల వినియోగదారులు ఉన్నట్లు వ్యాసంలో పేర్కొన్న గణాంకాలు తెలియజేస్తున్నాయి. సగటున రోజుకు ఆరు గంటలకుపైగా అంతర్జాల వినియోగానికి, రెండు గంటలకు పైగా సోషల్‌ మీడియాకు కేటాయిస్తున్నారు. ఈ గణాంకాలు ఆధునిక జీవితంలో అంతర్జాలం ఎంతగా భాగమైందో తెలియజేస్తున్నాయి. అయితే వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్‌ భద్రత, వ్యక్తిగత సమాచార రక్షణ, సమయపాలనపై అవగాహన పెంచుకోవడం కూడా అంతే అవసరం. సమాచార సేకరణ నుంచి విద్య, పరిశోధన, బ్యాంకింగ్‌, ఆర్థిక లావాదేవీలు, వైద్య సేవలు, ఆన్‌లైన్‌ చర్చలు, ఈ-లైబ్రరీలు, కృత్రిమ మేధ, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వరకు అనేక రంగాల్లో అంతర్జాలం ఉపయోగపడుతోంది. విద్యార్థులు అవసరమైన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. పరిశోధకులు కొత్త విషయాలను అన్వేషించవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు తమ కార్యకలాపాలను వేగంగా నిర్వహించుకోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నవారితోనూ క్షణాల్లో సమాచారాన్ని పంచుకోవచ్చు.


సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే వ్యక్తిగత అభివృద్ధితోపాటు సమాజ ప్రగతికి కూడా అంతర్జాలం తోడ్పడుతుంది.అయితే అంతర్జాలం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, నిర్లక్ష్యంగా వినియోగిస్తే అంతే స్థాయిలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌, సోషల్‌ మీడియాకు పరిమితమైతే నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, కంటి సమస్యలు, శారీరక శ్రమ తగ్గడం, ఒంటరితనం వంటి ఇబ్బందులు కలగవచ్చు. సైబర్‌ బుల్లీయింగ్‌, ఫిషింగ్‌ మోసాలు, మాల్‌వేర్‌, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, అప్పుల మోసాలు వంటి సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గుర్తుతెలియని లింకులను తెరవడం, ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మడం, వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవడం ప్రమాదకరం. అంతర్జాలాన్ని సురక్షితంగా వినియోగించుకోవాలనే అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ‘సురక్షిత అంతర్జాల దినం’ కూడా నిర్వహిస్తున్నారు.


బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం, రెండు దశల ధ్రువీకరణను ఏర్పాటు చేసుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, అనుమానాస్పద సందేశాలు, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోవాలి. తప్పుడు వార్తలను ఇతరులకు పంపే ముందు వాటి నిజానిజాలను పరిశీలించాలి. ఆన్‌లైన్‌లో ఇతరులతో గౌరవంగా వ్యవహరిస్తూ, హానికరమైన చర్యలకు దూరంగా ఉండాలి. పిల్లలు, యువత అంతర్జాలాన్ని విజ్ఞాన సముపార్జనకు ఉపయోగించుకునేలా కుటుంబాలు, విద్యాసంస్థలు అవగాహన కల్పించాలి.అంతర్జాలం మంచిదా, చెడ్డదా అన్నది దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సమయపాలన పాటిస్తూ, సురక్షిత పద్ధతులను అనుసరిస్తూ, విజ్ఞానం మరియు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తే అంతర్జాలం మన ప్రగతికి బలమైన సాధనమ వుతుంది. అంతర్జాలాన్ని వ్యసనంగా కాకుండా విజ్ఞాన వనరుగా, వినోద సాధనంగా మాత్రమే కాకుండా అభివృద్ధికి ఇంధనంగా వినియోగించుకుందాం.


బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్