పర్వతాన్ని తాకిన మేఘం

23 నిమిషాల క్రితం

mountain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రముఖ తత్వవేత్త పాల్ టిల్లిచ్ ‘ప్రేమకు మొదటి కర్తవ్యం వినడం’ అంటారు. ఆధునిక ప్రపంచంలో అందరూ తమ గురించి తాము చెప్పుకోవాలనే ఆరాటంలోనే ఉంటారు తప్ప, ఎదుటివారి మనసులోని అల్లకల్లోలాన్ని ఎలాంటి తీర్పులూ ఇవ్వకుండా ఓపికగా వినేవాళ్లు చాలా అరుదు. వినడం అంటే కేవలం ఎదుటివారి మాటలను గ్రహించడం మాత్రమే కాదు, వారి బాధను పంచుకునేలా మన ఆలోచనలను పక్కనపెట్టి మౌనం వహించడం. ఒకరు తమ గుండె భారాన్ని దించుకుంటున్నప్పుడు, ఏ సలహాలూ ఇవ్వకుండా, ‘నేను నీ కోసం ఇక్కడ ఉన్నాను’ అని పక్కన నిలబడే ఆ నిశ్శబ్దమే బహుశా అన్నిటికంటే గొప్ప ప్రేమ. సరిగ్గా ఈ భావననే అత్యంత సహజంగా అక్షరబద్ధం చేసిన నవల శ్రీ ఊహ రాసిన ‘అమరానందమే ప్రేమ’. తెలుగు సాహిత్యంలో ప్రేమకథల ప్రస్తావన వస్తే దాదాపుగా ప్రేమను పూర్తిగా పక్కనపెట్టేశారనే చెప్పాలి. మన తెలుగు సినిమాలో మాత్రం ప్రేమకు ఎప్పుడూ పెద్ద పీటే వేశారు.


అయితే వాటిలో సహజత్వం కంటే నాటకీయతే ఎక్కువ. నేటి తరానికి ఎదురయ్యే సవాళ్లు మాత్రం పూర్తిగా వేరు. వృత్తిపరమైన ఆందోళనలు, మధ్యతరగతి కష్టాలు, అస్తిత్వ పోరాటాలు, లోపల దహించే ఒంటరితనం నేటి బంధాలను శాసిస్తున్నాయి. ఇలాంటి వాస్తవిక పరిస్థితుల మధ్య, మనుషుల అంతరంగాల్లో జరిగే మార్పులను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన అద్భుతమైన నవల ఇది. ఒకరి లోపలి శూన్యాన్ని, ఒంటరితనాన్ని మరొకరు ఎలా పూరించుకున్నారనేది ఈ నవల ప్రధాన ఇతివృత్తం. ఈ కథలోని ఆశ్లిష్ట పాత్ర అటువంటి ఒక శూన్యం నుంచే తన ప్రయాణం మొదలుపెడుతుంది. ఒక ప్రమాదంలో తండ్రిని కోల్పోయి, ఆ ప్రాణాన్ని కేవలం నష్టపరిహారపు డబ్బుతో కొలవాలని చూసే లోకం ముందు లొంగిపోని ఆమె పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. తన దుఃఖాన్ని దాటుకుని సింగరేణి బొగ్గు గనుల్లో జూనియర్ మైనింగ్ ఆఫీసర్ ట్రైనీగా అడుగుపెట్టడం, గని చీకట్లలో నిరంతరం శ్రమిస్తూ కుటుంబాన్ని నిలబెట్టే మహిళల్లో ఆమె అద్భుతమైన ధైర్యాన్ని చూడటం ఈ నవలకు ఒక బలమైన వాస్తవికతను అద్దాయి.

మహిళా సాధికారత అంటే వేదికల మీద అరిచి చెప్పడం మాత్రమే కాదని, మట్టిలో, శ్రమలో అసలైన సాధికారత ఉంటుందని రచయిత్రి ఆచరణాత్మకంగా చూపించారు. ఈ తరం యువ పాఠకులు ఈ నవలను తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉంది. వారు బంధాల్లో వెతికేది పెద్దపెద్ద త్యాగాలను కాదు; తమ ఉనికిని గౌరవించే, తమ మాటను ఎలాంటి తీర్పులూ లేకుండా వినే ఒక ప్రశాంతమైన తోడును. కెరీర్ సందిగ్ధతలు, కుటుంబ బాధ్యతలు, ఎవరికీ చెప్పుకోలేని ఒంటరి పోరాటాల మధ్య నలిగిపోయే నేటి యువత మానసిక సంఘర్షణకు ఈ నవల అచ్చమైన అద్దం పడుతుంది. సుదూర తీరాల నుంచి దారితప్పి అలసిపోయి వచ్చిన ఒక మేఘం, ఒంటరిగా ఉన్న ఒక పర్వతాన్ని ఆత్మీయంగా హత్తుకున్నట్టుగా ఈ కథ మన మనసును మెల్లగా తాకి అక్కడే ప్రశాంతంగా ఉండిపోతుంది. డబ్బు, ఉద్యోగం, సమాజం అనే గీతల మధ్య నేటి యువత తమ ప్రేమను, బాధను ఎలా సమతుల్యం చేసుకుంటున్నారో చెప్పిన ఈ నవల, మన కష్టసుఖాల్లో నిజంగా తోడుండేది మనం ఎంచుకున్న వాళ్లతో పంచుకునే ఇలాంటి మౌనరాగాలే అని అద్భుతంగా గుర్తు చేస్తుంది.

- వెంకట్ శిద్దారెడ్డి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్