సరుకు కానిదేమున్నది లోకంలో, కన్నీ ళ్లూ, కనేపేగూ, అమ్మకడుపూ ఎంబ్రియో, ఏదైతేనేం అంగట్లో అమ్మకాలు కొనుగోళ్లే.... ఎంతెంత దూరాలు ఎదిగి వచ్చాం! మనసును కూడా వాడుకునే దినుసుగా చేసుకున్నాం. ఎప్పుడో రెండు వందలేండ్ల క్రితం మార్క్స్ చెప్పింది విని, ఇంకా మన అనుభవంలోకి రాలేదుగా అని గమ్మున ఉండిపోయాం. చూస్తూ చూస్తూనే సరుకులుగా మారిపోయాం. డబ్బు, పెట్టుబడి రూపంలో ఎంత పనిచేస్తోంది. దాని ముందు తలెత్తుకొని ఏదైనా, ఎవరైనా నిలబడ గలుగుతున్నారా! ఒళ్లు అమ్ముకోవడం చూశా ము, గర్భాలమ్ముకోవడమూ చూశాము, కన్న పిల్లల్ని అమ్ముకోవడం చూశాము. ఇప్పుడు కనటానికి కావలసిన అండాలనూ అమ్ముకుం టున్నారు. అమ్ముకోవటం, కొనటమంటే, వ్యాపారం. వ్యాపారం అంటేనే లాభాలు. లాభాలు ఉన్నచోట మోసాలు, దోపిడీ, అమానవీయత వీరవిహారం చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే! డబ్బు, మానవ సహజ లక్షణమైన మానవీయ లక్షణాన్ని పూర్తిగా వ్యతిరేకంగా మార్చివేస్తుంది. మానవ సహజ గుణాలనూ తలకిందులు చేస్తుంది. ఎంతటి అఘాయిత్యానికైనా ఒడిగడుతుంది.
అందుకు నిలువెత్తు నిదర్శనంగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ అండ దానాల పేర జరుగుతున్న అమానుష, అక్రమ వ్యాపార సంఘటనలు నిలుస్తున్నాయి. వీటి వివరాలు తెలుసుకుంటే దారుణ విషయాలు బయట పడుతున్నాయి. అనేక కారణాల చేత పిల్లలను కనలేని దంపతులకు ఫర్టిలిటీ సెంటర్లు, ఎగ్ డొనేషన్, ఏ.ఆర్.టి. సెంటర్లు ఏర్పడిన విషయం మనందరికీ తెలుసు. దీనికి ప్రభుత్వమూ కొన్ని నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇప్పుడా అండ దానాల కోసం పెద్ద వ్యాపారమే సాగుతోందని వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న మహిళలను, ముఖ్యంగా అప్పుల్లో మునిగి, కట్టలేని కుటుంబాల మహిళలు, దారిద్య్రంలో ఉన్నవాళ్లను గుర్తించి, వాళ్లను హైదరాబాద్‌కు తీసుకువచ్చి కేంద్రాలకు నడుపుతున్నారని వెలుగులోకి వచ్చింది. 20-30 సంవత్సరాల వయసున్న మహిళలను ఇక్కడికి తీసుకువచ్చి హాస్టళ్లు నిర్వహిస్తున్నారు వ్యాపారులు. వాళ్లకు నెలకు యాభైవేల రూపాయల జీతం ఇస్తామని, కేవలం వారు చేయాల్సింది ఇంజెక్షన్లు తీసుకుని అండాలు ఇవ్వటమే అని వాళ్లకు చెప్పి, వారి అవసరాలను ఆసరా చేసుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. ఇంతకీ వాళ్లకు హార్మోన్ ఇంజక్షన్లను ఇస్తున్నారు. దాంతో నెలకి ఒకే అండం విడుదలకు బదులు మల్టిపుల్ ఎగ్స్ ఉత్పత్తి చేయిస్తూ, మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చట్టప్రకారం అండం దానం చేయొచ్చు. కానీ వారికి పెండ్లయి ఉండాలి. ఒక బిడ్డయినా పుట్టి, మూడేండ్లు నిండాలి. ఒక్కసారి మాత్రమే అండం ఇవ్వాలి. డాక్టర్ల పర్యవేక్షణ ఉండాలి. ఇవేవీ లేకుండానే హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాల ఉత్పత్తి చేస్తున్నారు.
ఇంకా దారుణమైన విషయమేమంటే, ఏ రంగు ఉన్న మహిళ అండం కావాలి? ఏ కులం మహిళ అండం కావాలి? ఏ మతం మహిళ అండం కావాలి? అనే విభాగాల మేరకు విభజన ధరలు నిర్ణయించి, ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మహిళలను తీసుకువచ్చి కోట్ల రూపాయలతో వ్యాపారాలు నడిపిస్తున్నారు. వీళ్లకు ఇక్కడ ఉన్న డిమాండ్‌ను బట్టి, మహిళలను వెతికి తెచ్చి కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పాపం డబ్బులకు ఆశపడి వచ్చినవాళ్లకు తమ శరీరాలపైన ప్రయోగాలు చేస్తున్నారని తెలియదు. హార్మోన్ల వినియోగం వల్ల ప్రాణాలకూ ముప్పు ఏర్పడవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. పిల్లలు లేని తల్లిదండ్రులు, ఇప్పుడు ఏ రంగు గల పిల్లల్ని కావాలో నిర్ణయించుకుంటారన్న మాట! అంతేకాదు, ఏ మత, కులానికి చెందిన వారిని తమ వారసులుగా పొందాలో నిర్ణయించి, కొనుక్కుని కంటారన్నమాట! డబ్బు, వ్యాపారం ఏ సంబంధాల ఇస్తున్నదో తెలిసిందా!
మెడికల్ మాఫియా పెద్ద ఎత్తున సాగుతోందనడానికి ఇంకా ఏం కావాలి. ఇక్కడి ఆస్పత్రుల వ్యవహారాలూ చాలా అవినీతిమయంగా మారాయి. వాటిపైన ఇపుడు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా చాలా విషయాలు బయటకు రావచ్చు. లేదా ఆగిపోనూవచ్చు. కానీ ప్రాణాలతో చెలగాటమాడే విధంగా మనుషులను తయారు చేసిన పేదరికం, దారిద్య్రం గురించిన చర్చ అవసరం. అంటే ఇక్కడ ఆ మహిళల పేదరికమే ఈ దళారుల పెట్టుబడిగా మారింది. ఇపుడు అమ్మలు తమ అండాలతో అంగళ్లలో నిలబడి అమ్ముకొంటున్నారు. ఇది వాళ్ల తప్పుకాదు, దాన్ని వ్యాపారం చేసి లాభాలు పొందే వ్యవస్థది!





కామెంట్లు (0)