రంగస్వామి అనే వ్యక్తికి అందరికన్నా తెలివైనవాడనన్న గర్వం ఉంది.ఒక రోజు పని మీద పట్నం వచ్చి ఒక కిల్లీబడ్డీ దగ్గర ఆగాడు. అప్పటికే అక్కడ కొంత మంది కిల్లీలు కట్టించుకోడానికి నిలబడ్డారు. రంగస్వామి దోతరుపుగా లోపలికి వెళ్ళి "అబ్బీ..మంచికిల్లీ ఒకటి కట్టూ" కిల్లీబడ్డీ యజమానితో అన్నాడు. "మీకన్నా ముందొచ్చినోళ్ళు ఉన్నారు.వాళ్ళకి కిల్లీలు కట్టాక నీ కిల్లీ కడతాను" సమాధానమిచ్చాడు కిల్లీబడ్డి యజమాని. తనను పట్టించుకోలేదన్న కోపం రంగస్వామికి మొదలైంది.తన తెలివితేటలతో కిల్లీబడ్డి యజమానిని ఆటపట్టించాలనుకున్నాడు. "అబ్బీ...దవడ వాచిపోగలదు" గట్టిగా అన్నాడు. అప్పటికే అక్కడ ఉన్నవాళ్లు రంగస్వామి రౌడీయిజానికి అదిరిపడ్డారు. కిల్లీబడ్డీ యజమాని తక్కువ తినలేదు "పళ్ళురాలగలవు జాగ్రత్త!" రంగస్వామితో అన్నాడు. రంగస్వామి కంగుతిన్నాడు.
అక్కడ నిల్చున్నవారంతా తగువు తారాస్థాయికి చేరుకుంది అనుకున్నారు.
" ఏమిటా అసందర్భ ప్రేలాపన" అంటూ కిల్లీబడ్డీ యజమానిపై విరుచుకు పడ్డాడు రంగస్వామి.
" దవడ వాచిపోగలదు అని నువ్వు అంటే పళ్ళు రాలగలవని అన్నాను అంతే...తేలికగా అనేశాడు యజమాని.
"నువ్వు కడుతున్న కిల్లీ తమలపాకులకు సున్నం ఎక్కువ రాస్తున్నావు. కిల్లీకి సున్నం ఎక్కువైతే అది తినేవాడి దవడ వాచిపోవడం సామాన్యమైన విషయమే గా అందుకే దవడవాచిపోగలదు అన్నాను " తెలివిగా సమర్థించుకున్నాడు రంగస్వామి.
"వేలాడదీసే అరటిపళ్ళ గెలను పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. మగ్గినపళ్ళు అవి. ముట్టుకుంటే రాలిపోతాయనే పళ్ళు రాగలవు జాగ్రత్త అన్నాను" అంతే తెలివితో అన్నాడు యజమాని.
ఆ మాటలు విన్న అక్కడున్న వాళ్ళు నవ్వుకున్నారు. తాడి దన్నేవాడు ఒకడుంటే వాడి తల దన్నేవాడు మరొకడుంటాడన్న సత్యం బోధపడడంతో అప్పటినుండి అతితెలివి మాటలకు స్వస్తి పలికాడు రంగస్వామి.
బి.వి.పట్నాయక్






కామెంట్లు (0)