ఉత్తమ చిత్రం : అక్వీ (పోర్చ్‌గీస్) ఉత్తమ నటీనటులు : రిషబ్‌శెట్టి, మాయా ఓ రూర్క్
తొమ్మిది రోజులు పాటు జరిగిన 57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) శనివారం గోవాలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ముగిసింది.
సినిమా వివిధ సంస్కృతులను, ప్రజలను కలిపే శక్తివంతమైన మాధ్యమమని ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ పేర్కొన్నారు. సినిమాలు ప్రతిసారీ సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, కొన్నిసార్లు సమాజానికి అద్దం పట్టి, ప్రశ్నలను లేవనెత్తుతాయని ఆయన అన్నారు. టియాగో గ్వెడెస్ దర్శకత్వం వహించిన పోర్చుగీస్ చిత్రం ‘అక్వీ’ ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచు కుంది. రిషబ్ శెట్టి (కాంతార పార్ట్ 1), మాయా ఓ'రూర్క్ (ది మెల్ట్ డౌన్) ఉత్తమ నటీనటులుగా సిల్వర్ పీకాక్ అవార్డులను అందుకున్నారు.
‘విజిటేషన్’చిత్రానికి జర్మన్ దర్శకుడు వోల్కర్ ష్లాండార్ఫ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. బెరెంజర్ తువాన్ దర్శకత్వం వహించిన ‘ది గోల్డెన్ ఏజ్’ ఉత్తమ తొలి ఫీచర్ చిత్రంగా నిలిచింది. లోరెంజో ఫెర్రో, లూకాస్ ఏ. విగ్నాలే దర్శకత్వం వహించిన ‘ది రివర్ ట్రైన్’ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది.
డా. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘హనుమన్ అన్ష్’ ఉత్తమ తొలి భారతీయ ఫీచర్ చిత్ర దర్శకుడి అవార్డును గెలుచుకుంది. ‘మేడ్ ఇన్ ఇండియా : ది టైటాన్ స్టోరీ’ ఉత్తమ వెబ్ సిరీస్ (ఓటీటీ) అవార్డును గెలుచుకుంది. ‘రహ్మ’చిత్రానికి శాంతి, సహనం, సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహించే చిత్రాలకు అందించే ఐసిఎఫ్టీ- యునెస్కో గాంధీ మెడల్ లభించింది. సింగపూర్ దర్శకుడు ఆంథనీ చెన్ రూపొందించిన ‘వి ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’చిత్రాన్ని ఇఫీ ముగింపు చిత్రంగా ప్రదర్శించారు.






కామెంట్లు (0)