సిల్క్ స్మిత చిత్రసీమ చిదిమేసిన మందస్మిత

21 నిమిషాల క్రితం

Silk Smitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 6 నిమిషాల చదవడం

దక్షిణ భారత చలనచిత్ర రంగంలో పోస్టర్ మీద ఆమె కనిపిస్తే చాలు సీనీ థియేటర్ల టికెట్ కౌంటర్ల వద్ద యువ ప్రేక్షకులు కిక్కిరిసిపోయేవారు. చాలామంది దర్శక నిర్మాతలు ఆమె ఒక్క మూడు నిమిషాల పాట కోసం డేట్ ఇస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద డబ్బు సంచులను పోగేసుకోవచ్చని కలలుకనేవారు. సుమారు పదిహేనేండ్లు సినీ ప్రపంచంలో తనదైన శైలితో ప్రేక్షకులకు మనోరంజనం కలిగించిన ఆమె జీవితం విషాదాంతమైంది. ఆమె సిల్క్ స్మిత.


సిల్క్ స్మితది బాల్యం నుండి సంఘర్షణలు, ఎదురు దెబ్బలతో కూడిన జీవితం. మగమహారాజుల ఆధిపత్యంలోని సినీ పరిశ్రమలో ఆడవాళ్లు కేవలం పాటలకు, కథాగమనంలో వచ్చి పోయే పాత్రలకు, చివరాఖరకు ఏదో ఒక పాటలో ఐటమ్ గర్ల్‌గా కనిపించడానికో పరిమితం చేసిన రోజుల్లో పాకుడు రాళ్ల జారుడుమెట్ల నడుమ ఆమె ప్రతి కదలిక ఒక వేదనా భరితమైనది. అయితే రెండున్నర గంటలకు పాటు నడిచే సినిమాలో ఆమె మూడు నిమిషాల పాటనే అభినయించవచ్చు. కానీ, నిర్మాత కళ్ళలో ఆనందం ఆమె వల్లనే కనిపించేది. ఐనా సిల్క్ స్మితది ఒక విషాద గాధ. 1960 డిసెంబర్ 2న ఏలూరు సమీపంలోని కొవ్వలిలో శ్రీరామమూర్తి, నరసమ్మ దంపతులకు విజయలక్ష్మిగా జన్మించింది. ఆమె చిన్నతనం చాలా పేదరికంలో గడిచింది. ఆ పేదరికం వల్లే 4వ తరగతితోనే చదువు ఆగింది. ఆమె బాల్య వివాహం విఫలమైంది.


కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బంధువు అన్నపూర్ణమ్మ దత్తత తీసుకుంది. చిన్నతనం నుంచే సినిమాలపై అమితమైన పిచ్చి పెంచుకున్న విజయలక్ష్మి 18 ఏండ్ల వయసులో తన తల్లితో మద్రాస్ చేరుకుంది. హీరోయిన్‌గా రాణించాలనే కలతో ఎంతో మంది నిర్మాతలను కలిసినా ‘గ్లామర్ లేదు. నటిగా పనికిరాదు’ అని తిరస్కరించారు. అయితే నల్లగా, బొద్దుగా ఉండడం, ముద్దగా మాట్లాడటం ఆమె ప్రతికూలతలు. ఐనా ఆమె ఆశలు వదులుకోలేదు. ‘చావోరేవో మద్రాసులోనే’ నిశ్చయించుకుని, జూనియర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చి ‘విజయ’ పేరుతో కొన్ని చిన్న చిన్న పాత్రలు చేసింది. మొదట ఇళ్ళలో పని మనిషిగా, సినిమా సెట్లలో మేకప్ అసిస్టెంట్‌గా, టచ్-అప్ అమ్మాయిగా పని చేసింది. అప్పుడే డైరెక్టర్ విను చక్రవర్తి ఆమెలో ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్‌ను గుర్తించాడు. నటన, డాన్స్, నడక, మాట్లాడటంలో ట్రైనింగ్ ఇప్పించాడు. సరిగ్గా అదే సమయంలో మలయాళంలో ఒక అవకాశం వచ్చింది. శృంగారంతో కూడిన పాత్రకు తొలుత తటపటాయించినా విజయ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

1980లో తమిళ సినిమా ‘వండిచక్కరం’లో ఆమె వేసిన ‘సిల్క్’ పాత్రతో ఆమె నటనకు చాలా పెద్ద పేరు వచ్చింది. అప్పటి నుండి ఆమె పేరు ‘సిల్క్ స్మిత’ అయింది. ఇక తమిళ చిత్ర పరిశ్రమ దృష్టి ఆమెపై పడింది. వండిచక్కరంను తెలుగులో ఘరానా గంగులు పేరుతో రీమేక్ చేసినప్పుడు కూడా స్మితనే ఆ పాత్రను పోషించింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. 18 ఏండ్ల కెరీర్‌లో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠి భాషల్లో 450 పైగా సినిమాల్లో నటించింది. ఆ రోజుల్లో ఆమె ఒక్క పాటకు 50 వేల నుండి లక్ష వరకు తీసుకునేది. ఒక సినిమా ఆగిపోతే సిల్క్ స్మిత పాట జత చేస్తే చాలు ఆ సినిమా హిట్. అంతే! నిర్మాతలు ఆమె డేట్ల కోసం ఎదురు చూసేవారు. తెలుగులో అగ్ర హీరోలు ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబుల సినిమాలలో జ్యోతిలక్ష్మి, జయమాలినీలు ఐటమ్ సాంగ్స్ చేస్తే కొత్త తరం హీరోలు కమల హాసన్, రజినీకాంత్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు వచ్చాక వారికి సిల్క్ స్మిత పాట ఒక కంపల్షన్‌గా మారిపోయింది.

అది మొదలు నిర్మాతలు స్మిత చుట్టూ తిరిగేవారు. ‘రెమ్యూనరేషన్ ఎంత’ అని అడగకుండా ‘కాల్ షీట్ ఎప్పుడు ఇస్తావు’ అని అడిగేవారు. 1981 నుంచి 1996 వరకు స్మిత కెరీర్ ఉజ్వలంగా సాగింది. తన డాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 1983లో తమిళంలో వచ్చిన నీతిపతి చిత్రానికి స్మిత పాట లేకపోవడం వల్ల బయర్లు కొనుగోలు చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత స్మితతో ఒక పాట చిత్రీకరించి విడుదల చేస్తే ఘన విజయం సాధించింది. అది ఆమె డిమాండ్. తన పాత్రలకు, పాటలకు అనుగుణంగా దుస్తులను తనే డిజైన్ చేసుకునేది. నృత్య తారగానే కాకుండా, లేడీ జేమ్స్ బాండ్ వంటి చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి, వీర విహారం, ప్రేమించి చూడు వంటి చిత్రాలను నిర్మించింది. తనను అత్యంత కష్టపడి పెంచి పెద్ద చేసిన తన తల్లి నరసమ్మకు సిల్క్ గొప్ప నటి అయ్యాక కిలో బంగారాన్ని బహుమతిగా ఇచ్చి సంతోష పెట్టింది. బావ బావమరిది చిత్రంలో స్మిత నటించిన ‘బావలు సయ్యా, మరదలు సయ్యా’ పాట ఆ సినిమా విజయానికి మూల కారణం.


కొందరు సినిమా విలేఖరులు, విమర్శకులు ఆమెను చౌకబారు నటిగా అభివర్ణించారు. ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, శృంగార దుస్తులతోను కనిపించింది. కానీ ఆమెకు ఎప్పుడూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు కావాలని కోరిక ఉండేది. కానీ ఇండస్ట్రీ ఆమెను గ్లామర్ పాత్రలకే పరిమితం చేసింది. అయితే ‘సీతాకోక చిలుక’ (1981), అలైగళ్ ఓయివతిల్లై వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రలలో ఆమె మెప్పించింది. ‘లయనం’ అనే సినిమా ఆమెకు చాలా పేరును తెచ్చింది. ‘రేష్మా కీ జవానీ’ అనే పేరుతో దీన్ని హిందీలో తీశారు. ‘వసంత కోకిల’ చిత్రంలో ఆమె పాత్ర విమర్శకుల మన్ననలు పొందింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ అప్పట్లో యువతను ఇట్టే ఆకర్షించేవి. దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఆమె టాప్ డాన్స్ స్టార్. సిల్క్ స్మిత అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు ఆమె కళ్ళలో ఒక ప్రత్యేకమైన తీక్షణత, అభినయం ఉండేవి. స్మిత భారతీయ చలనచిత్ర చరిత్రలో ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో ఒక సంచలనం. ఆమె మరణం ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో ఒక తీరని లోటుగా మిగిలిపోయింది. ఒక నటిగానే కాకుండా తనదైన శైలితో ఒక శకాన్ని శాసించిన ‘గ్లామర్ ఐకాన్’ స్మిత.


ఒకే ఒక స్మిత

ఆంటోనీ తన 1979 చిత్రం ‘ఇనాయే తేడి’ కోసం కొత్త ముఖాల కోసం వెతుకుతున్నాడు. ‘అప్పుడే ఒక స్నేహితుడు ఈ టచ్-అప్ అమ్మాయి గురించి నాకు చెప్పాడు. నేను ఆమె తన అత్తతో నివసించే ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆమె ఓణీ కట్టుకున్న 19 ఏండ్ల సాధారణ యువతి. ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని ఉంది’ అని ఆంటోనీ చెబుతాడు. ఆ ఫొటో షూట్ మేకప్ లేకుండా జరిగింది. ఆ రాత్రి తన హోటల్ మంచం మీద నలుపు-తెలుపు ప్రింట్లను ఆరబెట్టిన విషయం ఆంటోనీకి గుర్తుంది. ‘ఆమె కళ్ళు బాగున్నాయి, కానీ ఆమెను నటిగా తీసుకోవాలా వద్దా అని నేను నిర్ణయించుకోలేకపోయాను. నేను సెకండ్ షో సినిమాకు వెళ్లి మళ్ళీ ఆ ఫొటోలను చూశాను. మరుసటి రోజు నేను ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాను’ అంటారు ఆంటోనీ. స్మిత విజయబాల అనే పేరు పెట్టుకోవాలనుంది . కానీ ఆంటోనీ ఆమెను స్మిత పేరునే ఖరారు చేశాడు. ‘ఇనయే తేడి’ చిత్రంలో ఆమె ఒక లైంగిక కార్మికురాలి పాత్ర పోషించింది. ఆమె చివరికి తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత పక్షవాతానికి గురవుతుంది.

‘ఆమె మంచం మీద నుండి మేల్కొనే ఒక సన్నివేశం తప్ప సినిమాలో స్మితకు సంబంధించిన ఎలాంటి శృంగార సన్నివేశాలు లేవు. ఆమె ఒక రోజు తెరపై అత్యంత డిమాండ్ కలిగిన శృంగార తారగా మారుతుందని నేను అప్పుడు అస్సలు ఊహించలేదు’ అని ఆంటోనీ అంటాడు. ‘ఆమె డ్యాన్స్‌లో ఏ స్టెప్ వేయడానికైనా వెనుకాడేది కాదు. ఆమె వేసిన కొన్ని స్టెప్పులను వేరే ఏ నటి అయినా వేసి ఉంటే, అవి అసభ్యంగా కనిపించేవి. స్మిత వాటిని చేసినప్పుడు అవి శృంగారభరితంగా ఉండేవి’ అంటారు మోహన్‌ ‌రామన్‌. స్మిత ఒక డ్యాన్స్ చేసి దివాలా తీసిన చాలా మంది నిర్మాతలను ఆత్మహత్య అంచు నుండి కాపాడింది. కానీ ఆమె చివరి దశకు వచ్చేసరికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. స్మిత తర్వాత సినీ పరిశ్రమలో చాలా మంది ఆమెలా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఏ ఒక్కరూ మరో సిల్క్ స్మిత కాలేక పోయారు. సిల్క్ స్మిత ఉంటే డిసెంబర్ 3న తన 66వ జన్మదినం జరుపుకునేది.


ముగింపు విషాదం

సినిమా జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో ఆమె జీవితంలోకి డాక్టర్ రాధాకృష్ణ ప్రవేశించాడు. కెరీర్ పరంగా అండగా ఉంటానని నమ్మించి ఆమె వ్యవహారాలన్నీ చూసుకున్నాడు. అతన్ని నమ్మిన స్మిత డబ్బు లెక్కలు పట్టించుకోలేదు. 90లలో ఆమె కెరీర్ తగ్గిపోయింది. సుమారు 4 కోట్లు సినిమా నిర్మాణంలో పెట్టి నష్టపోయింది. నమ్మిన వాళ్ళే మోసం చేశారని చెప్తారు. ఒంటరితనం, డబ్బు కష్టాలు, ప్రేమలో మోసం ఆమెను చాలా బాధపెట్టాయి. 23 సెప్టెంబర్ 1996 న, 35 ఏండ్ల వయసులో చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దపెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిస్పృహలోకి నెట్టివేసింది. ఆమె మృతదేహం పక్కన దొరికిన సూసైడ్ నోట్‌లో ‘బాబు మంచివాడు. వేరెవరో తనను మోసం చేశారు. ఏడేండ్ల వయసు నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నేను నమ్మినవారు నన్ను మోసం చేశారు.


బాబు తప్ప నా మీద ఎవరూ ప్రేమ చూపించలేదు. అందరూ నా కష్టం తిన్నవారే, నా నాశనం కోరేవారే. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నా చుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేటట్లు చేశారు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలుసు” అని ఉంది. అయితే చిత్ర పరిశ్రమ నుంచి చాలామంది ఆమె చివరి చూపుకు కూడా రాలేదు. అయితే హీరో అర్జున్ మాత్రం వచ్చి ఆమె మృతదేహాన్ని చూసి ఏడ్చారు. కొద్ది రోజుల ముందు ‘నేను చనిపోతే వస్తావా’ అని తనని అడిగిన కారణంతో అర్జున్‌ వచ్చారు. 2011లో ఆమె జీవిత కథ ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం డర్టీ పిక్చర్ ఆమె జీవితం, పోరాటం, విషాదాంతం గురించి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. సినిమా రంగంలో కొందరి జీవిత గాథలు నమ్మశక్యం కానివిగా ఉంటాయి. అలాంటి కోవకు చెందినదే సిల్క్ స్మిత జీవితం.


హెచ్‌.రమేష్‌‌బాబు, 93916 34727

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్