జనారణ్యం మధ్యలో
ఒంటికాలిపై తపస్సులో ఉన్న ఋషిలా
విశాలమైన కొమ్మల చేతులతో
పచ్చని గుబురు ఆకులతో
ఎర్రటి ఎడారిలో చల్లని ఒయాసిస్సులా
ఓ నీడ!
కొండచిలువలా పాక్కుంటూ పోతోన్న
రోడ్డు విస్తరణ
అడ్డొచ్చిన పచ్చదనాన్ని అమాంతం మింగేస్తే
కింద చెరిగిపోయిన నీడ తాలూకూ జ్ఞాపకాలు
ఇంకా అక్కడే తచ్చాడుతున్నాయి!
ఎండలకు డస్సిన బాటసారుల్ని
నీడకొంగు కప్పి కూర్చోబెట్టి
చల్లని మాటలతో సేదతీరుస్తూ ఉండేది
చినుకు పడితే, ఎవరైనా సరే
ఆప్యాయంగా వెళ్ళి కొమ్మల గొడుగుపట్టి
గుమ్మంలోనికి పిల్చుకొచ్చేది
నేడు, గుండెల్ని తడిమే
ఆ నిండైన ఆదరణ మాయమైంది!
కింద కలకలం పైన కిలకిలం
నిత్యకళ్యాణం పచ్చతోరణంలా
వెలిగే పచ్చని ఆ జ్ఞాపకాలు
పచ్చిగాయాల్లా గుచ్చుకొంటుంటే
ఉపశమనంగా
ఆకుపచ్చని నీడ సామ్రాజ్యం
కూలిన చోటే మళ్ళీ
చిగురు జయకేతనం ఎగరేస్తోంది..!
భీమవరపు పురుషోత్తమ్, 9949800253
పచ్చని నీడ!
11 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)