Magazines

మన గురించి ఎప్పుడైనా ఆలోచించామా?

54 నిమిషాల క్రితం

Have we ever thought about ourselves?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 3 నిమిషాల చదవడం

ఒకరోజు ఇందిరా పార్క్‌లో నడుచుకుంటూ వెళుతున్నాను. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. నా నడకలో నేనున్నాను. ఇంతలో పక్కనుంచి కొన్ని మాటలు వినిపించాయి. నా నడక వేగం తగ్గిపోయింది. చెవులు ఆటోమేటిక్‌గా ఆ మాటల్లో మునిగిపోయాయి. ఎందుకంటే ఆ మాటల్లో అంత ఆసక్తి ఉంది మరి! “ఒరేయ్! మా ఊరిలో ఒకడున్నాడు రా.. వాడు ఏదైనా చేసేస్తాడు! రేపు ఊరికి కూడా మినిస్టర్ అయిపోతాడు రా!” అని ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి ఎంతో గొప్పగా చెబుతున్నాడు. ఆ మాటలు వింటున్నప్పుడు ఓ ఆలోచన వచ్చింది. ఇతరుల గురించి ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నాం కదా! మరి, “మీ గురించి మీరు కొన్ని గొప్ప విషయాలు చెప్పండి” అని అడిగితే మాత్రం చాలామంది ఎందుకు ఆలోచనలో పడిపోతారు?



సైకాలజీ పరంగా చూస్తే, దీనికి ఒక ముఖ్యమైన కారణం సెల్ఫ్ అవేర్‌నెస్ అంటే మనల్ని మనం తెలుసుకునే సామర్థ్యం. మనకు ఇతరుల గురించి మాట్లాడటం సులభం. ఎందుకంటే వారి ప్రవర్తన, మాటతీరు, విజయాలు మనకు బయట నుంచి కనిపిస్తాయి. కానీ మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు, బలాలు, బలహీనతలు, భయాలు, ఆశలు వంటి ఎన్నో విషయాలను పరిశీలించుకోవాలి. ఒక వ్యక్తి తన స్నేహితుడి గురించి “వాడు చాలా తెలివైనవాడు, ఏ పని ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు, భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్తాడు” అని గంటసేపు చెప్పగలడు. కానీ అదే వ్యక్తిని “మీరు ఏ విషయంలో ప్రత్యేకమైనవారు?” అని అడిగితే, “అబ్బే! నాలో అలాంటివేమీ లేవు” అంటాడు. నిజంగా అతనిలో ప్రతిభ లేదా? కాదు! తనలో ఉన్న ప్రతిభను గుర్తించే అలవాటు లేకపోవచ్చు. కొన్నిసార్లు మనకు మన లోపాలే పెద్దగా కనిపిస్తాయి, మన బలాలు మాత్రం చిన్నగా కనిపిస్తాయి. మరికొన్నిసార్లు మనం ఏం సాధించామో గుర్తుంచుకోకుండా, ఇంకా ఏం సాధించలేదో మాత్రమే ఆలోచిస్తుంటాం. అందుకే ఇతరుల విజయాలను పెద్దగా చూడగలిగిన మనసు, తన విజయాలను మాత్రం చిన్నచూపు చూడవచ్చు.

ఇక్కడ మరో మానసిక అంశం కూడా ఉంది. అదే సామాజిక పోలిక. మనిషికి తన స్థాయిని అంచనా వేసుకోవడానికి ఇతరులతో పోల్చుకునే అలవాటు ఉంటుంది. “వాడు బాగా సంపాదిస్తున్నాడు”, “ఆమెకు సమాజంలో మంచి పేరుంది”, “వాళ్లబ్బాయి గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు” అని ఇతరుల గురించి మనం చర్చిస్తుంటాం. కానీ ఈ పోలిక ఎప్పుడూ మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందా? కొన్నిసార్లు అది ఇతరులను పొగడటంతోనే ముగుస్తుంది.. మరికొన్నిసార్లు మనలో తక్కువతనాన్ని పెంచుతుంది. ఒక మహిళ తన స్నేహితురాలి గురించి “ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఎంతమందిని ఆకట్టుకుంటుంది!” అని మెచ్చుకుంటుంది. కానీ తాను కూడా ఎంతోమందికి మంచి సలహాలు ఇచ్చిన విషయాన్ని గుర్తించదు. అలాగే ఒక ఉద్యోగి తన సహోద్యోగి నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తాడు. కానీ తన బృందాన్ని కష్టకాలంలో ముందుకు నడిపించిన సందర్భాలను మాత్రం గుర్తు చేసుకోడు. అంటే మన దృష్టి ఇతరుల ప్రత్యేకతలను గుర్తించడంలోనే ఉండిపోతే, మన ప్రత్యేకతలను గుర్తించే అవకాశం తగ్గిపోవచ్చు.

ఇంకొంతమందిలో తమ గురించి గొప్పగా చెప్పుకోవడం అంటే అహంకారం అని చిన్నప్పటి నుంచి ఒక భావన ఉంటుంది. ఫలితంగా తమ విజయాలను చెప్పడానికి కూడా సంకోచిస్తారు. మరికొందరు విమర్శలకు భయపడి తమ అభిప్రాయాలను బయటపెట్టరు. అయితే, తన గురించి తాను చెప్పుకోలేకపోవడం అంటే తనలో ప్రతిభ లేదని కాదు.‌ కొన్నిసార్లు తనను తాను గుర్తించుకునే అవకాశం, అలవాటు లేదా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండవచ్చని అర్థం. అలాగే ఎదుటివారి గురించి ఎక్కువగా మాట్లాడే ప్రతి వ్యక్తికీ తన మీద ఆసక్తి లేదని కూడా అనుకోకూడదు. అది స్నేహం, ప్రశంస, సాధారణ సంభాషణలో భాగం కూడా కావచ్చు. అసలు విషయం ఏమిటంటే, ఇతరుల గురించి తెలుసుకోవడంతోపాటు మన గురించి మనం తెలుసుకోవడానికి కూడా సమయం కేటాయిస్తున్నామా లేదా అన్నది.

మరి దీనికి పరిష్కారం? మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రతిరోజూ కొద్దిసేపు కేటాయించాలి. “ఈరోజు నేను బాగా చేసిన పని ఏమిటి?”, “నాలో ఇతరులకు ఉపయోగపడే మంచి లక్షణం ఏది?”, “నేను ఏ విషయంలో మెరుగుపడాలి?”, “నాకు నిజంగా సంతోషాన్నిచ్చేది ఏమిటి?” అనే నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి. ఒక తల్లి తన పిల్లల కోసం ఎంతో శ్రమపడుతూ ఉంటుంది. కానీ తనను తాను గొప్పగా భావించదు. ఆమె తనకు తాను, “నేను నా కుటుంబానికి ప్రేమను, భద్రతను అందిస్తున్నాను. ఇది కూడా ఒక గొప్ప సామర్థ్యమే” అని గుర్తుచేసుకోవాలి.

ఇందిరా పార్క్‌లో నేను విన్న ఆ మాటలు ఒక చిన్న ప్రశ్నను నా మనసులో వదిలాయి. “మా ఊరిలో ఒకడున్నాడు రా.. వాడు ఏదైనా చేసేస్తాడు!” అని మరొకరి భవిష్యత్తును ఎంతో నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. మరి, ఒక్కసారి మనల్ని మనం అడుగు దాం..“నా జీవితంలో నేను ఏం చేయగలను? నాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? నా భవిష్యత్తు కోసం నేను ఏ అడుగు వేయగలను?” ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలుపెట్టిన రోజే మన ఎదుగుదలకు కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇతరులను అభినందించండి, వారి విజయాలను చూసి ఆనందించండి, వారి ప్రతిభను గుర్తించండి. అదే సమయంలో మీలోని మంచిని కూడా గుర్తించండి. ఎందుకంటే ఇతరుల జీవితాలను అర్థం చేసుకోవడం ఒక మంచి లక్షణం అయితే, మన జీవితాన్ని మనం అర్థం చేసుకోవడం ఒక గొప్ప జీవన నైపుణ్యం. ఇతరుల గురించి తెలుసుకోవడానికి మనకు ఆసక్తి ఉంది. మరి మన గురించి తెలుసుకోవడానికి మనకు ఆసక్తి ఉందా? ఈ ఒక్క ప్రశ్నను మనసులో వేసుకుంటే, మనల్ని మనం కొత్తగా చూసుకోవడం మొదలుపెడతాం.

డా.హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్