ఒక పోస్ట్ కార్డ్‌లో ఒక తల్లి తన కొడుకును పలకరించింది.. ఒక ఇన్ ల్యాండ్ లెటర్ లో ఒక తండ్రి తన కూతురి క్షేమం అడిగాడు.. కొడుకు పంపిన ఒక మనీ ఆర్డర్‌తో ఒక కుటుంబం నెల ఖర్చు గడిచింది.. దేశ సరిహద్దుల్లో ఉన్న ఒక సైనికుడి ఉత్తరం కోసం ఒక కుటుంబం ఎన్నో రోజులుగా ఎదురుచూసింది.. ఒక అప్పాయింట్మెంట్ ఆర్డర్ లెటర్ ఒక యువకుడి జీవితాన్ని మార్చింది.. ఒక పెళ్లి శుభలేఖ రెండు కుటుంబాలను కలిపింది.. చావు వార్తను మోసుకొచ్చిన టెలిగ్రామ్.. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.. డిజిటల్ సందేశం ద్వారా సమాచారం క్షణాల్లో రావచ్చు.. ఉత్తరం మాత్రం ఒక అనుభూతి.. ఒక మధుర స్మృతి అటువంటి తపాలా వ్యవస్థ గురించి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం... (‘అక్టోబర్ 9, ప్రపంచ తపాలా దినోత్సవం’, 10 జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా...)
భారతదేశంలో సమాచారాన్ని దూతల ద్వారా పంపే సాంప్రదాయం చాలా ప్రాచీనమైనది. అల్లావుద్దీన్ ఖిల్జి కాలంలోనే కాలినడక, గుర్రపుస్వారీ దూతల వ్యవస్థ ఉన్నట్లు ఇండియా పోస్ట్ చరిత్ర చెబుతోంది. షేర్ షా సూరి కాలంలో బెంగాల్ నుంచి సింద్ వరకు సుమారు 2000 మైళ్ళ మార్గంలో గుర్రపు డాక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1774లో కలకత్తా ప్రెసిడెన్సీ పోస్ట్ ఆఫీస్ ఏర్పడింది. 1786లో మద్రాస్ ప్రెసిడెన్సీ, 1793లో బొంబాయి ప్రెసిడెన్సీ పోస్ట్ ఆఫీస్‌లు ఏర్పడ్డాయి. 1854 అక్టోబర్ 1న ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దేశావ్యాపితంగా 700 పోస్ట్ ఆఫీసులతో భారత తపాలా వ్యవస్థ ఏర్పడింది. తారీఖులు, దస్తావేజులు.. ఇవి కావోయ్ చరిత్రకర్ధం అన్నట్లు.. తపాలా వ్యవస్థ చరిత్రను కేవలం చట్టాలు, పోస్టాఫీసులు, స్థాంపులు, ఉత్తరాలతో కొలిస్తే దాని అసలు కథ కనిపించదు.
ఎండనక వాననక
1854లో పోస్టల్ యాక్ట్ ద్వారా దేశ వ్యాపితంగా వ్యవస్తీకృత తపాలా వ్యవస్థ ఏర్పడింది. ‘నదీ నదాలూ, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి’ అన్నట్లుగా.. అడవుల్లో కాలినడకన, కొండ ప్రాంతాల్లో కంచరగాడిదలు, గుర్రాలు, ఎడారుల్లో ఒంటెలు, నదుల్లో పడవలపై ఎండనక వాననక నిరంతరం మెయిల్ బ్యాగ్‌ల రవాణా, ఉత్తరాల బాట్వాడా నాటి నుంచి నేటి వరకు జరుగుతూనే ఉంది. 1854లోనే రైల్ మెయిల్ సర్వీస్ ఏర్పాటయింది. దేశవ్యాపితంగా రైల్వే లైన్ ఉన్న ప్రాంతాల మధ్య మెయిల్స్ రవాణా కోసం ఏర్పాటు చేయబడింది. అంతే కాకుండా ఆర్ఎంఎస్ బోగీల్లో ఉత్తరాల సార్టింగ్ కూడా జరిగేది. ఆర్ఎంఎస్ ఆఫీసుల్లో కూడా సార్టింగ్ జరుగుతుంది.
వేగంగా చేరేలా...
1984లో ఆర్ఎంఎస్ బోగీల్లో సార్టింగ్ సెక్షన్స్ రద్దు చేశారు. ఇప్పుడు ఆర్ఎంఎస్ బోగిల్లో మెయిల్ బాగ్స్ రవాణా మాత్రమే జరుగుతుంది. సార్టింగ్ కేవలం ఆర్ఎంఎస్ ఆఫీసుల్లోనే జరుగుతుంది. ఆర్ఎంఎస్ బోగీల్లో సార్టింగ్ జరిగే కాలంలో ఉత్తరాలు, పార్శిళ్లు వేగంగా చిరునామాకు చేరేవి. ఉదాహరణకు నాంపల్లిలో గోదావరి ఎక్స్ ప్రెస్ ఆర్ఎంఎస్ బోగీలో ఉత్తరంగానీ పార్సిల్గానీ ఇస్తే మరునాడు ఉదయం వైజాగ్‌లో డెలివరీ అయ్యేది. ఇప్పుడు ఆర్ఎంఎస్ బోగీలో సార్టింగ్ సెక్షన్స్ రద్దు చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి వైజాగ్ ఉత్తరం/పార్సిల్ చేరడానికి 3-4 రోజులు పడుతుంది. అప్పుడే రంగంలోకి దిగిన ప్రైవేట్ కొరియర్స్ లబ్దికోసమే రైల్ బోగీల్లో సార్టింగ్ సెక్షన్స్ రద్దు చేశారనే వాదన కూడా ఉంది. 1876లో ఎన్వలప్స్, 1882లో పోస్ట్ కార్డ్, మనీఆర్డర్, పోస్టల్ ఆర్డర్ ప్రవేశపెట్టబడ్డాయి. సుమారు 15 ఏండ్ల కిందట వరకు ప్రజలు కమ్యూనికేషన్ కొరకు ఉత్తరాల మీదే ఆదారపడ్డారు. ప్రభుత్వాలు సామాజిక బాధ్యతగా కార్డ్, ఎన్వలప్, ఇన్ ల్యాండ్ లెటర్స్‌పై ప్రభుత్వాలు సబ్సిడీపై కార్డ్ 15 పైసలకు అమ్మేది. చాలా సర్వీసుల మీద సబ్సిడీ ఇచ్చేది. కానీ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వాలు తపాలా శాఖకు తిరిగి చెల్లించకపోవడంతో తపాలా శాఖ నష్టాల్లోకి కూరుకుపోయింది.
సేవింగ్స్ బ్యాంక్
1884లో పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ప్రారంభించబడింది. దేశంలో మారుమూల గ్రామాల్లో ప్రజలకు సైతం పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ సేవలు అందుబాటు లోకి వచ్చాయి. సుమారు 25 ఏండ్ల కిందటి వరకు సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలకు ప్రభుత్వరంగ బ్యాంకులు చేరలేదు. నేటికీ అనేక గ్రామాలు బ్యాంకులకు దూరంగానే ఉన్నాయి. గత 142 ఏండ్లుగా మహానగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ తన సేవలను అందిస్తోంది. చిన్న మొత్తాల పొదుపు ద్వారా గ్రామీణ ప్రజల్లో పొదుపును అలవాటు చేసింది. నేటికీ కూడా 10 రూపాయలతో ఆర్.డి అకౌంట్ 100 రూపాయలతో టి.డి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇంకా మంత్లీ ఇన్కమ్ స్కీం, కేవీపి, ఎన్ఎస్సీ, ఎస్ఎస్వై, పిపిఎఫ్ లాంటి ఎన్నో స్కీంలు ఉన్నాయి.
డిపాజిట్స్‌తో అగ్రభాగాన
1850లో కలకత్తా నగరంలో మొదటి టెలిగ్రామ్ లైన్ ఏర్పాటు చేశారు. 1854లో టెలిగ్రామ్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటి సారిగా 1854 ఏప్రిల్ 27న ముంబై నుంచి పూనేకు మొదటి టెలిగ్రామ్ పంపారు. సామాజిక బాధ్యతతో డెత్ మెసేజ్ టెలిగ్రామ్‌లకు ఆర్డినరీ టెలిగ్రామ్ చార్జీలు వసూలు చేసి, xx కేటగిరిలో బుకింగ్, ట్రాన్స్ మిషన్, డెలివరీలో అత్యంత ప్రాధాన్యత (టాప్ ప్రయారిటీఒక పోస్ట్ కార్డ్‌లో ఒక తల్లి తన కొడుకును పలకరించింది.. ఒక ఇన్ ల్యాండ్ లెటర్ లో ఒక తండ్రి తన కూతురి క్షేమం అడిగాడు.. కొడుకు పంపిన ఒక మనీ ఆర్డర్‌తో ఒక ) ఇచ్చేవారు. సబ్ పోస్టాఫీస్‌లకు క్వార్టర్స్ కూడా ఆటాచ్ అయిఉండేవి. 24 గంటల్లో ఎప్పుడైనా టెలిగ్రామ్ బుకింగ్, ట్రాన్సమిషన్, డెలివరీ చేసేవారు. నగరాల్లో టెలిగ్రాఫ్ ఆఫీస్లు, పోస్ట్ ఆఫీసుల్లో టెలిగ్రామ్ కౌంటర్లు 24 గంటలు పనిచేసేవి. అటువంటి టెలిగ్రామ్, సాంకేతికంగా వచ్చిన మార్పులు కారణంగా.. వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ వంటి వాటితో 131 ఏండ్ల పాటు సమాచార సేవలు అందించిన టెలిగ్రామ్ తన ఉనికిని కోల్పోయింది. 2013 జూలై 15న టెలిగ్రామ్ రద్దు అయింది. 131 ఏండ్ల టెలిగ్రామ్ చరిత్రకు తెరపడింది.
టెలిఫోన్ వ్యవస్థ
1882 జనవరి 28న టెలిఫోన్ వ్యవస్థ ఏర్పడింది. 1914 ఏప్రిల్ 1న టెలిఫోన్ వ్యవస్థ, పోస్టల్ వ్యవస్థ కలసి పి&టీ డిపార్ట్మెంట్‌గా ఏర్పడింది. నగరాల్లోనూ, పట్టణాలోనూ ప్రధాన తపాలా కార్యాలయాలు, టెలిఫోన్ ఎక్స్చేంజ్‌లు ఒకే కాంపౌండ్‌లో ఉంటాయి. ఇప్పటికి నగరాల్లో, పట్టణాల్లో పి&టీ కాలనీలు మనకు కనపడతాయి. సెమీ అర్బన్, గ్రామాల్లో టెలిఫోన్ కాల్ బుకింగ్స్, టెలిగ్రామ్ బుకింగ్స్ చేసేది తపాలా కార్యాలయాలే. పని స్వభావంరీత్యా బట్టలో దారపుపోగుల్లా కలసి పోయాయి. అటువంటి పి&టీని 1985 జనవరి 1న పీ మరియు టీ గా విడగొట్టేశారు. ప్రధాని వాజపేయి పాలనలో 2000 అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వశాఖగా ఉన్న టెలిఫోన్ వ్యవస్థను బీఎస్ఎన్ఎల్ (కార్పొరేషన్)గా మార్చేశారు. ప్రైవేట్ టెలిఫోన్/ఆపరేటర్లకు స్వాగతం పలికారు. మొబైల్ ఫోన్ రంగంలోకి 15 ఏండ్లు బీఎస్ఎన్ఎల్ అడుగు పెట్టకూడదని షరతు విధించారు. బీఎస్ఎన్ఎల్ టవర్స్, కేబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకొని ప్రైవేట్ టెలిఫోన్/మొబైల్ ఆపరేటర్లు బలపడ్డారు, విస్తరించారు. నిన్న మొన్నటి వరకు బీఎస్ఎన్ఎల్ ను 2G కే ప్రభుత్వం పరిమితం చేసింది. నిజంగా చెప్పాలంటే నేడు బీఎస్ఎన్ఎల్ అంపశయ్య (వెంటిలేటర్)పై ఉంది
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్
1935లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్ఐ) ప్రారభమయింది. గత 15-20 ఏండ్ల కిందటి వరకు పీఎల్ఐకు ఏజెంట్స్ కానీ, కమిషన్ గానీ ఉండేది కాదు. తపాలా సిబ్బంది తమ విధుల్లో భాగంగా పీఎల్ఐ బిజినెస్ చేసేవారు. ఇప్పుడు ఏజెంట్స్, కమీషన్ లాంటి మార్పులు రావడంతో పీఎల్ఐ బిజినెస్ బాగా పెరిగింది. దేశంలో అర్హులైన వారిలో 22% మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్‌లో ఉన్నారనే మల్హోత్రా నివేదిక చూసి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని మహిళల కోసం రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్పీఎల్ఐ) 1995 మార్చ్ 24న ఏర్పాటైంది. పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ లలో మొత్తం 2,81,38,819 పాలసీలు యాక్టీవ్‌గా ఉన్నాయి.
మార్పులకు అనుగుణంగా...
మారుతున్న కాలం, వస్తున్న సాంకేతిక మార్పులు, ఐటి విప్లవాలకు అనుగుణంగా తపాలా వ్యవస్థ తనను తాను మలుచుకొంది. 1994లో స్పీడ్ పోస్ట్ ప్రవేశపెట్టింది. ఎక్సప్రెస్ పార్సెల్ సర్వీస్, ఇంటర్నేషనల్ పార్సెల్ సర్వీస్ ఈ పేమెంట్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఏటీఎం కార్డ్, డిజిటల్ చెల్లింపులు, కొన్ని రాష్ట్రాల్లో ఉపాధిహామీ వేతనాల చెల్లింపులు, వృద్ధాప్య పెన్షన్ చెల్లింపులు వంటి సేవలను తపాలా శాఖ అందిస్తోంది. అంతే కాకుండా ఆధార్ నమోదు/అప్ డేట్, పాస్ పోర్ట్ సేవ, బిల్ కలెక్షన్ ప్రభుత్వఫారాల విక్రయం, ఫిలటెలీ, పాసెంజర్ రిజర్వేషన్ వంటి పౌర సేవలను కూడా తపాలా శాఖ అందిస్తోంది. ప్రాజెక్ట్ యారో (PROJECT ARROW) పేరుతో తపాలా శాఖ ఆధునీకరించబడింది. అంతా ఆన్ లైన్ చేయబడింది. మనకు హైదరాబాద్‌లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఢిల్లీ పోస్ట్ ఆఫీస్‌లో విత్ డ్రా/డిపాజిట్ చేసుకోవచ్చు. మనం స్పీడ్ పోస్ట్ బుక్ చేస్తే దాన్ని ట్రాక్ చేసి ఎక్కడ ఉందో ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలుసుకోవచ్చు.
ప్రయివేటీకరణ వైపుగా...
సుమారు 250 ఏండ్లుగా మహానగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు, కొండల్లో, కొనల్లో, ఎడారుల్లో సైతం సేవలందిస్తున్న తపాలా వ్యవస్థ ఉనికి ఈ రోజు ప్రమాదంలో పడింది. 1854 పోస్టల్ యాక్ట్ స్థానంలో 2023 పోస్టల్ యాక్ట్ వచ్చింది. ఇది 2024 జూన్18 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం వల్ల కొన్ని సేవలు తపాలా శాఖే చేయాలనే నిబంధన తొలగించబడింది. దీని కారణంగా తపాలా శాఖ చేసే పనులు ఎవరైనా చేయవచ్చు. అంతే కాదు తపాలా శాఖ చేసే పనులను అవుట్ సోర్సింగ్స్‌కు ఇవ్వవచ్చు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) విధానం ప్రవేశపెట్టవచ్చు, ఫ్రాంచైజీ ఇవ్వవచ్చు, కొన్ని పనులు కాంట్రాక్టుకు ఇవ్వవచ్చు. పోస్టల్ యాక్ట్ 2023 అంటే ప్రయివేటికరణకు, కార్పొరేటీకరణకు బాటలు వేయడమే. పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ఒక కార్పొరేషన్ గాను, పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ మరో కార్పొరేషన్ గాను, మిగతా పోస్టల్ ఆపరేషన్స్ ఇంకొక కార్పొరేషన్‌గాను చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. తపాలా వ్యవస్థను ఏ రూపంలో ప్రయివేటికరించినా, కార్పొరేటీకరించినా.. లాభాలు తెచ్చిపెట్టే మహానగరాలు, నగరాలు, పట్టణాల్లో ప్రయివెట్ వ్యక్తులు రంగంలోకి వస్తారు. ఆదాయం తక్కువ వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలు అందించేందుకు ప్రయివేటు వ్యక్తులు ముందుకురారు. అందు వల్ల 65%గా ఉన్న గ్రామీణ ప్రజలు తపాలా సేవలకు దూరమవుతారు. అంతే కాకుండా తపాలా సేవల ధరలు కూడా పెరుగుతాయి.
బ్రిటిష్‌కు వ్యతిరేకంగా...
ప్రజల మద్దతుతో తపాలా కార్మికులు తపాలాశాఖ ఉనికికి ప్రమాదం కలిగించే విధానాలను తిప్పి కొట్టగలరనే విశ్వాసం ఉంది. ఎందుకంటే భారత కార్మికోద్యమ చరిత్రలో తపాలా కార్మికులకు కొన్ని పుటలు కేటాయించబడ్డాయి. 1946లో బాంబేలో రాయల్ ఇండియన్ నేవీ సిబ్బంది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినపుడు, వారికి మద్దతుగా బాంబే తపాలా కార్మికులు సమ్మె చేశారు. ఆరోజు తపాలా కార్మికులు తమ ఆర్ధిక ప్రయోజనాలకోసం సమ్మె చేయలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నావికులకు సంఘీభావం తెలుపుతూ సమ్మె చేశారు. ఆ సమ్మె ప్రభుత్వ ఉద్యోగులు చేసిన రాజకీయ సమ్మెగా చరిత్రలో నమోదైంది. బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ తపాలా ఉద్యోగులు 1920లో సమ్మె నోటీసు ఇచ్చారు, ఒప్పందం కుదరడంతో సమ్మె విరమించారు. 1946 జూలై 11న పోస్టమేన్లు టెలిగ్రాఫ్ సిబ్బంది 1.5లక్షల మంది పీ&టీ ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ సమ్మె ఆర్ధిక, సర్వీస్‌కు సంబంధించి డిమాండ్స్‌పై జరిగినా. దీని ప్రభావం జాతీయోద్యమంపై పడింది.
ప్రధానంగా పాల్గొన్న రెండు సమ్మెలు
1960లో నీడ్ బేస్డ్ మినిమమ్ వేజ్ డిమాండ్‌పై జరిగిన 5 రోజుల సమ్మెలో దేశం స్తంభించిపోయింది. ఈ సమ్మె సందర్భంగా 20,139 అరెస్ట్ కాబడ్డారు, 1840 మందికి శిక్షలు పడ్డాయి. 25000మంది ఉద్యోగులు సస్పెన్షన్స్, టెర్మినేషన్స్‌కు గురయ్యారు. ఈ సమ్మెలో కీలకపాత్ర పోషించింది, శిక్షలకు, కక్ష సాధింపు చర్యలకు గురైన వారిలో పీ&టీ కార్మికులు గణనీయంగా ఉన్నారు. 1968లో ఒక రోజు చారిత్రాత్మక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెలో పీ&టీ కార్మికులు కీలక పాత్ర పోషించారు. ఆ సమ్మె కారణంగా 64,000 ఉద్యోగులకు టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. కొంత మందిని ఉద్యోగాల్లోంచి తొలగించారు. 40,000 మంది ఉద్యోగులు అరెస్టులకు, సస్పెన్షన్స్‌కు గురయ్యారు. పోలీస్ కాల్పుల్లో 17 మంది చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమ్మెలో కీలకపాత్ర పోషించడమే కాదు కక్షసాధింపుకు గురైన వారిలో పి&టీ కార్మికులు ప్రముఖంగా ఉన్నారు. 1974 రైల్వే సమ్మెకు మద్దతుగా తపాలాశాఖలోని పీ3, పీ4, ఆర్3 సంఘాలు మద్దతుగా సమ్మె చేశారు.
క్రియాశీలక పాత్ర
1968 సమ్మె తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక రకమైన స్థబ్దత ఏర్పడింది. దాన్ని బద్దలు కొడుతూ, NFPTE లో సభ్య సంఘాలు కలసి రాకపోయినప్పటికి పి4 సంఘం ఒంటరిగా ఆది నారాయణ నాయకత్వంలో కేవలం ఈడి ఉద్యోగుల డిమాండ్స్‌పై 1984 సెప్టెంబర్ 19న ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. ఇది జయప్రదమయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 16 ఏండ్ల తర్వాత ఒక యూనియన్ ఇచ్చిన సమ్మె జయప్రదం కావడంతో దేశ వ్యాపితంగా చర్చనీయాంశమైంది. ఈ సమ్మె స్ఫూర్తితో 1989 మేలో తపాలా ఉద్యోగులు ఐక్యంగా ఈడి సమస్యలపై సమ్మె చేశారు. 1993లో మూడు రోజుల సమ్మె, 1998లో 8రోజుల సమ్మె, 2000లో 14రోజుల సమ్మె, 2018లో ఈడి ఉద్యోగుల సమ్మె సంస్థాగత సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర తపాలా కార్మికులకు ఉంది. సంస్థాగత సమస్యలపైనే కాకుండా కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మికసంఘాలు 1991 నుంచి నేటి వరకు జరిగిన ప్రతీ జనరల్ సమ్మెలో భాగస్వామ్యులు కావడమే కాకుండా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి చైతన్యవంతమైన కార్మికవర్గం ప్రజామద్దతుతో తపాలా వ్యవస్థపై ప్రయివేటీకరణదాడిని తిప్పికొట్టగలదు.
సామాజిక బాధ్యతతో..
31 మార్చి 2025 నాటికి ఇండియా పోస్ట్‌లో 1,64,999 పోస్టాఫీసులున్నాయి. వాటిలో 1,49,385 గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. 15,614 పోస్టాఫీసులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటన్నిటినీ కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భారత తపాలా వ్యవస్థ, అసలైన చరిత్ర 1774లో ప్రారంభమైన పోస్టాఫీసుల చరిత్ర మాత్రమే కాదు.. తరతరాలుగా భారతీయుల మధ్య దురాన్ని తగ్గించిన చరిత్ర కూడా. తపాలా శాఖను లాభనస్టాల కోణంలో కాకుండా సార్వత్రిక ప్రజాసేవ, గ్రామీణ అనుసంధానం, ఆర్ధికచేరిక, జాతీయ మౌలిక వసతులు, సామాజిక బాధ్యత అనే కోణంలో చూడాలి. ప్రయివేటికరణ జరిగితే ఈ ప్రజాసేవలక్షణాలు బలహీనపడే అంశంపై విస్తృత చర్చ జరగాలి.
కె.ఎస్.ఎన్. మూర్తి, 9177942384







కామెంట్‌లు (0)