రచయిత్రి పోరెడ్డి మృదుల వివిధ సందర్భాలలో రాసిన 32 వ్యాసాలను ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకం కేవలం సాహిత్య వ్యాసాల పరిశోధన కాదు, తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలైన యక్షగానం పుట్టుక వికాసం, నేడు తెలంగాణలో యక్షగాన విద్యలో ప్రసిద్ధులైన వారి గురించి, జానపదం ఆనవాళ్ల గురించి పేర్కొన్నారు. లోక హితాన్ని, లౌక్యాన్ని నేర్పించడానికి నేటికీ శతకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో ముఖ్యంగా నేటి సమాజంలో ఓటు విలువను తెలియజేయడానికి ‘ఏడు కోలాల బాయి ఎన్నికల శతకం’పై లోతైన పరిశోధన చేసారు. కవి ఏనుగు నరసింహారెడ్డి రచించిన ఈ శతకంలో 101 పద్యాలు ఉండి ఐదేళ్లకోసారి ఉపయోగించే ఓటును బాధ్యతగా వేయాలనే హితవును అమాయకులకు, నిరక్షరాస్యులకు, అక్షరాస్యులకు సైతం వ్యంగ్యంగా, చమత్కారంగా, సూటిగా, అర్థమయ్యేలా కొనసాగిన పద్యాల గురించి చక్కని పరిశోధన చేశారు. ‘దాశరధి కృష్ణమాచార్యులు’ రచించిన ‘ఆలోచనాలోచనాలు’కవితా సంపుటిలోని ఆకలిని చీకటి ప్రతీకగా తీసుకొని నాటి తెలంగాణ ప్రాంత తొమ్మిది జిల్లాల సామాజిక ఆర్థిక వ్యవస్థ తీరును దాశరధి భావనార్థాన్ని చెక్కుచెదరకుండా లోతైన పరిశీలనతో గ్రంథస్తం చేయడం విశేషం. కవి నందిని సిద్ధారెడ్డి ‘ప్రాణహిత’ కవితా సంపుటిలోని 30 కవితల ద్వారా1991- 1993 మధ్య రైతుల వేదన, రైతుల స్వాభిమానం, కనీస జీవన విలువలు, మానవీయ స్పందనలు, రెండు నాలుకల రాజకీయ ధోరణి, తెలంగాణ ఉద్యమం, ఉపాధ్యాయుల వలసలను, ఎన్నికల విధానాలను, పోలీసుల గస్తీలను, రియల్ ఎస్టేట్ తీరుతెన్నులను, చివరకు దేవుని నిర్లక్ష్యాన్ని సైతం ఎత్తి చూపిన కవిత్వంగా, ప్రపంచానికి తెలంగాణ విలువను చాటి చెప్పిన కవిగా నందిని సిధారెడ్డి రచనలను, వారి మూర్తిమత్వాన్ని చాటి చెప్పారు.
‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ విశ్లేషణా గ్రంధాన్ని వ్యాసరచనకు ఎంచుకొని సురవరం ప్రతాపరెడ్డి పరిశోధనా పఠిమను, కృషిని నేటి తరం వారికి విషదపరచారు. మృదుల శైలి సరళమైనది, ఆధారాలతో కూడినది. కొన్ని వ్యాసాల చివరన ఆధార గ్రంథాలను పేర్కొనడం పరిశోధక విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. తెలంగాణ పదాలు కూడా వాడటం వల్ల ప్రాంతీయ సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఒకే పుస్తకంలో యక్షగానం నుండి యద్దనపూడి వరకు, బోయి భీమన్న నుండి నందిని సిధారెడ్డి వరకు విస్తరించడం వల్ల ఇది తెలుగు సాహిత్య చరిత్రకు ఒక చిన్న నమూనా లాంటిది. బిరుదురాజు రామరాజు జానపద గేయాలకు తొలిసారిగా శాస్త్రీయ దృక్పథాన్ని అందించడంలో ప్రధాన అంశాన్ని వివరించారు. ఈ పరిశోధనా వ్యాసం తెలంగాణ జానపద సాహిత్యానికి పునాది వేసిన వ్యక్తిగా ఆయనను నిలబెడుతుంది. అట్లాగే పద్మభూషణ్ డా. బోయి భీమన్న ‘రాగవైశాఖి’ విశ్లేషణ ఈ పుస్తకంలో ప్రత్యేక ఆకర్షణ.
డా. కపిలవాయి లింగమూర్తి ‘నాగవంశ చరిత్ర’, ‘దుందుభీ నది’ వ్యాసాల ద్వారా చారిత్రక పరిశోధనా దృష్టిని చూపారు. యద్దనపూడి సులోచనారాణి గురించి ప్రస్తావిస్తూ, ఆమె నవలలలోని స్త్రీ పాత్రలు, కుటుంబ వ్యవస్థపై చేసిన విశ్లేషణ బాగుంది. ఆధునిక తెలుగు కథా సాహిత్యంలోని రెండు భిన్న ధోరణులను - ఒకటి గ్రామీణ, రెండోది పట్టణ మధ్యతరగతి స్త్రీ జీవితం గురించి చక్కగా విశ్లేషించారు.
ఓల్గా రచించిన ‘స్వేచ్ఛ’ నవలలోని స్త్రీవాదం, అస్తిత్వవాద పరిశీలన, విముక్త కథల్లోని - ‘సమాగమం’ కథలో దాగిన శూర్పణఖ అంత:సౌందర్యం పరిశీలనతో పాటు, భారతీయ మహిళ - నాటి నుండి నేటి వరకు, ‘నిజ జీవిత కథలు’, డా: కొండపల్లి నీహారిణి ‘రాచిప్ప కథలు’ వ్యాసాలలో మృదుల స్ర్తీల పక్షమని స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాస మహాభారతం, అద్దంకి గంగాధరుని తపతీ సంవరణోపాఖ్యానాల ఆధారంగా ‘భారతీయ జీవన విధానం’ లో దీపస్తుతి, సూర్య నమస్కారాల ప్రాముఖ్యత విశ్లేషణ బాగుంది. తెలుగు సినిమాల్లో భార్యాభర్తల ప్రణయ గీతాలలో ఉటంకించిన పాటలు రొమాంటిక్గా ఉన్నాయి. స్త్రీ పురుషుల మధ్య అజరామరమైన ప్రేమానురాగాలు ఉండాలన్నదే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం. మృదుల గొప్ప ప్రేమమయి అని చెప్పడానికి ఇలాంటివి నిదర్శనాలు.
డా. సి. నారాయణ రెడ్డి ‘పాఠం పాటైతే’. కే. శివారెడ్డి ‘కవితా పిపాసి’ లాంటి వ్యాసాలు, కూరెళ్ల విఠలాచార్య జీవనప్రస్థానం - సాహితీ సంస్థల స్థాపనం, కాళోజీ నారాయణరావు తెలంగాణ సంకల్పం, కొలకలూరి ఇనాక్ ‘కాకి’ కథ ఆలోచింపచేసే పరిశోధనాత్మక వ్యాసాలుగా విపులీకరించారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ‘నెమలి కన్నులు ఆత్మకథ’ను పరిశోధించడంతో తెలుగు ప్రక్రియలలో దాదాపు అన్ని ప్రక్రియలను స్పృశించిన పరిశోధనా వ్యాసాలు ఈ సాహితీ పగడాలు. మొత్తంగా ఇది తెలుగు సాహిత్య పరిశోధకులకు, విద్యార్థులకు దిక్సూచి లాంటి గ్రంథం. తెలంగాణ విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలలో రిఫరెన్స్ పుస్తకంగా ఉంచదగినదని భావిస్తూ... ఇలాంటి పరిశోధనా దృక్పధంతో తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని పోరెడ్డి (సిరికొండ) మృదులకి శుభాకాంక్షలు.
ప్రొ. కె. కృష్ణమూర్తి, 8500167845






కామెంట్లు (0)