Magazines

మీకు నచ్చిందే చేయండి..!

56 నిమిషాల క్రితం

Do what you like..!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 3 నిమిషాల చదవడం

చాలామంది పిల్లలు ఒక కోర్సును పూర్తిచేసి, మరొక కోర్సుకు ఎంచుకుంటారు. పూర్తి చేసిన కోర్సు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెల్సుకోకుండానే రెండవ కోర్సులోకి వెళతారు. రెండవది కూడా పూర్తి చేసిన తర్వాత దాని గురించి కూడా తెల్సుకోకుండానే పాక్షికమైన సమాచారంతో ఉపాధి యత్నాలు, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. కానీ అలాంటి కోర్సుల పట్ల పూర్తి అవగాహన ఉంటే ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అలాంటివారి కోసమే ఓ చిన్న కథ...



ఓ మనస్తత్వ శాస్త్రవేత్త చింపాంజీ ప్రవర్తనపై అద్భుతమైన ప్రయోగం చేశాడు. ఒక చింపాంజీని పెద్ద పంజరంలో బంధించి ప్రతిరోజు అరటిపండ్లను ఇచ్చేవాడు. అలా అరటిపండ్లను ఇవ్వడానికి ముందు చింపాంజీకి అందకుండా దూరంగా శుభ్రంగా ఉండే పెద్ద సైజులో ఉన్న ఓ అరటిపండును పెట్టాడు. అయితే చింపాంజీ పంజరం ముందున్న ఆ అరటిపండును చూసి దాన్ని ఎలాగైనా అందుకోవాలని, తినాలని చేతులతో దాన్ని దగ్గరికి తీసుకొనే ప్రయత్నం చేసేది. కానీ అది అందనంత దూరంలో ఉంది. ఆ తర్వాత తన పంజరంలోకి వచ్చి పడే ఎంత పరిశుభ్రంగా ఉండే అరటిపండ్లను పెట్టినా దానికి అందని దూరంలో ఉన్న అరటిపండు

కోసమే ‘ప్రయత్నం’ చేసేది. ఇలా కొద్ది రోజుల ప్రయత్నం తర్వాత దాని చుట్టూ ఎన్నో అరటిపండ్లు వున్నా తినకుండా అందని అరటిపండు కోసం ప్రయత్నిస్తూ చివరకు పంజరంలోనే చనిపోయింది. ఎంత బాధ కలిగించే సంఘటన ఇది ఆలోచించండి?

కానీ ఆ శాస్త్రవేత్త ఆ పెద్ద అరటిపండును ఓ బొమ్మలా (Model Banana) పెట్టాడు. అది నిజమైన అరటిపండు కానే కాదు. వాస్తవంగా మన జీవితంలో కూడా సామాజిక మాధ్యమాలలో వచ్చే రీల్స్, వాట్సప్ మొదలైన వాటిని ఎవరో అపరిచిత వ్యక్తులు వారి జీవితంలో జరిగిన సంఘటనలను ఎడిట్ చేసి పెడితే, వాటిని చూసి మనమెందుకు అలా ఎదగలేకపోతున్నాము అని మదనపడుతూ ఉంటాము. కానీ వాస్తవం ఏమిటంటే కాలం ఎన్నో అమూల్యమైన అవకాశాలను మీ ముందు ఉంచుతుంది. వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఇతరులు పెట్టిన పోస్టుల గురించి ఆలోచిస్తూ విలువైన కాలాన్ని దుర్వినియోగం చేస్తారు. జీవితమంతా నిరాశ, నిస్సారంగా ఉందని, వారి జీవితంలో అద్భుతమైన మలుపులు ఉన్నాయని భ్రమిస్తాము. కానీ ఆ పోస్టులు పెట్టిన వారి నేపధ్యం మీ కన్నా బాధాకరంగా, పేదరికంతో మగ్గిపోయిన జీవితాల్లో నుండి వచ్చిన వారే అనే సంగతి మరువకూడదు. వాటిని వారు చూయించకుండా కేవలం “సక్సెస్”ను మాత్రమే సోషల్‌ ‌మీడియాలో పోస్ట్‌ ‌చేస్తారు.

అంతెందుకు ఈ మధ్యనే భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి వయస్సు కేవలం 15 ఏండ్లు మాత్రమే. బీహార్లోని ఓ మారుమూల పల్లెటూరి కుర్రవాడు నేడు ఈ స్థాయి వెనుక ఏండ్ల కఠోరమైన సాధన ఉందన్న విషయం మరువకూడదు. అలాగే తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో ఇటీవలే వరుస విజయాలు అందుకుంటున్న యువనటి మమితా బైజు నీట్ పరీక్షలో ఆశించిన ర్యాంక్ రాకపోగా ఆకాస్మాత్తుగా వచ్చిన సినిమా అవకాశాలను ఉపయోగించుకొని నేడు అగ్రస్థానంలో కొనసాగుతుంది. కాబట్టి విజయాలు ఎవరినీ రాత్రికి రాత్రే వరించవు. ఎవరి జీవితం అయినా తీసుకోండి. కేవలం ఒక్క రోజులో “విజయం” సాధించినవారు ఎవరూ ఉండరు. కాబట్టి “సాధనమున పనులు సమకూరు ధరలోన” అన్నారు పెద్దలు. ఏ పనైనా సాధన చేస్తున్న కొద్దీ అందులో అనుభవం వస్తుంది. నైపుణ్యం మెరుగుపడుతుంది. అంతిమంగా అందులో మీ పరిపక్యమైన పనితీరు ఆధారంగా ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. మధ్యలో ఏవో చిన్న చిన్న అవాంతరాలు వస్తాయి. ఆటంకాలు లేని రంగం ఏదైనా ఉందా చెప్పండి.

అంతెందుకు ఈ ఏడాది “ఎల్ నినో” ప్రభావం వల్ల దేశంలో కొన్ని కోట్ల మంది రైతులు తమ వ్యవసాయ పద్దతులు, సాంప్రదాయ విధానాలు మార్చుకొని నిత్యం పండించే పంటలు కాకుండా ప్రత్యామ్నాయ విధానాల వైపు మళ్ళారు. ఇది మీ అందరికి తెలిసిన విషయమే కదా? అలాంటప్పుడు మీ అకాడమిక్ నాన్ అకాడమిక్ పరీక్షలు, పోటీ పరీక్షలు, వ్యాపారాలు, ఇతరత్రా ఏమైనా కావొచ్చు. అన్నీ మీకు అనుకూలంగా జరగాలని ఆశించటం అత్యాశే అవుతుంది. కాబట్టి మీరు నిర్ణయించుకునే మీ లక్ష్యాలు ఏవైనా కావొచ్చు.. ముందుగా మీ ముందున్న సాధ్యాసాధ్యాలు పరిశీలించండి. దరిదాపుల్లో వున్న అవకాశాలను ఉపయోగించుకొని ఎదగటానికి ప్రయత్నించండి. మీకు సాధ్యం కానీ పని ఏదైనా అనిపిస్తే వెంటనే దాని నుండి పక్కకు తప్పుకోండి. “నదిని చూడండి తన ప్రవాహానికి ఏదైనా ఆటంకం వస్తే తన బలాన్నంతా కూడదీసుకొని నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. లేనిపక్షంలో పక్కకు దారి చేసుకొని వెళుతుంది. అంతే కానీ ఒకేచోట స్థిరంగా ఉండదు. ప్రవహించే నీరు స్వచ్చంగా ఉంటుంది. ఒకేచోట నిలబడిన నీటికి ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా చేరి దుర్గంధం వెదజల్లుతుంది. కాబట్టి స్వచ్చమైన నీటిలా ప్రవహించండి?

ఏం చేస్తే మీ జీవితం సంతోషంగా ఉంటుందనే అన్వేషణను మొదలు పెట్టండి. అంతేకాని ఇతరులను అనుకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించకండి. అది మిమ్మల్ని ఎల్లకాలం కాపాడలేదు. మీకు రాని విద్యలు ఇతరులకు అబ్బితే మీరు అనుకరించాలని ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుందా చెప్పండి? మీకు ఏం వస్తుందో అందులోనే రాణించే ప్రయత్నం చేయండి. అప్పుడే ఏ పని నేర్చుకున్నా అందులో మీరు అనుభవజ్ఞులు అవుతారు. కాదంటారా చెప్పండి. అందుకే “నచ్చిన రంగంలో రాణించండి.” నచ్చని వాటిని వదిలేయండి. మానసిక ప్రశాంతతను దూరం చేసే వాటిని నేత్తికెత్తుకొని బాధపడటం కన్నా వాటిని వదిలేసి ప్రశాంతంగా ఉండటం ఉత్తమం.

డా.మహ్మద్ హసన్ 9908059234

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్