మియాపూర్ భూములతో వ్యాపారం చేయొద్దు
భవిష్యత్ తరాల కోసం రక్షించాలి
నివాసం ఉంటున్న పేదలకు ఇంటి పట్టాలివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ..మియాపూర్ భూముల పరిశీలన
నవతెలంగాణ-మియాపూర్
రంగారెడ్డి జిల్లా మియాపూర్ లోని 550 ఎకరాల ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఆ భూములతో వ్యాపారం చేయవద్దని సూచించారు. ఆ ప్రాంతంతో నివాసం ఉంటున్న పేదలకు ఇంటి పట్టాలివ్వాలని కోరారు. మియాపూర్ భూములను ప్రభుత్వ భూములుగా తేలుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ శనివారం మియాపూర్ భూముల్లో సీపీఐ(ఎం) జిల్లా బృందంతో కలిసి జాన్వెస్లీ పర్యటించారు. ఈ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సదరు భూములను వేలం వేస్తామని మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ భూమి అంటే కేవలం పాలకులు అమ్ముకునే వ్యాపార వస్తువుగా చూడొద్దని సూచించారు.
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆ భూమిని పేదలకు ఉపయోగపడేందుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ లక్షలాది మంది నిరు పేదలు ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారనీ, ఈ భూమిని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదలకు భూములు కేటాయించకుండా బడాబాబు లకు కట్టపెట్టే ప్రయత్నం చేస్తే.. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు చేపడు తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో పదిహేను వేల కుటుంబాలు ఈ భూమిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని కొన్నేండ్లుగా జీవిస్తున్నాయని తెలిపారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఈ భూమిని రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగపడే విధంగా తీసుకునే ప్రతి చర్యకూ తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సామెల్, ఆ పార్టీ జిల్లా నాయకులు జగదీష్, జగన్, మాణిక్యం, కృష్ణ, కాలనీవాసులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)