Magazines

మోడీ పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యం

26 నిమిషాల క్రితం

Agricultural
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 2 నిమిషాల చదవడం

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

అమెరికా-భారత్ వ్యవసాయ వాణిజ్య ఒప్పందాలను 
రద్దు చేయాలి:వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొతినేని సుదర్శన్ రావు డిమాండ్

ఖమ్మంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 
భారీ మోటార్ సైకిల్ ప్రదర్శన


నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్ కంపెనీలకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తూ, రైతులపై భారం మోపి దేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొతినేని సుదర్శన్ రావు విమర్శించారు. ఢిల్లీ రైతు ఉద్యమం ప్రారంభమైన నవంబర్ 26వ తేదీని పురస్కరించుకుని, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు గురువారం ఖమ్మంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ మోటార్ సైకిల్ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరిపారు. ​ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ‌వారు మాట్లాడారు. ఢిల్లీ రైతు ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.


దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా వాటిని నివారించాల్సిన మోడీ ప్రభుత్వం, అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమలు చేసేందుకు ఉత్సుకత చూపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల సబ్సిడీని తగ్గిస్తూ అంతర్జాతీయ మార్కెట్ ధరల భారాన్ని నేరుగా రైతులపై వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగానికి రాయితీలు ఇవ్వకుండా, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రద్దు చేయడం, పన్నులు తగ్గించడం వంటి విధానాలతో కేంద్రం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవింద రావు, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బందెల వెంకయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరామిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కరువు ఏర్పడినా, తుఫాను నష్టాలు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పరిహారం అందించడం లో విఫలమయ్యా యని ఆరోపించారు.

ఉపాధి హామీ చట్టాన్ని కేవలం ఒక పథకంగా మార్చి పేదలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి ఏడాదికి 200 రోజుల పని కల్పించాల ని డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో వివిధ రైతు సంఘాల జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, దొండపాటి రమేష్, మలీదు నాగేశ్వరరావు, వై.ప్రకాష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం వెంకటే శ్వరరావు, నాయకులు కొల్లేటి నాగేశ్వరరావు, ఎస్.కె.మీరా, వాసిరెడ్డి ప్రసాద్, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, దొండపాటి నాగేశ్వర రావు, గోడవర్తి నాగేశ్వరరావు, ఎస్.కె. ఖాసిం, బోడపట్ల సుదర్శన్, ప్రవీణ్, రాజు, పోటు కళావతి, నిర్మల, పాపారావు, సుదర్శన్, మోహన్ రావు, పాశం అప్పా రావు, శివలింగం, జె.రామారావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్