యువ వికాసం ఓ ఎండమావి
కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి విముక్తికి మరో పోరాటం : రాహుల్ గాంధీపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మూడేండ్ల క్రితం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఒక నాటకానికి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. నాటకీయ లైటింగ్ మధ్య ఇరానీ చాయ్ తాగుతూ, ఫొటోలకు పోజులిస్తూ, ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించారని గుర్తు చేశారు. మూడేండ్ల తర్వాత అసలు నిజం బయటపడిందని గురువారం రాహుల్ గాంధీపై ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఒక మిథ్య అనీ, యువ వికాసం ఒక మిరాజ్ అని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ తెలంగాణ యువత నమ్మకాన్ని అపహాస్యం చేసేలా ఉందని తెలిపారు. ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్ కాదనీ, చాయ్ తాగుతూ చేసే పబ్లిసిటీ స్టంట్ అంతకంటే కాదని పేర్కొన్నారు. ఉద్యోగాలు కల్పించాలంటే దార్శనికత ఉండాలని తెలిపారు. కనీసం ఒక్క ఉద్యోగం కల్పించాలన్నా అచంచలమైన నిబద్ధత ఉండాలనీ, అందులో కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు ఏమీ చేయలేదని పదేపదే నిరూపించుకున్నదని తెలిపారు. కానీ రాహుల్ గాంధీకి ఒక విషయం గుర్తు చేస్తున్నానని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ కోసం నిరంకుశ కాంగ్రెస్‌తో పోరాడిన యువత మళ్లీ పోరాడగలదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ దుష్ట కబంధ హస్తాల నుంచి తెలంగాణను మరోసారి విముక్తి చేయడానికి వారు పోరాడతారని తెలిపారు. ఇది కేసీఆర్ గడ్డ, పోరాట యోధుల గడ్డ, పోరాట యోధులు ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్న గ్రామాలు కేసీఆర్ పాలనలో కళకళలాడిన గ్రామాలు నేడు కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ పంచాయతీలు, 2024–25 నాటికి ఆర్థిక లోటులోకి జారుకున్నాయని పేర్కొన్నారు. తెలంగా ణ గ్రామ పంచాయతీల వ్యయం 2022-23లో సగటున రూ.16.59 లక్షలు ఉంటే 2024-25 నాటికి కేవలం రూ.6.24 లక్షలకు దిగజారిందని వివరిం చారు. దీంతో గ్రామాల్లో కొత్తగా ఏ అభివృద్ధి పనులూ జరగకపోగా కనీసం పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ కూడా సరిగ్గా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ఆనాడు కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి అవినీతి, అరాచక పాలనలో తెలంగాణ పల్లెలు గొల్లుమంటున్నాయని విమర్శించారు.






కామెంట్లు (0)