ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక చొరవ చూపాలి
కరువును జయించేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించాలి
రైతులకు రుణాల పునర్వ్యవస్థీకరణతోపాటు రబీకి కొత్త రుణాలు అందించాలి
విద్యా, గృహ, ఎంఎస్ఎంఈ, మౌలిక సదుపాయాల రుణాల పెంపునకు ప్రాధాన్యమివ్వాలి : ఎస్ఎల్బీసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు వారికి అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. అర్హులైన రైతుల పంట రుణాలను ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పునర్వ్యవస్థీకరించడం, రీషెడ్యూల్ చేయడంతోపాటు రబీ సీజన్‌కు అవసరమైన కొత్త రుణాలను సకాలంలో అందించాలని సూచించారు. రైతులకు రుణాల మంజూరులో జాప్యం చేయకుండా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు చొరవ చూపాలని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూఅర్హులైన విద్యార్థులకు గరిష్ఠ స్థాయిలో విద్యారుణాలు అందించాలని కోరారు. విద్యా రుణాల మంజూరుపై ఎస్ఎల్బీసీ కన్వీనర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. వ్యక్తిగత గృహ నిర్మాణానికి రుణాలు అందించడంలోనూ బ్యాంకులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. గృహ నిర్మాణ సంస్థలకు రుణాలివ్వడానికే పరిమితం కాకుండా సామాన్య ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు వ్యక్తిగత గృహ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), మౌలిక సదుపాయాల రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే ఎంఎస్ఎంఈ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందనీ, ఈ రంగానికి రుణాల పెంపు ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయని వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి సేవల రంగం వృద్ధికి కీలకమనీ, ఈ రంగానికి తగిన స్థాయిలో రుణాలు అందించాలని సూచించారు.
కలెక్టర్లు, బ్యాంకు అధికారులతో సమన్వయంతో పనిచేయాలి
ఎల్‌నినో ప్రభావం కేవలం తెలంగాణకే పరిమితం కాదనీ, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తోందని భట్టి అన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించామనీ, వాటిలో 111 మండలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వివరించారు.
రైతాంగాన్ని బ్యాంకర్లు ఆదుకోవాలి : తుమ్మల
సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంట రుణాల రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ చేపట్టాలని కోరారు. రబీ పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలనీ, డ్రిప్, స్ప్రింక్లర్ సాగుకు విరివిగా రుణాలివ్వాలని చెప్పారు.







కామెంట్లు (0)