Magazines

రేపటి నుంచి సీఎం మూడ్రోజుల కొడంగల్ పర్యటన

21 గంటల క్రితం

Kodangal
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 3 నిమిషాల చదవడం

రూ.9,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభం

రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశాలు


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం నుంచి మూడు రోజులపాటు (7, 8, 9 తేదీల్లో) కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించడంతో పాటు రూ.9,100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పూర్తయిన భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.శనివారంఉదయం 10.30 గంటలకు సీఎం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు అక్కడ రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రదర్శన స్టాళ్లను సందర్శిస్తారు. ఒంటి గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు హకీంపేట నుంచి రోడ్డు మార్గంలో కొడంగల్ నివాసానికి బయలుదేరుతారు.

రాత్రి కొడంగల్‌లో బస చేస్తారు. నవంబర్ 8వ తేదీ (ఆదివారం) ఉదయం 9.15 గంటలకు కొడంగల్ నివాసం నుంచి బయలుదేరి హకీంపేట చేరుకుంటారు. 9.30 నుంచి 10.20 గంటల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమవుతారు. 10.20 గంటలకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఉదయం 10.30 కు లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10.45 కు హకీంపేటలో రూ.4 కోట్లతో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. ఉదయం 11 కు రూ.2.35 కోట్లతో నిర్మించిన హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 11.30 గంటలకు బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను, 11.45 గంటలకు రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 12.45 గంటలకు దుద్యాలలో రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను, 1.15 గంటలకు రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.40 గంటలకు కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు శంకుస్థాపన చేస్తారు. ఈ రహదారిని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వద్ద జాతీయ రహదారి 167ఎన్ వరకు నిర్మించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు దౌల్తాబాద్ మండలం బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దౌల్తాబాద్‌లో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారు. అనంతరం కొడంగల్ నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. ​రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వీటిలో కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వరకు రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు–2, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులు, రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌ రెండో దశ పనులు ఉన్నాయి. విద్యా రంగంలో రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పనులు ఉన్నాయి. రూ.41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్ స్టాండ్లు, రూ.20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ.4.45 కోట్లు, కొడంగల్‌లో నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్లు కేటాయించారు. హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు.

రూ.46.08 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 10 ప్రభుత్వ భవనాలను ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దుద్యాల సమీకృత మండల కార్యాలయ భవనం, కోస్గి సైన్స్ మ్యూజియం, హకీంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వీటిలో ఉన్నాయి. దుద్యాల, బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్లు, బొంరాస్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొడంగల్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం, దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.నవంబర్ 9వ తేదీ (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కొడంగల్ నివాసం నుంచి హకీంపేటకు బయలుదేరుతారు. రాత్రి 7 గంటల వరకు హకీంపేటలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్