సామినేని రామారావు మర్డర్ను పక్కదారి పట్టించే కుట్ర
అసలు హంతకులను కాపాడేందుకే డ్రామా
ప్రజా భవన్లో స్క్రిప్ట్ తయారీ
సీపీని వెంటనే సస్పెండ్ చేయాలి
బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డైరెక్షన్ లో సీపీఐ(ఎం) నేత సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టించేలా సీపీ విచారణ సాగుతోందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కల్పిత డ్రామాకు భట్టి స్క్రిప్ట్ తయారు చేస్తే దానిని సీపీ పక్కాగా అమలు చేస్తున్నారని అన్నారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నానాగేశ్వరరావుతో కలిసి పోతినేని మాట్లాడారు. ఈ కట్టుకథకు ప్రజా భవన్ లో స్కెచ్ వేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామారావు హత్యలో అసలు హంతకులను, రౌడీలను, గూండాలను కాపాడేందుకు పోలీస్ కమిషనర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
మొదటి నుంచి తాము చెబుతున్నట్టుగానే రామారావు రిమాండ్ రిపోర్ట్ లో 14 మంది సాక్షులను విచారించామని చెప్పినప్పటికీ, అందులో ఇద్దరు ఉద్యోగులు మినహా మిగిలిన వారివి వేరే పేర్లు చెబుతున్నారని స్పష్టం చేశారు. హత్య వెనుక అసలు మోటివ్ ను పక్కన పెట్టి, సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తూ తప్పుడు కథలు అల్లుతున్నారని చెప్పారు. సీపీ ఖమ్మం జిల్లా ప్రజల ముందు పెద్ద నాటకం చూపించారని తెలిపారు. మధిర నియోజకవర్గం లో హత్యాకాండ ద్వారా భట్టి రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు మా పార్టీకి చెందిన ముగ్గుర్ని హత్య చేశారని చెప్పారు. భట్టి అన్యాయాలు, అవినీతి, అక్రమాలు ప్రశ్నించినందుకే సామినేని రామారావు ను హత్య చేశారని అన్నారు. హత్యకు నెల రోజుల ముందు రామారావు పాదయాత్ర చేశారని పేర్కొంటూ ఆ సందర్భంగా రామారావు ప్రసంగం ఆడియో ను విలేకరులకు వినిపించారు.
ప్రజాభవన్ లో భట్టి సమక్షంలో తయారు చేసిన స్క్రిప్ట్ అట్టర్ ప్లాప్ కాక తప్పదని హెచ్చరించారు. సీపీ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. భట్టి ప్రోత్సాహం తోనే రామారావు ను హత్య చేశారన్నది వాస్తవమన్నారు. ఆర్థిక వ్యవహారాలు కూడా కారణమంటున్నారని, అవేమిటో తేల్చాలని డిమాండ్ చేశారు. రామారావు హత్యకు కారణమైన హంతకులను శిక్షించే వరకు , అసలు దోషులు పట్టుబడే వరకు సీపీఐ(ఎం) తరఫున న్యాయ పోరాటం చేస్తామని, రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సీపీని తక్షణమే సస్పెండ్ చేయాలి : నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లాలో ఐపీఎస్ వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న పోలీస్ కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామారావు హత్య కేసులో ఏడాది గడిచినా హంతకులను అరెస్ట్ చేయకుండా, పోలీసు శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీపీ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. సీఎంను కలిసి సిట్ ప్రత్యేక దర్యాప్తు కోరినా ఫలితం లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా భట్టి అడ్డుకున్నారని ఆరోపించారు. సీపీ చెబుతున్న అబద్ధపు కథలను రామారావు కుటుంబ సభ్యులు, ప్రజలు, చివరికి పోలీసు అధికారులే నమ్మలేక నవ్వుకుంటున్నారని అన్నారు. అధికార పక్షం ఒత్తిళ్లకు పూర్తిగా తలొగ్గి, ఆత్మగౌరవాన్ని కూడా వదిలిపెట్టి భ్రష్టుపట్టిన రీతిలో వ్యవహరిస్తున్న సీపీ ఖమ్మంలో ఉండటం జిల్లాకే అవమానకరమన్నారు.
హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్న ఈ సీపీని వెంటనే సస్పెండ్ చేసి, సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రామారావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు, హంతకులను చట్టం ముందు నిలబెట్టే వరకు మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీ ఉద్దేశ పూర్వకంగా నేరస్తులను పట్టుకోకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని తెలిపారు. రామారావు భార్య గుర్తు పట్టి కొందరి పేర్లు చెప్పినా వారిని విచారించలేదన్నారు. రామారావు వర్థంతి సమీపిస్తుండడంతో హడావిడిగా ఎవర్నో పట్టుకొచ్చి సరికొత్త నాటకానికి తెరతీశారని అన్నారు. హంతకులు ఆ ఊర్లోనే ఉన్నా పట్టుకోవడం లేదని తెలిపారు. ఈ విషయంలో సీఎంను, డీజీపీని కలిసి, సిట్ విచారణ కోరతామన్నారు. అదే విధంగా సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా కోరతామన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బండి పద్మ, కళ్యాణం వేంకటేశ్వరరావు, మాదినేని రమేష్, భూక్యా వీరభద్రం, వై.విక్రమ్, పార్టీ సీనియర్ నాయకులు చింతలచెర్వు కోటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి ఎం. గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)