పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం రాష్ట్ర శాసనమండలి ప్రాంగణాన్ని సందర్శించారు. అక్కడ ప్రతిపాదించిన అభివృద్ధి, సుందరీకరణ పనుల ప్రణాళికలపై హైద్రాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మెన్, వైస్ ఛైర్మెన్, డిప్యూటీ స్పీకర్లతోపాటు శాసనసభ కార్యదర్శి, శాసన మండలి కార్యదర్శుల నివాస భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనల వివరాలను తెలుసుకున్నారు. అలాగే, శాసనసభ ప్రాంగణానికి సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్, అనుబంధ భవనం ఏర్పాటు, ఇతర అనుబంధ సౌకర్యాల అభివృద్ధి అంశాలను కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖకు చెందిన భూమిని శాసనసభకు బదిలీ చేయడంతో పాటు, పక్కనే ఉన్న డీజీపీ కార్యాలయానికి సంబంధించిన కొంత భూమిని కూడా శాసనసభకు బదిలీ చేసే అంశంపై కూడా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదిత అభివృద్ధి పనులకు గుర్తించిన స్థలాలను సైతం పరిశీలించారు. అనుబంధ భవనం, పరిపాలనా భవనం, శాసనసభా పక్ష కార్యాలయాలు, విశ్రాంతి భవనం, క్రీడా మైదానం, పార్కింగ్ సౌకర్యాల అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ప్రాజెక్టు ప్రతిపాదనలు, ప్రస్తుత స్థల పరిస్థితులు, ఇంజినీరింగ్ అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ ప్రాజెక్టులో పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధి విధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఇప్పటికే ఉన్న పచ్ఛదనానికి ఎలాంటి విఘాతం కలగకుండా, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తూ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ నయీముద్దీన్, ఆర్ అండ్ బీ ఎస్ఈ మాధవి, ఈ ఈ మనోహర్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)