Magazines

ఇది పాలకుల వికృతి తెచ్చిన కరువు

56 నిమిషాల క్రితం

Kalvakuntla Taraka Rama Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

తెలంగాణలో మళ్లీ కుట్రలు జరుగుతున్నాయి

గోదావరి జలాలు మన పొలాలకు పారించాలి

అదే మల్లావఝుల సదాశివుడికి నిజమైన నివాళి : స్మారక పురస్కార ప్రదానోత్సవంలో 
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

‌ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదనీ, పాలకుల వికృతి తెచ్చిన కరువని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ‌విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌‌ ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ప్రముఖ కవి, గీతరచయిత, అక్షరాల సైరన్‌, వాగ్గేయకారుడు మల్లావఝుల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ కవి, రచయిత చమన్‌‌సింగ్‌, ప్రముఖ సాహిత్య విమర్శకులు, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్‌కు పురస్కారాలను కేటీఆర్‌ అందజేసి సన్మానించారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన తిరునగరి దేవకిదేవి, కవ్వంపల్లి స్వామిలను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంతోనే తెలంగాణలో కరువు ‌పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. గోదావరిలో నీళ్లున్నా చేలు ఎడారులుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. గోదావరిలో 750 టీఎంసీలు, కృష్ణాలో 250 టీఎంసీలు కలిపి వెయ్యి టీఎంసీల నీరు కిందికి వదిలేశారని వివరించారు. రోజూ లక్ష క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయనీ, నీళ్లు ఎత్తాలని కోరినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని చెప్పారు. పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదనీ, పాలకులు తెచ్చిన కరువని విమర్శించారు. కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టారని అన్నారు. రవిగాంచని చోట కవిగాంచెను అని పెద్దలు ఎప్పుడో అన్నారని గుర్తు చేశారు. కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి అని అన్నారు. గోదావరిఖని మట్టిలోనే ఏదో మహత్యం ఉందనీ, కన్నీటి చుక్కల నుంచే కత్తులు మొలిపించిన అద్భుత కవి మల్లావఝల సదాశివుడు అని చెప్పారు. గోదావరి జలాలను మళ్లీ పొలాలకు పారిస్తేనే మల్లావఝల సదాశివుడికి నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ మళ్లీ దీపస్తంభంలా వెలుగొందాలని ఆకాంక్షించారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షులు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, కార్పొరేషన్‌ ‌మాజీ చైర్మెన్లు దేవీప్రసాద్‌, ఆయాచితం శ్రీధర్‌, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్‌అలీ తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్