సురక్షితంగా స్వదేశానికి తుప్పుడు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసం చేయడంతో మస్కట్‌లో చిక్కుకుపోయిన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి రప్పించటం ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మాట నిలబెట్టుకున్నారు. నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని ఆమె కుమారుడు రాజుకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఆ కుటుంబంలో ఆనందం నింపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని గోకఫసల్వాడ గ్రామానికి చెందిన తుప్పుడు లక్ష్మి, భర్త వెంకటప్ప ఉపాధి కోసం ఫిబ్రవరి 27న మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఏజెంట్ చెప్పిన పనికి భిన్నమైన పని అప్పగించడంతో ఆమె తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతే కాకుండా యజమాని (కఫీల్) ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని స్వదేశానికి పంపించేందుకు నిరాకరించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తనను విదేశాలకు పంపించిన ఏజెంట్ కూడా ఫోన్‌కు స్పందించకుండా, తిరిగి భారత్‌కు పంపించేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్టు లక్ష్మి కుటుంబానికి తెలిపింది. ఈ క్రమంలో ఆమె వైఫై, సిమ్ కార్డు సేవలు కూడా నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. చివరకు పక్కింటి వారి ఇంటర్నెట్ సహాయంతో తన కుమారుడు రాజును సంప్రదించి అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
తల్లి పడుతున్న కష్టాలను చూసి ఆందోళనకు గురైన కుమారుడు రాజు సెప్టెంబర్ 29న కేటీఆర్‌ను కలిసి తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. స్పందించిన కేటీఆర్ నెల రోజుల్లోనే పాస్‌పోర్టు సమస్యను పరిష్కరించి, తల్లిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తానని రాజుకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు లేఖ రాయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో లక్ష్మి సురక్షితంగా భారత్‌కు తిరిగి చేరుకున్నారు.
స్వదేశానికి చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకున్న అనంతరం లక్ష్మి మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో అండగా నిలిచి, కుమారుడికి ఇచ్చిన మాటను నెల రోజుల్లోనే నిలబెట్టుకున్న కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తుప్పుడు లక్ష్మి మాట్లాడుతూ “నా కొడుకుకు కేటీఆర్ నెల రోజుల్లోనే నన్ను ఇంటికి తీసుకొస్తానని మాట ఇచ్చారు. అన్న ఇచ్చిన మాట ప్రకారం నన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. నేను, నా కుటుంబం ఎదుర్కొంటున్న కష్టకాలంలో కేటీఆర్ అన్న మాకు అండగా నిలిచారు. ఆయన చేసిన సహాయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. కేటీఆర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని లక్ష్మి తెలిపారు.







కామెంట్లు (0)